ఫండ్స్ పథకాలపట్లా ఆసక్తి చూపాలి
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను వినియోగించుకోవడంలో విజయవంతమైన బీమా రంగ కంపెనీల బాటలో మ్యూచువల్ ఫండ్స్ కూడా ప్రయాణించాలని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సూచించింది. అయితే ఇందుకు ప్రధానంగా ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకులు సహకరించాలని పేర్కొంది. తద్వారా ఫండ్ పథకాల విక్రయంలో పీఎస్‌యూ బ్యాంకులు ప్రముఖ పాత్రను పోషించేందుకు వీలుచిక్కుతుందని అభిప్రాయపడింది. బీమా పథకాల పంపిణీలో బ్యాంకింగ్ నెట్‌వర్క్ విజయవంతమైన నేపథ్యంలో సెబీ సూచనలకు ప్రాధాన్యత ఏర్పడింది.
సంప్రదాయ బ్యాంకింగ్ ప్రొడక్ట్‌లకుతోడు థర్డ్‌పార్టీ బీమా పథకాల విక్రయంలో బ్యాంకులు భారీ విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే మ్యూచువల్ ఫండ్స్ పథకాల విషయంలో ఇది ప్రతిబింబించడంలేదని సెబీ వ్యాఖ్యానించింది. బ్యాంకుల ద్వారా ఫండ్ పథకాల విక్రయం పుంజుకోవాలంటే పీఎస్‌యూ బ్యాంకులే చొరవ చూపాల్సి ఉంటుందని సూచించింది. భారీగా విస్తరించిన బ్రాంచీల ద్వారా బ్యాంకులు ఫండ్ పథకాల పంపిణీకి జోష్ తీసుకురాగలవని సెబీ ప్రతిపాదనలలో పేర్కొంది. ఈ ప్రతిపాదనలను సెబీ బోర్డు ఇటీవల ఆమోదించిన సంగతి తెలిసిందే.