Banana leaf
-
Health Tips: అరిటాకులో తిన్నారంటే.. గ్రీన్ టీ తాగినట్లే..
Health Tips In Telugu: అరిటాకులో భోజనం చేసి ఎన్నాళ్లైంది? ఏమో గుర్తు చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. బఫే భోజనాలు వచ్చిన తర్వాత పెళ్లి భోజనం అరిటాకులో వడ్డించడం దాదాపుగా మర్చిపోయారు. అయితే, అరిటాకులో భోజనం చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే మాత్రం కచ్చితంగా ఆ అలవాటును వదులుకోరు. ►గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలను అరిటాకులో భోజనం చేయడంలోనూ పొందవచ్చు. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అరిటాకులో కూడా ఉంటాయి. వీటితోపాటు అరిటాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ సుగుణాలు అదనంగా ఉంటాయి. ఆహారం క్రిమికీటకాదులతో కలుషితమైతే వాటిని అరిటాకులోని ఈ సుగుణాలు హరించి వేస్తాయి. ►ఒకవేళ భోజనం విషపూరితమై ఉంటే అరిటాకు రంగు మారుతుందని, అందుకే రాజులు బంగారు, వెండి పళ్లేలు లేదా అరిటాకులో భోజనం చేసేవారని చెబుతారు. ప్రాచీన గ్రంథాలే కాదు అరిటాకులో భోజనం చేయడాన్ని ఆధునిక పరిశోధనలు కూడా ఆమోదిస్తున్నాయి. ఇందులోని సుగుణాలు క్యాన్సర్ నివారణిగా పని చేస్తాయని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఒక చైనా పరిశోధన... పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్థులకు అరిటాకు మేలు చేస్తుందని తెలియచేసింది. అరిటాకును అలాగే తినలేరు, కాబట్టి అందులో భోజనం చేయడం మంచిదని పరిశోధకుల అభిప్రాయం. నీటి బొట్టు నిలవదు ►అరిటాకును బాగా పరిశీలించండి. ఇది వాటర్‌ప్రూఫ్‌గా ఉంటుంది. నీటి బిందువులు తామరాకు మీద జారిపోయినట్లే అరిటాకు మీద కూడా నిలవకుండా జారిపోతాయి. ఆకులోని స్వచ్ఛమైన సువాసన, ఔషధగుణాలు వేడి పదార్థాల ద్వారా ఆహారంలో కలిసిపోతాయి. రుచిని ఇనుమడింప చేస్తాయి. అరిటాకులో భోజనం చేస్తే కలిగే ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్లోని రహస్యం అదే. పరిశుభ్రంగా తిందాం ►అరిటాకులో భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుకున్నాం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... పంటల మీద పెస్టిసైడ్స్ స్వైర విహారం చేస్తున్న ఈ రోజుల్లో అరిటాకును వాడడంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని తీరాలి. ఆకులను ఉప్పు కలిపిన నీటిలో ముంచి శుభ్రం చేయాలి. పైన చెప్పుకున్నట్లు అరిటాకు పై పొర మైనం రాసినట్లు వాటర్ ప్రూఫ్‌గా ఉంటుంది. కాబట్టి ఇతర ఆకులకు పట్టినట్లుగా క్రిమిసంహారక మందులు ఆకును అంటిపెట్టుకోలేవు. అయినప్పటికీ శుభ్రం చేయడంలో అలసత్వం వద్దు. చదవండి: Legs Swelling Health Tips: ధనియాలను నీటిలో మరిగించి తాగారంటే... -
ఆన్లైన్లో అరటి ఆకులు.. ధర తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే!
హైదరాబాద్: కాదేది వ్యాపారానికి అనర్హం అన్న చందంగా మారింది కార్పొరేట్ ఆన్లైన్ వ్యాపారస్తుల తీరు. వీరు పండుగల సీజన్లలో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి మరీ భోగి పిడకల దగ్గరి నుంచి మావిడాకులు, పూజా సామాగ్రి, కొబ్బరిచిప్పలు, వేప పుల్లలు వరకూ అన్నింటినీ ఇంటివద్దకే సరఫరా చేస్తున్నారు. తాజాగా అరటి ఆకులు కూడా ఆన్లైన్లో అమ్మకానికి రెడీ అయ్యాయి. హిందూ సంప్రదాయంలో అరటి ఆకులకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే గ్రామాల్లో దొరికినంత ఈజీగా పట్టణాల్లో అరటి ఆకులు దొరకవు. నగర వాసులు పండగలు, పబ్బాలు వస్తే వీటి కోసం మార్కెట్ల వద్ద బారులు తీరాల్సి వస్తుంది. దీంతో ఆన్లైన్ వ్యాపారులు అరటి ఆకులను ఇంటికే డెలవరీ చేస్తామంటూ ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. పల్లెల్లో అయితే ఫ్రీగా దొరికే వీటి ధర ఆన్లైన్లో ఎంతో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఐదు అరిటాకులు ధర రూ. 50 లు అంటూ బిగ్ బాస్కెట్ అనే అస్లైన్ కార్పొరేట్ వ్యాపార సంస్థ తమ సైట్లో ఆఫర్ ప్రకటించింది. ఇక్కడ బిగ్ బాస్కెట్ వాళ్లు కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారండోయ్. ఐదు ఆకుల అసలు ధర రూ. 62.50 అయితే, 20 శాతం డిస్కౌంట్ పోనూ రూ. 50కి ఇస్తున్నామని సదరు సంస్థ ప్రకటించింది. అసలే శ్రావణ మాసం పూజలు, ఫంక్షన్ల కాలం.. దీంతో అరిటాకులకు ఆన్ లైన్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోం: ఇదీ పరిస్థితి! -
వైరల్: భీమవరం అల్లుడికి అరిటాకు భోజనాలు
సాక్షి, భీమవరం: సంక్రాంతి సందర్భంగా ఒకే కుటుంబంలోని సభ్యులు పెద్ద పెద్ద అరటి ఆకుల్లో వరుసగా కూర్చుని భోజనం చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరవాసరం మండలం పంజా వేమవరం గ్రామానికి చెందిన పంజా మాణిక్యాలరావు సోదరుల సంతానమంతా సంక్రాంతి పండుగను వేడుకగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులంతా కలవడంతో పండుగ రోజుల్లో ఉత్సాహంగా గడిపారు. దీనిలో భాగంగానే పెద్ద పెద్ద అరటి ఆకులు వేసుకుని అందరూ సహపంక్తి భోజనం చేస్తున్న ఫొటో వాట్సప్‌లో రావడంతో వాటికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. చదవండి: అతిథిలా వచ్చిన నగల దొంగ దొరికాడు ఇప్పటికే భీమవరం పట్టణంలో కురిశేటి కాశీవిశ్వనాథం ఇంటిలో అల్లుడు నారాయణ అఖిల్‌కు 125 రకాల వంటలతో భోజనం పెట్టడం చర్చనీయాంశమైంది. ఒకే టేబుల్‌పై వెండి పళ్లెంలో వివిధ రకాల పిండి వంటలు, స్వీట్స్, కూరలు, ఐస్‌క్రీమ్ వంటివి వడ్డించారు. ఈ ఫొటోలకు కూడా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. పంజా వేమవరంలో అరటి ఆకులో సహపంక్తి భోజనం చేస్తున్న దృశ్యం -
అరటి ఆకులు.. ఆపండి
కర్ణాటక, బనశంకరి: బెంగళూరులో చెత్త సమస్య పరిష్కారానికి చరమగీతం పాడటానికి కొత్త, కొత్త ఆలోచనలు చేస్తున్న బీబీఎంపీ దృష్టి అరటి ఆకులపై పడింది. కళ్యాణ మంటపాలు, సభలు– సమావేశాలు, వేడుకల్లో టిఫిన్లు, భోజనాలకు అరటి ఆకులను వాడరాదని సూచిస్తోంది. వాటికి బదులు స్టీల్‌ప్లేట్లను ఉపయోగించాలని నిర్వాహకులను కోరుతోంది. అరటి ఆకులతో చెత్త సమస్య ఏర్పడుతోందని పాలికె భావిస్తుండడమే దీనికి కారణం. సమస్యలు వస్తున్నాయని.. ఇటీవలి కాలంలో కాగితం లేదా ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులను వేడుకల్లో అధికంగా వినియోగిస్తున్నారు. ఆ తరువాత గుట్టలుగా పేరుకుపోతున్న ఈ చెత్తను తరలించడం, ప్రాసెస్ చేయడం ఎంతో కష్టంగా ఉందని పాలికె చెబుతోంది. ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు కుళ్లిపోకపోగా, వర్షం నీటిలో కొట్టుకుపోయి డ్రైనేజీ కాలువల్లో చేరి నీటి ప్రవాహానికి అడ్డుపడుతున్నాయి. వర్షం వచ్చినప్పుడు కాలువలు పొంగి నీరు రోడ్లు, ఇళ్లలోకి చొరబడటానికి ఇదొక కారణమని తెలుస్తోంది. ఇక బీబీఎంపీ గ్యాస్ ఉత్పాదన కేంద్రాల్లో వాడేసిన అరటి ఆకుల ప్రాసెసింగ్ సవాల్‌గా మారుతుంది. అరటి ఆకులను సేకరించడం, తరలించడం కూడా కష్టంగానే ఉండడంతో బీబీఎంపీ వాటిపై నిషేధానికి మొగ్గుచూపుతోందని సమాచారం. రాష్ట్రంలో ఇప్పటికే ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్స్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. కానీకొన్ని ప్రాంతాల్లో కాగితం ప్లేట్లు, గ్లాసులు వినియోగిస్తుండగా అనేక ప్రాంతాల్లో అరటి ఆకులను వాడుతున్నారు. పాలికెతీరుపై తీవ్ర అభ్యంతరాలు అందరూ ఇష్టపడే అరటి ఆకులపై పాలికె ఆంక్షల మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తమౌతోంది. స్టీల్‌ప్లేట్లను కడగడానికి అధికనీటి వాడకం, ప్రత్యేక సిబ్బందిని నియమించాలి. అంత పెద్ద సంఖ్యలో ప్లేట్లు లభించవని కూడా అంటున్నారు. మొత్తం మీద పాలికె సూచన విచిత్రంగా ఉందని హోటల్ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాలికె అధికారులు ఏమంటున్నారు దీనిపై పాలికె అధికారి మాట్లాడుతూ.. చెత్త సంస్కరణ కేంద్రాలకు, గ్యాస్ ఉత్పాదన కేంద్రాల్లో అరటి ఆకుల సంస్కరణ కష్టతరమైన నేపథ్యంలో వాటిని తక్కువగా వినియోగించాలని తెలిపామన్నారు. కానీ కచ్చితంగా నిషేధించాలని చెప్పలేదని, కొన్ని సంస్థలు స్టీల్‌ప్లేట్లను రాయితీ ధరలో అద్దెకు ఇస్తున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కళ్యాణ మంటపాల్లో పెద్ద ఎత్తున అరటి ఆకులు వినియోగిస్తుండటంతో చెత్త అధికంగా పోగవుతుంది. దీంతో హోటల్స్, కళ్యాణ మంటపాలకు స్టీల్‌పాత్రలు వినియోగించాలని కోరినట్లు బీబీఎంపీ పొడిచెత్త విభాగం జాయింట్ కమిషనర్ సర్ఫరాజ్‌ఖాన్ తెలిపారు. -
ప్లాస్టిక్‌తో పరేషాన్.!
రైల్వేకోడూరు రూరల్ : గాంధీజీని ఆదర్శంగా తీసుకుందాం ...ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం... చెత్తాచెదారం చెత్త కుండీలలోనే వేద్దాం... డ్రైనేజీ కాల్వలలో వ్యర్థం వేయకుండా చూసుకుందాం.. పర్యావరణాన్ని కాపాడుదాం... రండి చేతులు కలపండి... ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దుకుందాం.. అంటూ జిల్లాలోని ప్రతి పట్టణంలోనూ అధికారులు ప్రచారం నిర్వహించారు. ఇలా కొన్ని రోజులు అన్ని చోట్ల దుకాణాలను తనిఖీ చేసి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చేతి సంచులను వాడేలా చూశారు. ప్రతి అంగడిలో గుడ్డ సంచులు అమ్మసాగారు. అంతా మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లే కనిపిస్తున్నాయి. వినియోగదారులు ఇంటి దగ్గర నుంచి చేతులూపుకుంటూ రావడం పది రూపాయల వస్తువు కొన్నా కవరు ఇవ్వండి లేకుంటే మాకొద్దు అనే స్థాయికి వచ్చారు. చిల్లర వ్యాపారులు మొదలుకుని పెద్ద వ్యాపారుల వరకు ప్లాస్టిక్ వినియోగం తప్పనిసరి అయింది. కాల్వల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ చిన్నచిన్న వ్యాపారులు టీ కప్పులను, జ్యూస్‌కు వాడిన కప్పులను రోడ్డుపై వేయడం, గాలికి అవి కాల్వల్లో పేరుకుపోవడం జరుగుతోంది. దీని వలన పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. ప్లాస్టిక్ వినియోగం ఆపితేగానీ సమస్య తీరదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమలు కాని ప్లాస్టిక్ నిషేధం – పట్టించుకోని అధికారులు జిల్లాలో ఎక్కడా ప్లాస్టిక్ నిషేధం అమలుకు నోచుకోలేదు. గతంలో అధికారులు ప్లాస్టిక్ నిషేధం అమలు చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశారు. సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. దుకాణాలలో తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించారు. మళ్లీ రెట్టింపు ఊపుతో ప్లాస్టిక్ వాడకం ప్రారంభం అయింది. ఇదంతా జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ తెలియదు అన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. టిఫిన్ సెంటర్లలో ప్లాస్టిక్ వాడకం–క్యాన్సర్‌కు కారకం పలు టిఫిన్ సెంటర్లలో ప్లాస్టిక్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇడ్లీలు తయారు చేసేందుకు, ఇడ్లీ పాత్రలలో అతితక్కువ మైక్రాన్ కలిగిన ప్లాస్టిక్ పేపర్లును వాడుతున్నారు. వేడి వలన అందులో ఉన్న క్యాన్సర్‌కు కారకమయ్యే రసాయనం కరుగుతుందని, అలాంటి టిఫిన్ తిన్నవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. అంతరిస్తున్న అరిటాకు వాడకం – వీధిన పడుతున్న కూలీలు చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు మొదలుకుని పెద్దపెద్ద హోటళ్ల వరకు అరటి ఆకు వాడకాన్ని తగ్గించి ప్లాస్టిక్ వాడుతున్నారు. దీని వలన ప్రజల ఆరోగ్యం క్షీణించడంతోపాటు సంపాదించింది కూడా ఆసుపత్రులకే ఖర్చు అవుతోంది. అరటి ఆకులు వ్యాపారం చేసే వారి పరిస్థితి దీనంగా తయారైంది. ఫలితంగా కూలీలు పనులు దొరక్క రోడ్డున పడుతున్నారు. అరిటాకులో భోజనం, టిఫిన్ తినడం వలన ఆరోగ్యంగా ఉంటారని అధికారులు అవగాహన కల్పించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలి ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ప్లాస్టిక్ కవర్లు ఎక్కడపడితే అక్కడ వేయడం వలన కాలుష్యం ఏర్పడుతోంది. ఆవులు కూడా వాటిని తిని ప్రాణాలు కోల్పోతున్నాయి. –శ్రీనివాసులు, జన్మభూమి కమిటీ సభ్యుడు, రైల్వేకోడూరు. పనులు కోల్పోయారు ప్లాస్టిక్ వాడకం వలన అరటి ఆకులు కోసే కూలీలు పనులు కోల్పోయారు. టిఫిన్ సెంటర్లు, హోటళ్లలో చాలా వరకు ప్లాస్టిక్ వాడడం వలన అరటి ఆకుల వ్యాపారాలు తగ్గి కూలీలు పనులు లేక రోడ్డున పడ్డారు. –వెంకటేశు, అరటి ఆకుల వ్యాపారి, రైల్వేకోడూరు. -
అరటాకుతో ఉపాధి
– హోటళ్లలో అరటి ఆకులకు పెరిగిన డిమాండ్ – వందల కుటుంబాలకు ఉపాధి పుట్లూరు: చిన్నపాటి గాలికే చిరిగిపోయి అరటాకు వందల కుటుంబాలకు ఉపాధినిస్తోంది. కష్టాల్లో ఉన్నప్పుడు అరటాకు బతుకైపోయిందంటూ పోల్చుకునే చాలా మందికి.. అదే అరటాకు బతుకుతెరువుగా మారింది. నిత్య జీవితంలో ఒక్క పూట భోజనం లేదా టిఫెన్ అరటి ఆకులో చేయడం ఎంతో గొప్పగా చాలా మంది భావిస్తుంటారు. ఎవరైనా కొత్తగా గ్రామాల్లోకి వస్తే వారికి కడుపునిండా భోజనాన్ని అరటి ఆకులో వడ్డిస్తే... జీవిత కాలం గుర్తుండిపోతోంది. ఇదే చాలా మందికి ఉపాధిగా మారింది. పోటీ ప్రపంచంలో.. పట్టణ ప్రాంతాల్లోని హోటళ్లలో అరటి ఆకులో భోజనం ప్రత్యేకంగా ఉంటోంది. గతంలో ప్లేట్లలో భోజనం వడ్డించే హోటళ్లలో సైతం నేడు అరటి ఆకులు దర్శనమిస్తున్నాయి. అరటి ఆకులో టిఫెన్, భోజనాన్ని అందిస్తే వారి వ్యాపారం మూడు పూవ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లుతుండడంతో చాలా మంది హోటల్ నిర్వాహకులు అరటి ఆకులపై మక్కువ చూపుతున్నారు. పోటీ ప్రపంచంలో నిలుదొక్కుకునేందుకు నేడు పట్టణ ప్రాంతాల్లోని హోటల్ నిర్వాహకులు అరటి ఆకులకు తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. ‘అయిన వారికి అరటి ఆకుల్లో...కాని వారికి కంచాల్లో’ అన్న నానుడిని అనుసరిస్తూ తమ వ్యాపారాన్ని అభివృద్ది చేసుకుంటున్నారు. శింగనమల టాప్ శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో అరటి తోటలు విస్తారంటా ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి ప్రతి రోజూ టన్నుల కొద్ది అరటి ఆకులు పట్టణ ప్రాంతాల్లోని హోటళ్లకు తరలి వెళ్తోంది. అరటి ఆకులను తరలించడాన్ని బతుకు తెరువుగా కొన్ని వందల కుటుంబాలు మార్చుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు హోటళ్లకు శింగనమల నియోజకవర్గం నుంచే అరటి ఆకులు అత్యధికంగా సరఫరా అవుతున్నాయి. తెల్లవారుజాము నుంచే.. అరటి ఆకులు సేకరించడం కోసం కూలీలు ఉదయం 5 గంటలకే తోటల వద్దకు చేరుకుంటారు. ఉదయం పది గంటల్లోపు తాము సేకరించిన అరటి ఆకులను కట్టలుగా కట్టి బస్సులు, ఆటోలలో అనంతపురంతో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఏ కొద్దిగా ఆలస్యమైనా.. వారు పడిన కష్టానికి ఫలితం దక్కకుండా పోతుంది. రైతుల అనుమతి తప్పనిసరి అరటి తోటలలో గెలలు కొట్టిన అనంతరం రైతుల ఇళ్ల వద్దకెళ్లి అరటి ఆకుల సేకరణకు అనుమతి తీసుకుంటారు. ఎక్కువగా మూడవ పంట ముగిసిన అరటి తోటలలో ఆకుల సేకరణకు రైతులు అనుమతిస్తారు. కొన్ని సమయాల్లో అరటి ఆకులు దొరకక కూలీలు ఇతర మండలాలకు సైతం వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా సేకరించిన 100 అరటి ఆకుల కట్టకు రూ.100 ఇస్తారని కూలీలు చెబుతున్నారు. ఇదే జీవనాధారం. మాకు అరటి ఆకుల సేకరణ మాత్రమే జీవనాదారం. ఎన్నో ఏళ్లుగా అరటి ఆకులను సేకరించి అనంతపురంలోని హోటళ్లకు సరఫరా చేస్తున్నాం. వర్షాలు వచ్చిన సమయంలో కూలి దొరకదు. ఇంటిళ్లపాది కష్టపడితే తప్ప మాకు గిట్టుబాటు కాదు. - నాగయ్య, నడిమిపల్లి, నార్పల మండలం సంస్కృతిలో భాగం.. అరటి ఆకులలో బోజనం చేయడమనేది మన పురాతన సంస్కృతి. నేటి పాశ్చత్య కాలంలో ఈ విషయంగా ప్రజల్లో మరింత ఆసక్తి పెరిగింది. తెల్లవారుజాము నుంచే మేము తోటల్లోకి వెళ్లి అరటి ఆకులను సేకరించాలి. కొన్నిసార్లు కూలి కూడా గిట్టుబాటు కాదు. మేము సేకరిస్తున్న అరటి ఆకులలో ఎంతో మంది కడుపు నిండా అన్నం తినడం మాకు సంతృప్తినిస్తోంది. - రాజేంద్ర, నార్పల -
ఆకు పచ్చ బతుకు పచ్చ
అరటి ఆకులో భోజనం... ఆరోగ్యానికి తొలిమెట్టు.మరి భోజనం ముగిశాక తమలపాకుల సేవనం?... అదీ ఆరోగ్యానికి మరో మెట్టే... ఆకుపచ్చలోనే ఆరోగ్యం ఉంది. ఆకు కూరలో అది మరీ దాగి ఉంది. ప్రకృతి మనిషి కోసం ఎన్ని ఆకుకూరలను ప్రసాదించలేదు కనుక.... బచ్చలికూర... పాలకూర... చుక్కకూర... తోటకూర.... మెంతికూర... వంటివి మరోవైపు... ఒంటికే కాదు... కంటికి కూడా ఆరోగ్యమే...చల్లగాలిలో... తెల్లని వెన్నెలలో... ఆకుపచ్చటి వంటలు చేసుకుని... కడుపు నిండా తిని... నోరారా త్రేన్చి... పచ్చనాకు సాక్షిగా... అయినవారికి ఆకుల్లోనే పెట్టాలి అనుకుందాం.... తోటకూర ఉండలు కావలసినవి: తోటకూర తరుగు - 3 కప్పులు, సెనగ పిండి - అర కప్పు, పచ్చి మిర్చి తరుగు - 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, కారం - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, నీళ్లు - తగినంత, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, పచ్చి కొబ్బరి తురుము - టేబుల్ స్పూను పోపు కోసం: నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు - రెండు రెమ్మలు, ఎండు మిర్చి ముక్కలు - 2 టీ స్పూన్లు, ఆవాలు - అర టీ స్పూను, ఇంగువ - చిటికెడు, నూనె - 2 టీ స్పూన్లు. తయారీ: ఒక పాత్రలో సన్నగా తరిగిన తోటకూర, పచ్చి మిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, జీలకర్ర, సెనగ పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ గట్టిగా పకోడీల పిండిలా కలపాలి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి బాణలిలో నూనె పోసి కాగాక, మంట తగ్గించి, తోటకూర ఉండలను ఒక్కొక్కటిగా వేస్తూ బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ నాప్కిన్ మీదకు తీసుకోవాలి బాణలిలో 2 టీ స్పూన్ల నూనె వేసి కాగాక ఆవాలు వేసి వేయించాలి నువ్వులు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేస్తూ వేయించాలి వేయించి ఉంచుకున్న తోటకూర ఉండలు జత చేసి, బాగా కలిపి దింపేయాలి పచ్చి కొబ్బరి తురుము పైన చల్లి, టీతో అందించాలి. మెంతికూర/కొత్తిమీర పచ్చడి కావలసినవి: మెంతికూర - 10 కట్టలు, చింతపండు - నిమ్మకాయంత, నూనె - 4 టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి - 15, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, మెంతులు - కొద్దిగా, పసుపు - పావు టీ స్పూను, ఇంగువ - అర టీ స్పూను. తయారీ: ముందుగా మెంతికూరను శుభ్రంగా కడిగి త డి పోయేవరకు నీడలో ఆరబెట్టాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక మెంతి కూర వేసి వేయించాలి చింతపండు, ఉప్పు జత చేసి బాగా కలిపి ఆరేడు నిమిషాలు మగ్గించాలి అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, మెంతులు వేసి వేయించి దింపేసి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి మెంతి కూర జత చేసి, మరోమారు మిక్సీ తిప్పాలి బాణలిలో నూనె వేసి కాగాక, ఇంగువ వేసి, ఒక్క పొంగు రానిచ్చి దింపేసి, మెంతికూర పచ్చడిలో వేయాలి ఇది సుమారు నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది (ఇలాగే కొత్తిమీర పచ్చడి కూడా చేసుకోవచ్చు) పొన్నగంటి ఆకు వేపుడు వలసినవి: పొన్నగంటి ఆకు - 2 కప్పులు, పచ్చిసెనగ పప్పు - అర కప్పు, కొబ్బరి కారం - 2 టీ స్పూన్లు, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, పోపు కోసం, నూనె - 2 టీ స్పూన్లు, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, సెనగ పప్పు - అర టీ స్పూను, మినప్పప్పు - అర టీ స్పూను, వెల్లుల్లి తరుగు - టీ స్పూను తయారీ: పచ్చి సెనగపప్పును శుభ్రంగా కడిగి సుమారు గంటసేపు నానబెట్టాలి బాణలిలో నూనె వేసి వేడయ్యాక, పోపు సామాను వేసి వేయించాలి నానబెట్టిన సెనగపప్పు జత చేసి, బాగా కలిపి, తగినన్ని నీళ్లు పోసి, మూత పెట్టి సుమారు 5 నిమిషాలు ఉడికించాక దీనికి పొన్నగంటి ఆకును జత చేసి బాగా కలపాలి ఉప్పు, పసుపు వేసి మరోమారు కలిపి మూత ఉంచాలి పొన్నగంటి ఆకు, సెనగ పప్పు బాగా కలిసి ఉడికిన తరవాత, కొబ్బరి కారం వేసి కలిపి మరో ఐదు నిమిషాలు సన్నని మంట మీద ఉడికించి, దింపేయాలి వేడి వేడి చపాతీలలోకి, అన్నంలోకి రుచిగా ఉంటుంది. బచ్చలికూర మజ్జిగ పులుసు కావలసినవి: బచ్చలి కూర - 3 కట్టలు (శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి), చిక్కటి మజ్జిగ - 3 కప్పులు (కొద్దిగా పుల్లగా ఉండాలి), ఉప్పు - తగినంత, పసుపు - పావు టీ స్పూను, నూనె - 2 టీ స్పూన్లు, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, మెంతులు - పావు టీ స్పూను, ఇంగువ - చిటికెడు, ధనియాల పొడి - టీ స్పూను, పచ్చి మిర్చి - 4, కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర - చిన్న కట్ట తయారీ: ఒక పాత్రలో బచ్చలి కూర, ఉప్పు వేసి ఉడికించి పక్కన ఉంచాలి చిక్కగా చిలకరించిన పెరుగులో పసుపు వేసి బాగా కలిపాక, ఉడికించిన బచ్చలికూర వేయాలి బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, జీలకర్ర వేసి వేయించి పెరుగు పచ్చడిలో వేసి కలపాలి కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి కలిపి, వేడి వేడి అన్నంలో వడ్డించాలి. పాలకూర సూప్ కావలసినవి: పాలకూర - 3 కట్టలు (సన్నగా తరగాలి), దాల్చిన చెక్క - చిన్న ముక్క, లవంగాలు - 3, బిర్యానీ ఆకు - 1, కరివేపాకు - 2 రెమ్మలు, ఉల్లి తరుగు - అర కప్పు (సన్నగా తరగాలి), వెల్లుల్లి తరుగు - టీ స్పూను, అల్లం తురుము - పావు టీ స్పూను, పచ్చి మిర్చి - 1, బటర్ - టేబుల్ స్పూను, బియ్యప్పిండి - 2 టీ స్పూన్లు (2టేబుల్ స్పూన్ల నీళ్లలో కలపాలి), మీగడ లేదా తాజా క్రీమ్ - ఒకటిన్నర టీ స్పూన్లు, మిరియాల పొడి - కొద్దిగా తయారీ: ఒక పాత్రలో బటర్ వేసి కరిగించాక, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కరివేపాకు వేసి వేయించాలి ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు, అల్లం తురుము జత చేసి సుమారు 4 నిమిషాల సేపు వేయించాలి పాలకూర తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి మరో రెండు నిమిషాలు కలపాలి నాలుగు కప్పుల నీళ్లు జత చేసి బాగా కలిపి మంట ఆర్పేయాలి. బాగా చల్లారిన తర్వాత వడకట్టాలి లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కలను తీసేయాలి పాలకూర ముద్ద, ఉల్లి తరుగు మిశ్రమాన్ని పక్కన ఉంచాలి వడ కట్టిన నీటిని పాలకూర ముద్దకు జత చేసి, సన్నటి మంట మీద సుమారు ఆరేడు నిమిషాలు ఉంచాలి ఉప్పు, మిరియాల పొడి జత చేయాలి నీళ్లలో కలిపి ఉంచిన బియ్యప్పిండిని జత చేసి బాగా క లుపుతుండాలి తాజా క్రీమ్ జత చేసి దింపేయాలి వేడివేడిగా అందించాలి. చుక్కకూర చట్నీ కావలసినవి: చుక్కకూర - 5 కట్టలు, ఉప్పు - తగినంత, పసుపు - పావు టీ స్పూను, నూనె - 3 టీ స్పూన్లు, నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర - టీ స్పూను, ఎండు మిర్చి - 5, వెల్లుల్లి తరుగు - టీ స్పూను, ఉల్లి తరుగు - అర కప్పు, ఎండు మిర్చి - 4 (ముక్కలు చేయాలి), ఆవాలు - టీ స్పూను తయారీ: ముందుగా బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఎండు మిర్చి, జీలకర్ర, నువ్వులు వేసి దోరగా వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి చుక్కకూరను కడిగి సన్నగా తరగాలి బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, ఎండు మిర్చి, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి చుక్క కూర, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. సుమారు పది నిమిషాలయ్యేసరికి చుక్క కూర గుజ్జులా అవుతుంది నువ్వుల పొడి వేసి బాగా కలిపి దింపేయాలి బాగా చల్లారాక, పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చడి బాగా కలిపి, వేడి వేడి అన్నంతో తీసుకోవాలి.