సమావేశంలో మాట్లాడుతున్న రాఘవేంద్రరావు. చిత్రంలో అనిల్, సురానా, బిస్వాస్, మధుసూదన్ (ఎడమ నుంచి కుడికి)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రాబోతోంది. రెండేళ్లుగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ప్లాస్టిక్ పార్క్ దస్త్రానికి ఈ ఏడాది మోక్షం కలగనుంది. ఈ విషయాన్ని కేంద్ర రసాయనాలు, పెట్రోరసాయనాల మంత్రిత్వ శాఖ సెక్రటరీ పి.రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. ‘‘త్వరలోనే తెలంగాణలో ఏర్పాటు చేయనున్న ప్లాస్టిక్ పార్క్‌పై ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర అధికారులతో సమావేశం నిర్వహిస్తాం. ప్రస్తుత అడ్డంకులను తొలగించి పార్క్ ఏర్పాటుపై కేంద్రం నుంచి సహాయం అందేలా చేస్తాం’’ అని ఆయన హామీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నంలోని మంఖాల్‌లో తొలిదశలో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు కోసం 120 ఎకరాలను కేటాయించామని.. తొలి దశలో రూ.500 కోట్ల పెట్టుబడులొచ్చే అవకాశముందని తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ) సీఈఓ వీ మధుసూదన్ చెప్పారు. తెలంగాణలో 1.25 లక్షల ఎకరాల పారిశ్రామిక స్థలం అందుబాటులో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందులో 5–6 వేల స్థలం పలు పరిశ్రమలకు కేటాయించేశామన్నారు.
ఆర్‌అండ్‌డీ చేయట్లేదు..
కేంద్ర రసాయనాలు, పెట్రోరసాయనాల మంత్రిత్వ శాఖ, ఫిక్కీ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 4–6 తేదీల్లో ముంబైలో ఇండియా కెమ్–2018 జరగనుంది. ఆ వివరాలు తెలిపేందుకు సోమవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ... విదేశాలతో పోలిస్తే మన దేశంలో రసాయనాల పరిశ్రమలో పరిశోధన – అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) చాలా తక్కువగా ఉందని చెప్పారు. కొత్త రసాయనాల ఉత్పత్తి, ప్రాసెసింగ్ వంటివి రావాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం దేశంలో రసాయన పరిశ్రమ 155 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ రంగంలో రసాయన డిమాండ్ కారణంగా 2020 నాటికిది 226 బిలియన్ డాలర్లకు చేరే అవకాశముంది. ప్రస్తుతం దేశీయ రసాయన పరిశ్రమలో 20 లక్షల మంది పనిచేస్తుండగా... ప్రపంచ రసాయన పరిశ్రమ 4.5 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
ప్లాస్టిక్ వినియోగంలో తెలంగాణది రెండో స్థానం..
ఈ సమావేశంలో పాల్గొన్న సౌత్ ఏపీఎంఏ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు తర్వాత రెండో స్థానం తెలంగాణదేనన్నారు. ఏటా పరిశ్రమ 8–10 శాతం వృద్ధిని నమోదు చేస్తోందని తెలిపారు. ఇంట్లో వినియోగించుకునే ప్లాస్టిక్ ఉత్పత్తులు అంటే కుర్చీలు, బకెట్లు, ఇతరత్రా హోమ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై 18 శాతం జీఎస్‌టీ ఉందని.. ఇది తయారీ రంగం, కొనుగోలుదారులకు భారంగా మారుతోందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఫిక్కీ తెలంగాణ చైర్మన్ దేవేంద్ర సురానా, కేంద్ర కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ జాయింట్ సెక్రటరీ సమీర్ కుమార్ బిస్వాస్ తదితరులు కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment