ఆగని పసిడి పరుగు!
►మరో 12 డాలర్ల పెరుగుదల
► అయితే ప్రాఫిట్ బుకింగ్ ఉంటుందన్న నిపుణులు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆర్థిక, రాజకీయ అనిశ్చితి నిర్ణయాలు, ఉత్తరకొరియా సంఘర్షణ వంటి అంశాల నేపథ్యంలో పసిడి పరుగు కొనసాగుతోంది. న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్ఛంజ్– నైమెక్స్‌లోవారాంతమయిన శుక్రవారం ఔన్స్ (31.1గ్రా) ధర భారీగా 12 డాలర్లు పెరిగి ఒక దశలో 1,363 డాలర్లను తాకింది.
అయితే చివరకు లాభాల స్వీకరణతో 1,348 స్థాయికి తగ్గింది. ఈ వార్తరాసే కడపటి సమయానికి 1,353 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 1,300 కీలక మద్దతును దాటిన తర్వాత వేగంగా వారం రోజుల్లో పసిడి భారీ ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రధాన కారణాల్లో డాలర్ ఇండెక్స్ పతనం ఒకటి. శుక్రవారం ఒక దశలో 90.99 స్థాయిని కూడా తాకిన ఈ ఇండెక్స్ 91.20 స్థాయిలో ట్రేడవుతోంది.
దేశీయంగా ‘రూపాయి’ చక్రం
అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి భారీ పతనం భారత్‌లో అంతే స్థాయిలో ప్రభావం చూపకపోవడం మరో విశేషం. డాలర్ పతనం – రూపాయి బలోపేతం దీనికి ప్రధాన కారణం. శుక్రవారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ ఎక్సే్ఛంజ్‌లో రూపాయి విలువ డాలర్ మారకంలో గురువారంతో పోల్చితే, 27 పైసలు లాభపడి 63.78 వద్ద ముగిసింది. ఇక ముంబై ప్రధాన మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర శుక్రవారం క్రితం ముగింపుతో పోల్చితే రూ.235 పెరిగి రూ. 30,510కి చేరింది. ఇక దేశీయ ఫ్యూచర్స్– ఎంసీఎక్స్‌లో ధర కడపటి సమాచారం అందేసరికి గురువారంతో పోల్చితే స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా లేచి పడిన పసిడి ఇందుకు కారణం.