సెకండ్ హ్యాండ్..పుల్ డిమాండ్!
దేశంలోనే నంబర్ వన్ కార్ల కంపెనీ మారుతీ సుజుకీ ఒకప్పటి చీఫ్ జగదీశ్ ఖట్టర్ ఇప్పుడేకారు నడుపుతుంటారో? ఏ టాప్‌ఎండ్ ఎస్‌యూవీనో లేదంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న లగ్జరీకారో అనుకుంటున్నారా... అబ్బే ఆయన షి‘కారు’ చేసేది కేవలం సెకండ్‌హ్యాండ్‌లలో! నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. అంతేకాదు, ఇప్పుడు ఆయన వ్యాపారం కూడా ఇదే. వాడినకార్లను కొనడం.. అమ్మడం... సర్వీసింగ్.
ఇందుకోసం ఆయన అయిదేళ్ల క్రితం ప్రారంభించిన కార్నేషన్ ఆటో అనే సంస్థ ఈ సెకండ్‌హ్యాండ్ కార్ల మార్కెట్లో తనదైనముద్రతో దూసుకెళ్తోంది. దీనంతటికీ దేశంలో ఈ మార్కెట్ పుంజుకుంటుండటమే కారణం. ఒకపక్క, ఆటోమొబైల్ మార్కెట్లో మందగమనం నెలకొన్నప్పటికీ ఈ యూజ్డ్ కార్ల వ్యాపారం మాత్రం టాప్‌గేర్లో దూసుకెళ్తుండటం విశేషం. ‘ధనిక కస్టమర్లు కొత్తకార్లు కొంటారు.. తెలివైనవాళ్లు సెకండ్‌హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తారు’ ఇదీ ఖట్టర్ ఫిలాసఫీ!
పెద్ద కంపెనీల ప్రవేశంతో..
ఒపప్పుడు చిన్నాచితకా సంస్థలు, డీలర్లకే పరిమితమైన ఈ సెకండ్‌హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి దిగ్గజాలు ప్రవేశించడంతో వ్యవస్థీకృత రూపుదాల్చుతోంది. మారుతీ సుజుకీ ‘ట్రూ వేల్యూ’ పేరుతో, మహీంద్రా అండ్ మహీంద్రా.. ‘ఫస్ట్ చాయిస్’, జగదీశ్ ఖట్టర్ నెలకొల్పిన కార్నేషన్ ఆటో వంటివి ఈ రంగంలో వేళ్లూనుకుంటున్నాయి. ప్రస్తుతం మల్టీబ్రాండ్ యూజ్డ్ కార్ల మార్కెట్లో ఈ సంస్థాగత కంపెనీల వాటా దాదాపు 15%. బడా కంపెనీలు ప్రవేశించినా.. ఇప్పటికీ చిన్న చిన్న డీలర్ల(ఆన్‌ఆర్గనైజ్డ్)దే ఈ మార్కెట్లో మెజారిటీ వాటా. అయితే, పెద్ద కంపెనీల ప్రవేశంతో తమ మార్జిన్లు, అమ్మకాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయనేది చిన్న డీలర్ల వాదన. బడా సంస్థలు వారంటీ ఇతర త్రా ఆఫర్ చేస్తుండటమే దీనికి కారణంగా చెబుతున్నారు.
విస్తరణ జోరు...
ఆటోమొబైల్ పరిశ్రమకు గడ్డుకాలం కొనసాగుతున్నప్పటికీ సెకండ్‌హ్యాండ్ కార్ల కంపెనీలు విస్తరణతో దూసుకెళ్తున్నాయి. దీనికి పటిష్ట డిమాం డే కారణం. గతేడాది ఏప్రిల్ నుం చి ఇప్పటిదాకా మహీంద్రా ఫస్ట్ చాయిస్ 100 కొత్త డీలర్‌షిప్ సోర్లను దేశ్యాప్తంగా తెరిచింది. ఈ వ్యవధిలో తాము 60 వేల సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించామని.. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 40% అధిమని మహీంద్రా ఫస్ట్ చాయిస్ సీఈఓ నాగేంద్ర పల్లె పేర్కొన్నారు. ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకూ విస్తరిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇక మారుతీ ట్రూ వేల్యూ కూడా విస్తరణతో ఉరకలేస్తోంది. గతేడాది డిసెంబర్ నాటికి కంపెనీ అవుట్‌లెట్ల సంఖ్య మొత్తం 309 నగరాల్లో 507కు చేరింది. అంతక్రితం ఏడాది డిసెంబర్‌కు 245 నగరాల్లో 429 అవుట్‌లెట్‌లు ఉన్నాయి. ఇక ఖట్టర్‌కు చెందిన కార్నేషన్‌కు ప్రస్తుతం 40 డీలర్‌షిప్ అవుట్‌లెట్లు ఉండగా.. మరో మూడేళ్లలో 150-200కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘సెకండ్‌హ్యాండ్’ పదానికి బదులు ఇప్పుడు ‘యూజ్డ్’ కార్లు లేదా ‘ప్రీఓన్డ్’ కార్లు అనేవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.
మార్కెట్ ఎంత?
అధికారికంగా గణాంకాలు అందుబాటులో లేనప్పటికీ.. దేశంలో వార్షికంగా 30 లక్షల యూజ్డ్ కార్లు అమ్ముడవుతున్నట్లు అంచనా.
2013లో దేశీయంగా 18.07 లక్షల కొత్త కార్లు అమ్ముడైనట్లు సియామ్ అంచనా(2012లో దాదాపు 20 లక్షల కార్లతో పోలిస్తే 9.5 శాతం తగ్గాయి).
క్రిసిల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం 2016-17 నాటికి వార్షికంగా యూజ్డ్‌కార్ల అమ్మకాల సంఖ్య దాదాపు మూడింతలకు.. అంటే 80 లక్షల స్థాయికి చేరొచ్చని అంచనా. మొత్తం మార్కెట్ విలువ రూ.1.5 లక్షల కోట్లకు చేరే అవకాశాలున్నాయి.
కాగా, అమెరికాలోలో గతేడాది దాదాపు 4 కోట్ల యూజ్డ్ కార్లు అమ్ముడవగా.. చైనాలో ఈ సంఖ్య 48 లక్షలు కావడం గమనార్హం.
డిమాండ్‌కు కారణమేంటి?
పేరున్న కార్ల బ్రాండ్‌లు ఈ మార్కెట్లోకి అడుగుపెట్టడంతో కస్టమర్లలో నమ్మకం పెరిగేందుకు దోహ దం చేస్తోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
అంతేకాదు, సెకండ్‌హ్యాండ్ వాహనాలను నడిపేందుకు ఇష్టపడుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతుండటం కూడా యూజ్డ్ కార్లకు డిమాండ్‌ను సృష్టిస్తోంది. ఈ విధమైన ధోరణికి మనోళ్లు బాగానే అలవాటుపడుతుండటం మరో కీలకమైన అంశం.
యూజ్డ్ కారుతో కొన్నాళ్లు నడిపించి.. ఆ తర్వాత కొత్తకారు సొంతంచేసుకోవాలనుకునే ట్రెండ్ ఇటీవల ఊపందుకుంటోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.
విదేశీ లగ్జరీకార్ల నుంచి దేశీ కంపెనీల ప్రఖ్యాత కార్ల మోడళ్లు ఇలా అన్నీ అందుబాటు ధరల్లో ఊరిస్తుండటం కూడా కొందరు కస్టమర్లను యూజ్డ్ కార్లవైపు నడిపిస్తోందని చెబుతున్నారు.
పదేపదే కార్లను మార్చే కస్టమర్లు దేశంలో పెరుగుతుండడం, రుణాల లభ్యత వంటివి సెకండ్‌హ్యాండ్ కార్ల మార్కెట్‌కు వరంగా మారుతున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం.
మరోపక్క, రోజుకో కొత్త మోడల్ కారు మార్కెట్లోకి విడుదలవుతుండడం కూడా ఈ మార్కెట్ పురోగతికి దోహదం చేస్తోంది.