తెలంగాణలో అశ్లీల వెబ్సైట్లకు కళ్లెం!
ఇంటర్నెట్ లో అశ్లీల వెబ్సైట్లకు కళ్లెం వేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మహిళలపై నానాటికీ పెరిగిపోతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా బూతు వైబ్సైట్ లను బంద్ చేయాలని సర్కారు యోచిస్తోంది. దాదాపు 1,350 అశ్లీల వెబ్సైట్లను మూసివేసేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నామని తెలంగాణ పోలీసు వ్యవస్థలోని ఐటీ విభాగం సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. పెద్దలు మాత్రమే వీక్షించే చిత్రాలు ఇకపై తెలంగాణ ఇంటర్నెట్ వినియోగదారులు అందుబాటులో ఉండవన్నారు. బూతు బొమ్మల వెబ్సైట్లను చెక్ పెట్టేందుకు చైనా ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే యోచనలో అధికారులున్నారు.
పోర్నోగ్రఫీ చూడాలనే వారు తరచుగా కొన్ని రకాల పదాలను ఉపయోగించి సెర్చ్ ఇంజిన్స్ లో వెతుకుతుంటారు. ఇలాంటి వెబ్సైట్లకు చెక్ పెడితే పోర్నోగ్రఫీ కంటెంట్ లభించదు. అయితే దీనికి కేంద్ర సమాచార-ప్రసారశాఖ, హోంమంత్రిత్వ శాఖ ఆమోదం లభించాల్సివుంది. కేంద్రం నుంచి అనుమతి లభిస్తుందన్న ఆశాభావాన్ని రాష్ట్ర అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే విధానపరమైన నిర్ణయమని, కేంద్ర నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని ఓ పోలీస్ అధికారి తెలిపారు.
మహిళలపై భద్రతపై ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ చేసిన సూచన ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా ముందుకెళుతోంది. లండన్ లాంటి నగరాల్లో అశ్లీల వెబ్సైట్లపై నిషేధం విధించిన విషయాన్ని కమిటీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ లో పోర్నోగ్రఫీ కంటెంట్ పెరిగిపోవడం పట్ల రాజకీయ పార్టీలు, బుద్ధిజీవులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అశ్లీల వెబ్సైట్లను బంద్ చేయాలన్న ప్రతిపాదనను వారు స్వాగతిస్తున్నారు. అయితే పోర్నోగ్రఫీ వెబ్సైట్లను మూసివేయడంతోనే సరిపెట్టకుండా, ఆన్లైన్ వేధింపులపై కూడా దృష్టి పెట్టాలని మహిళలు కోరుతున్నారు.