రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చెత్త కుప్పలో ఉన్న ప్లాస్టిక్ కవర్లు
రైల్వేకోడూరు రూరల్ : గాంధీజీని ఆదర్శంగా తీసుకుందాం ...ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం... చెత్తాచెదారం చెత్త కుండీలలోనే వేద్దాం... డ్రైనేజీ కాల్వలలో వ్యర్థం వేయకుండా చూసుకుందాం.. పర్యావరణాన్ని కాపాడుదాం... రండి చేతులు కలపండి... ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దుకుందాం.. అంటూ జిల్లాలోని ప్రతి పట్టణంలోనూ అధికారులు ప్రచారం నిర్వహించారు. ఇలా కొన్ని రోజులు అన్ని చోట్ల దుకాణాలను తనిఖీ చేసి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చేతి సంచులను వాడేలా చూశారు. ప్రతి అంగడిలో గుడ్డ సంచులు అమ్మసాగారు. అంతా మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లే కనిపిస్తున్నాయి. వినియోగదారులు ఇంటి దగ్గర నుంచి చేతులూపుకుంటూ రావడం పది రూపాయల వస్తువు కొన్నా కవరు ఇవ్వండి లేకుంటే మాకొద్దు అనే స్థాయికి వచ్చారు. చిల్లర వ్యాపారులు మొదలుకుని పెద్ద వ్యాపారుల వరకు ప్లాస్టిక్ వినియోగం తప్పనిసరి అయింది.
కాల్వల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్
చిన్నచిన్న వ్యాపారులు టీ కప్పులను, జ్యూస్‌కు వాడిన కప్పులను రోడ్డుపై వేయడం, గాలికి అవి కాల్వల్లో పేరుకుపోవడం జరుగుతోంది. దీని వలన పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. ప్లాస్టిక్ వినియోగం ఆపితేగానీ సమస్య తీరదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అమలు కాని ప్లాస్టిక్ నిషేధం – పట్టించుకోని అధికారులు
జిల్లాలో ఎక్కడా ప్లాస్టిక్ నిషేధం అమలుకు నోచుకోలేదు. గతంలో అధికారులు ప్లాస్టిక్ నిషేధం అమలు చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశారు. సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. దుకాణాలలో తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించారు. మళ్లీ రెట్టింపు ఊపుతో ప్లాస్టిక్ వాడకం ప్రారంభం అయింది. ఇదంతా జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ తెలియదు అన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
టిఫిన్ సెంటర్లలో ప్లాస్టిక్ వాడకం–క్యాన్సర్‌కు కారకం
పలు టిఫిన్ సెంటర్లలో ప్లాస్టిక్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇడ్లీలు తయారు చేసేందుకు, ఇడ్లీ పాత్రలలో అతితక్కువ మైక్రాన్ కలిగిన ప్లాస్టిక్ పేపర్లును వాడుతున్నారు. వేడి వలన అందులో ఉన్న క్యాన్సర్‌కు కారకమయ్యే రసాయనం కరుగుతుందని, అలాంటి టిఫిన్ తిన్నవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు.
అంతరిస్తున్న అరిటాకు వాడకం – వీధిన పడుతున్న కూలీలు
చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు మొదలుకుని పెద్దపెద్ద హోటళ్ల వరకు అరటి ఆకు వాడకాన్ని తగ్గించి ప్లాస్టిక్ వాడుతున్నారు. దీని వలన ప్రజల ఆరోగ్యం క్షీణించడంతోపాటు సంపాదించింది కూడా ఆసుపత్రులకే ఖర్చు అవుతోంది. అరటి ఆకులు వ్యాపారం చేసే వారి పరిస్థితి దీనంగా తయారైంది. ఫలితంగా కూలీలు పనులు దొరక్క రోడ్డున పడుతున్నారు. అరిటాకులో భోజనం, టిఫిన్ తినడం వలన ఆరోగ్యంగా ఉంటారని అధికారులు అవగాహన కల్పించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలి
ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ప్లాస్టిక్ కవర్లు ఎక్కడపడితే అక్కడ వేయడం వలన కాలుష్యం ఏర్పడుతోంది. ఆవులు కూడా వాటిని తిని ప్రాణాలు కోల్పోతున్నాయి.
–శ్రీనివాసులు, జన్మభూమి కమిటీ సభ్యుడు, రైల్వేకోడూరు.
పనులు కోల్పోయారు
ప్లాస్టిక్ వాడకం వలన అరటి ఆకులు కోసే కూలీలు పనులు కోల్పోయారు. టిఫిన్ సెంటర్లు, హోటళ్లలో చాలా వరకు ప్లాస్టిక్ వాడడం వలన అరటి ఆకుల వ్యాపారాలు తగ్గి కూలీలు పనులు లేక రోడ్డున పడ్డారు.
–వెంకటేశు, అరటి ఆకుల వ్యాపారి, రైల్వేకోడూరు.
Comments
Please login to add a commentAdd a comment