సాక్షి, అమరావతి: స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2030 నాటికి దేశం నుంచి విదేశాలకు అయ్యే ఎగుమతుల్లో 10 శాతం వాటాను చేజిక్కించుకోవాలని ఏపీ లక్ష్యంగా నిర్ణయించుకుంది.
ప్రతి జిల్లాలో ఎక్స్‌పోర్ట్ హబ్
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఎక్స్‌పోర్ట్ హబ్‌లను ఏర్పాటు చేసి.. ఆయా జిల్లాల నుంచి ఎగుమతికి అవకాశం ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేస్తోంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ (డీఐఈపీసీ)లను ఏర్పాటు చేస్తూ గత ఏడాది ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రతి జిల్లాలో స్థానిక వ్యాపారులకు ఎగుమతుల అవకాశాలను వివరిస్తూ వారికి చేయూత అందించేందుకు నలుగురు అధికారులతో డిస్ట్రిక్ ఇండస్ట్రియల్ సెంటర్ (డీఐసీ)లను ఏర్పాటు చేసింది. ఇవి ఆయా జిల్లాల నుంచి ఎగుమతికి అవకాశం గల ఉత్పత్తులను ఎంపిక చేసి ఆమోదం కోసం డీఐఈపీసీలకు పంపిస్తారు. వీటిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఆమోదిస్తారు. ఆ విధంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 10 జిల్లాలకు సంబంధించిన ఉత్పత్తులకు ఆమోదం లభించగా.. మరో మూడు జిల్లాలకు సంబంధించి ఉత్పత్తులు పరిశీలన దశలో ఉన్నాయి. ఇందులో ఆరు జిల్లాలు ఇప్పటికే ఎగుమతులకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నాయి.
టాప్–3లో నిలిచేలా..
మన రాష్ట్రం 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.1,07,730 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. దేశం నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తుల్లో ఇది 5.8 శాతం వాటా కాగా.. ఈ విషయంలో మన రాష్ట్రం ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది. 2030 నాటికి దీనిని 10 శాతానికి చేర్చడం ద్వారా టాప్–3 స్థానంలో నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా అదనంగా ఎగుమతికి అవకాశం ఉన్న ఉత్పత్తులను గుర్తించి మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపీ ఈడీబీ) డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకోసం విదేశీ ఎగుమతులతో పాటు ఆన్‌లైన్ రిటైల్ మార్కెటింగ్ సంస్థలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు చెప్పారు. ఇందుకోసం వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య సంఘాలతో ఏపీ ఈడీబీ చర్చలు జరుపుతోందన్నారు. కొన్ని ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు పొందేవిధంగా చర్యలు తీసుకోవడంతోపాటు త్వరలోనే ఎగుమతులకు ప్రత్యేక పాలసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment