ఆపరేషన్ ‘ఔటర్’
- జవహర్‌నగర్, గబ్బిలాలపేట, నందమూరినగర్‌లో ఇంటింటి తనిఖీ
- శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు సోదాలు
- అదుపులో 10 మంది అనుమానితులు, 40 వాహనాల స్వాధీనం
జవహర్‌నగర్: నగర శివారులపై సైబరాబాద్ పోలీసులు డేగకన్ను వేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక క్రైం అదనపు డీసీపీ జి.జానకీషర్మిల ఆధ్వర్యంలో మల్కాజిగిరి డీసీపీ కోటేశ్వర్‌రావ్, ఏసీపీలు ప్రకాశ్‌రావ్, రామ్‌కుమార్‌లతో పాటు 30 మంది ఇన్‌స్పెక్టర్లు, 30 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 240 మంది కానిస్టేబుళ్లు జవహర్‌నగర్‌లోని గబ్బిలాలపేట, నందమూరినగర్ కాలనీలలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సోదాలు చేస్తున్నంత సేపు బస్తీలలోకి, బయటకు ఎవరిని అనుమతించకుండా రెక్కీ నిర్వహించారు. బస్తీలలోని ప్రతీ ఇల్లు ముఖ్యంగా అనుమానం ఉన్న నేరగాళ్ల నివాసాల్లో సోదాలు చేశారు.
హైదరాబాద్‌ను నేరరహితంగా తీర్చిదిద్దాలని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు నగర శివారుల్లో సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి నగరంలో దోపిడీ,దొంగతనాలకు పాల్పడిన నేరగాళ్లు శివార్లలో తలదాచుకునే అవకాశం ఉండడంతో ఈ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహించారు.
కొందరికి భయం... మరికొందరి హర్షం
ఆకస్మికంగా పోలీసులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించడంతో కొందరు బయాందోళనలు చెందగా, మరి కొందరు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛందంగా మహిళలు బయటికి వచ్చి సెర్చ్ ఆపరేషన్ కోసం వచ్చిన అదనపు డీసీపీ జానకీషర్మిలతో తమ కష్టాలను స్వయంగా చెప్పుకున్నారు. కాలనీలలో బెల్టు షాపులు ఉండడం వల్ల వీధుల్లో తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జవహర్‌నగర్ ఎస్‌ఐ రాములును పిలిపించి పేదల కాలనీలలో మరింత రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కొనసాగిన సోదాల్లో మొత్తం 1000 ఇళ్లను పైగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఒక పాత నేరస్తుడు ,10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 32 బైక్‌లు,6 ఆటోలు,2 కార్లను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.
నేరగాళ్ల ఏరివేతే లక్ష్యం : జి.జానకీషర్మిల
అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, నేరగాళ్ల ఏరివేతే లక్ష్యంగా పనిచేస్తామని క్రైం అదనపు డీసీపీ జానకీషర్మిల పేర్కొన్నారు. నగర శివారు ప్రాంతాల్లోని నేరస్తులపై డేగకన్ను పెట్టామన్నారు. ప్రజలకు ఎలాంటి అనుమానం వచ్చినా 100 నెంబర్‌కు ఫోన్ చేస్తే క్షణాల్లో పోలీసులు చేరుకుంటారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు.