
500 కోట్ల డాలర్లు సంపాదించామని అమెరికా వాణిజ్య మంత్రి ప్రకటన
వాషింగ్టన్: అమెరికాలో నివాసంతో పాటు అంతిమంగా పౌరసత్వానికి కూడా వీలు కల్పిస్తూ ఇటీవల ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డులకు డిమాండ్ బాగా పెరుగుతోందని వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ ప్రకటించారు. శుక్రవారం ఆయన ఆల్–ఇన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ‘‘ఒక్క రోజులోనే ఏకంగా వెయ్యి గోల్డ్ కార్డులు అమ్మాం. ఒక్కోదానికి 50 లక్షల డాలర్ల చొప్పున 500 కోట్ల డాలర్లు సంపాదించాం’’అంటూ సంబరపడిపోయారు.
డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలో అగ్ర రాజ్యం ఫక్తు వ్యాపార రాజ్యంగా మారిపోతోందన్న వాదనలకు బలం చేకూర్చేలా మాట్లాడారు. ‘‘గోల్డ్ కార్డులు పూర్తిగా ట్రంప్ ఆలోచనే. దాన్ని కొనుగోలు చేయగల సామర్థ్యమున్న వారు ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మంది ఉన్నారు. కనుక 10 లక్షల కార్డులమ్మి 5 లక్షల కోట్ల డాలర్లు సమీకరించడమే ట్రంప్ లక్ష్యం’’అంటూ ప్రకటించారు. మంత్రి వాటిని ట్రంప్ కార్డులుగా సంబోధించడం విశేషం.
వాటిని కొనేందుకు 2.5 లక్షల మంది ఇప్పటికే ఆసక్తి చూపారని కూడా ఆయన వెల్లడించారు. గోల్డ్ కార్డు అమ్మకాలను మరింత పెంచేందుకు వాటి పేరును ట్రంప్ కార్డ్‌గా మార్చే ఆలోచన ఉన్నట్టు అధ్యక్షుడు ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. ఈబీ–5 ఇన్వెస్టర్ వీసా స్థానంలో గోల్డ్ కార్డును ప్రవేశపెడుతూ ఆయన నెల క్రితం నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రస్తుతం ఏకంగా 36.1 ట్రిలియన్ డాలర్ల రుణభారంతో కునారిల్లుతోంది. గోల్డ్‌కార్డుల ద్వారా దాన్ని ఎంతో కొంత తగ్గించుకోవాలన్నది ట్రంప్ యోచన.
Comments
Please login to add a commentAdd a comment