అమ్మో ప్లాస్టిక్ బియ్యం.. తింటే ఇక అంతే!
లాగోస్: ప్రపంచ జనాభాను త్వరలో ఓ పెద్ద సమస్య వణికించబోతోందా..! ఆ సమస్య ప్లాస్టిక్ రైస్ రూపంలో రానుందా? అంటే అవుననే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కొన్ని సంఘటనలు చెబుతున్నాయి. చైనా ప్లాస్టిక్ రైస్ తయారు చేస్తోందంటూ గత కొంత కాలంగా ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. నిజంగా ప్లాస్టిక్ రైస్ వస్తోందంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంతో ప్రజల్లో అనేక భయాలు, ఆందోళనలు కూడా ఉన్నాయి.
క్రిమి సంహారక మందులు విచ్చలవిడిగా పెరిగిపోయి కలుషితమైన ఆహారధాన్యాలు మార్కెట్ ను ముంచెత్తుతున్న తరుణంలో ఈ ప్లాస్టిక్ బియ్యం మరో పెద్ద ఆందోళనకు గురిచేస్తున్న సమయంలోనే ఆ భయాన్ని మరింత రెట్టింపు చేసేలా నైజీరియా ఘటన ఒకటి బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 102 బ్యాగుల ఫేక్ రైస్ బ్యాగులు నైజీరియాలో కస్టమ్ అధికారులకు పట్టుబడ్డాయి. దాదాపు 2.5మెట్రిక్ టన్నుల ఫేక్ రైస్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెస్ట్ టోమాటో రైస్ పేరిట ఓ వ్యక్తికి ఈ బియ్యం రావడంతో అతడు అధికారులకు సమాచారం అందించగా వారు అప్రమత్తమయ్యారు. అయితే, ఈ బియ్యం మొత్తం కూడా ప్లాస్టిక్ రైస్ అని అనుమానాలు వ్యక్తమవడంతో ఇప్పుడక్కడి ప్రజల్లో భయాందోళనలు నిండుకున్నాయి. అయితే, నైజీరియా ఆరోగ్య శాఖ మాత్రం ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ఈ బియ్యం ప్లాస్టిక్ వి అయినట్లుగానీ.. వాటిల్లో రసాయన పదార్థాలు ఉన్నట్లు గానీ ఆధారాలు లభ్యం ఇంకా కాలేదని చెప్పింది.
కానీ, నేషనల్ ఏజెన్సీ ఫర్ ఫుడ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ కంట్రోల్ మాత్రం తన అధికారిక దర్యాప్తు నివేదికను ఇంకా బయటపెట్టలేదు. మరోపక్క, ఈ బియ్యం పట్టుబడిన వెంటనే కస్టమ్ అధికారుల నుంచి సమాచారం అందుకున్న అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి మాత్రం వీటిపై ఆందోళన వ్యక్తం చేశారు. ది ఫెడరల్ ఆపరేషన్ యూనిట్ కంప్ట్రోలర్ మముదు హరునా మాత్రం ఆ బియ్యాన్ని ప్లాస్టిక్ రైస్ అని లాగోస్ లో గురువారం పత్రికా సమావేశంలో చెప్పారు. 'మేం ప్లాస్టిక్ రైస్ మీద ప్రాథమిక విశ్లేషణ పూర్తి చేశాం. వాటిని ఉడికించిన తర్వాత అవి గట్టిగా మారిపోయాయి. వాటిని ప్రజలు తింటే మాత్రం వారికి ఏమవుతుందో ఆ భగవంతుడికే తెలుసు' అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
నైజీరియా ఆర్థిక వ్యవస్థకు వెన్నుపోటు పొడిచే ఉద్దేశంతోనే ఈ ప్లాస్టిక్ రైస్ ఎగుమతి చేస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ ప్లాస్టిక్ రైస్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదట. ఈ బియ్యంపై ఓ గృహిణి తన ఆందోళన వ్యక్తం చేస్తూ సాధారణంగా బియ్యం ఉడికించడానికి 20 నిమిషాలు పడుతుందని, కానీ, తాను తక్కువ రేటుకే వస్తున్నాయిగా అని తీసుకొచ్చిన రైస్ మాత్రం 30 నిమిషాలపాటు ఉడికించినా అవి చాలా గట్టిగానే ఉండటంతో మరిన్ని నీళ్లు పోసి ఉడికించినా ఫలితం లేకపోవడంతో తన భర్తకు చెప్పగా ఆయన కస్టమ్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ బియ్యంపై ఇంకా పరీక్షలు జరుగుతున్నాయి.
సోషల్ మీడియాలో కొన్నాళ్లుగా చెక్కర్లు కొడుతున్న చైనా వీడియో