స్టీల్ ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: మార్చి నుంచి స్టీల్ ధరలు పెరగనున్నాయ్. ప్రభుత్వ రంగ సంస్థ ఆర్‌ఐఎన్‌ఎల్(వైజాగ్ స్టీల్)తో పాటు, ప్రయివేట్ రంగ సంస్థ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సైతం ధరల్ని పెంచుతున్నాయి. మార్చి 1 నుంచి స్టీల్ ధరలను టన్నుకి రూ. 1,000 వరకూ పెంచనున్నట్లు వైజాగ్ స్టీల్ వెల్లడించింది. ఇక జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఇప్పటికే టన్ను ధరపై రూ.750 వరకూ వడ్డించనున్నట్లు తెలిపింది. ముడిఇనుము ధరలతోపాటు, రవాణా చార్జీలు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా వైజాగ్ స్టీల్ పేర్కొంది.
వెరసి వివిధ రకాల ఉత్పత్తులపై టన్నుకి కనిష్టంగా రూ. 750, గరిష్టంగా రూ. 1,000ను పెంచుతున్నట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ బాటలో ఎస్సార్ స్టీల్ కూడా వచ్చే నెల నుంచి టన్నుకి రూ. 1,000 వరకూ స్టీల్ ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉక్కు తయారీ వ్యయాలు పెరగడానికితోడు డిసెంబర్ క్వార్టర్‌లో స్టీల్‌కు కొంత డిమాండ్ పుంజుకోవడం కూడా ధరల పెంపుకు కారణమైనట్లు ఆ వర్గాలు వివరించాయి.
మూడోసారి
ఈ ఏడాది ఇప్పటివరకూ స్టీల్ ధరలు రెండు సార్లు పెరిగాయి. ప్రస్తుత ప్రతిపాదనల నేపథ్యంలో స్టీల్ ధరలు మూడోసారి హెచ్చనున్నాయి. దేశీయ స్టీల్ తయారీ సంస్థలు ఇప్పటికే జనవరి-ఫిబ్రవరిలో టన్నుకి రూ. 2,500-3,000 స్థాయిలో ధరలను పెంచాయి. ఇందుకు ముడిసరుకుల ధరలు, రవాణా వ్యయాలే కారణమైనప్పటికీ ఇటీవల స్టీల్‌కు డిమాండ్ పుంజుకోవడం కూడా దోహదపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.
విదేశాలకు స్టీల్ ఎగుమతులు వృద్ధి చెందుతుండటంతో దేశీయంగా అధిక సరఫరాకు చెక్ పెట్టేందుకు కంపెనీలకు వీలు చిక్కుతోంది. ఇది మరోవైపు ఉత్పత్తుల ధరలు పెంచేందుకు కూడా దారి చూపుతోంది. అయితే ధరల పెంపును మార్కెట్లు పూర్తిస్థాయిలో గ్రహించే అవకాశాలు తక్కువేనని పరిశ్రమ వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతానికి స్టీల్ వినియోగం అంత ప్రోత్సాహకరంగా ఏమీలేదని, ఈ నేపథ్యంలో ధరల పెంపు కొనసాగేదీ లేనిదీ చూడాల్సి ఉన్నదని జయంత్ రాయ్ వ్యాఖ్యానించారు. రేటింగ్ దిగ్గజం ఇక్రాకు చెందిన కార్పొరేట్ రంగ విభాగానికి సీనియర్ వైస్‌ప్రెసిడెంట్‌గా జయంత్ పనిచేస్తున్నారు.
ఇదీ ధరల తీరు: నిర్మాణ రంగంలో వినియోగించే టీఎంటీ బార్లు, స్ట్రక్చర్లు వంటి లాంగ్ ప్రొడక్ట్‌ల ధరలు ప్రస్తుతం టన్నుకి రూ. 37,000-39,000 స్థాయిలో ఉన్నాయి. ఇక ఆటోమొబైల్, వినియోగ వస్తు రంగాలు కొనుగోలు చేసే హెచ్‌ఆర్ క్వాయిల్, సీఆర్ క్వాయిల్ వంటి ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తుల ధరలైతే టన్నుకి రూ. 39,500-43,500 మధ్య పలుకుతున్నాయి.