తెలంగాణ తొలి పీఆర్‌సీ | First PRC In Telangana State | Sakshi
Sakshi News home page

తెలంగాణ తొలి పీఆర్‌సీ

Published Sat, May 19 2018 1:04 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

First PRC In Telangana State - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతన సవరణకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సీఆర్‌ బిశ్వాల్‌ అధ్వర్యంలో త్రిసభ్య కమిషన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బిశ్వాల్‌ను చైర్మన్‌గా, రిటైర్డ్‌ ఐఏఎస్‌లు సి.ఉమామహేశ్వరరావు, డాక్టర్‌ మహ్మద్‌ అలీ రఫత్‌లను సభ్యులుగా నియమించింది. ఉద్యోగుల వేతన సవరణపై అధ్యయనం చేసే బాధ్యతలను సంఘానికి అప్పగించింది. కమిషన్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడు నెలల్లో నివేదిక సమర్పించాలంటూ నిర్ణీత గడువు విధించింది.

ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన పదో పీఆర్‌సీయే ఇప్పటికీ అమల్లో ఉంది. ఈ వరుసలో తాజా పీఆర్‌సీ పదకొండోది. అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే తొలి పీఆర్‌సీ కావటంతో తెలంగాణ తొలి పీఆర్‌సీ ఇదేనని ప్రభుత్వం ప్రకటించింది. ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది జులై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలను సవరించాల్సి ఉందని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే పీఆర్‌సీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషన్‌కు అప్పగించిన బాధ్యతల వివరాలను జీవోతో పాటు పొందుపరిచింది. హైదరాబాద్‌ కేంద్రంగా కమిషన్‌ పని చేస్తుందని, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, వ్యక్తులు, సంస్ధలు, ఎవరి నుంచైనా సమాచారం తీసుకోవచ్చని స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్‌ సంస్థలు, జేఎన్‌టీయూ, జయశంకర్‌ వ్యవసాయ విద్యాలయం సహా వర్సిటీల బోధనేతర సిబ్బంది, ఫుల్‌ టైమ్‌ కాంటింజెంట్‌ ఉద్యోగులు, వర్క్‌ చార్జ్‌డ్‌ ఉద్యోగులకు సంబంధించిన పే స్కేళ్లను రూపొందించి, విభాగాలవారీగా సర్వీసు నిబంధనలను కమిషన్‌ అధ్యయనం చేస్తుంది. ప్రస్తుతమున్న డీఏ (కరువు భత్యం)ను ఎంతమేరకు వేతనంలో విలీనం చేయాలి, విలీనమైన డీఏ ప్రకారం సవరించిన వేతనాలను ఎలా స్థిరీకరించాలో కూడా పరిశీలిస్తుంది. 

సీఎం వెల్లడించిన అంశాలపై ఫోకస్‌ 
ఆటోమేటిక్‌ అడ్వాన్సుడ్‌ స్కీమ్‌ను యథాతథంగా కొనసాగించాలా, మార్పులు చేయాల్సి ఉంటే ఏం చేయాలో సూచనలు అందించాలని కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. ప్రత్యేక అలవెన్సులు, స్పెషల్‌ పేలు, నష్ట పరిహార అలవెన్సులు కొనసాగించాలా, మార్పులు అవసరమా సిఫార్సు చేయాలని సూచించింది. ప్రభుత్వ క్వార్టర్లకు రెంట్‌ ఫ్రీ విధానాన్ని అధ్యయనం చేయాలని కోరింది. పట్టణీకరణ, పెరిగిన రవాణా సదుపాయాలు, కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో షెడ్యూలు ఏరియా, ప్రాజెక్టుల పరిధిలోని ఉద్యోగులకు అదనపు హెచ్‌ఆర్‌ఏ కొనసాగించాలా, వద్దా సమీక్షించాలని సూచించింది.

ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించిన పలు అంశాలను జీవోలో ప్రభుత్వం ప్రస్తావించింది. షెడ్యూలు, మారుమూల ప్రాంతాల ఉద్యోగులకు అదనంగా ఎలాంటి ప్రోత్సాహకాలు, ఏ రూపంలో ఇవ్వాలో సిఫార్సు చేయడంతో పాటు మారుమూల ప్రాంతాలను గుర్తించాలని కోరింది. ఉద్యోగుల లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌ (ఎల్‌టీసీ) పద్ధతికి కొత్తగా ఎలాంటి మార్పులు చేయాలో అధ్యయనం చేయాలని సూచించింది. పెన్షన్‌ విధానాన్ని సమీక్షించి సిఫార్సులు చేయాలని కోరింది. 

ఉద్యోగుల సంఖ్యపై సమీక్ష 
రాష్ట్రంలో అన్ని విభాగాల్లో ఉన్న ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సంఖ్యను పరిశీలించి, ప్రస్తుత అవసరాల మేరకు సమీక్షించాలని సూచించింది. కొన్ని పోస్టులకున్న గెజిటెడ్‌ హోదాను కొనసాగించాలా, ప్రత్నామ్నాయమేమైనా ఉందా, నాన్‌ గెజిటెడ్‌ హోదాలో ఉన్న వాటికి గెజిటెడ్‌ హోదా ఇవ్వాలా అనే విషయంలో పదో పీఆర్‌సీ సిఫార్సులను సమీక్షించాలని కోరింది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న లోన్లు, అడ్వాన్సులు కొనసాగించాలో, లేదో ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా సూచనలు చేయాలని నిర్దేశించింది. సిఫార్సులు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకోవాలని కోరింది. 
   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement