prc meeting
-
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పనుంది కేసీఆర్ ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల అధ్యయనం కోసం త్వరలో రెండో పీఆర్సీని వేయనుంది ప్రభుత్వం. ఇదే సమయంలో ఇంట్రిం రిలీఫ్(IR)ను కూడా ప్రభుత్వం ప్రకటించనుంది. అలాగే, ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్(EHS)పై కూడా నిర్ణయం తీసుకోనుంది. ఈహెచ్ఎస్ అమలుకు విధి విధానాలను రూపొందించనుంది. అలాగే, గవర్నమెంట్ ఎంప్లాయిస్ హౌజింగ్‌పై కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో వారం, పది రోజుల్లో అన్ని ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతలు -
ఉద్యమ కార్యాచరణ సమ్మెను విరమించుకుంటున్నాం: ఉద్యోగ సంఘాల నేతలు
సాక్షి, అమరావతి: దాదాపు7 గంటల పాటు మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు జరిపిన సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. సమావేశం అనంతరం పీఆర్సీ సాధన సమితి సభ్యులు ఈ అంశాలపై మాట్లాడారు. బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం మాకు జరిగిన అన్యాయాన్ని పెద్ద మనసుతో గ్రహించిందని అందుకే అన్ని విషయాలు కూలంకషంగా చర్చించిందని తెలిపారు. తాము అడక్కుండానే 27శాతం ఐఆర్ ఇచ్చారని ,పలువురి జీతాలు పెంచారన్నారు. ముఖ్యమంత్రి గారిని ఆవేదనలో ఏదైనా ఎవరైనా మాట్లాడి ఉంటే అన్యదా భవించవద్దని చెప్పారు. తాము ఇచ్చిన ఉద్యమ కార్యాచరణ సమ్మెను విరమించుకుంటున్నట్లు తెలిపారు. వెంకట్రామిరెడ్డి, పీఆర్సీ సాధన సమితి ...ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు హెచ్ ఆర్ ఏ 24 శాతం ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందని చెప్పారు. సీసీఎని పునరుద్ధరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ కాగానే కొత్త స్కేల్ అమలవుతుందని చెప్పారు. తాము మాట తప్పి ఏదైనా మాట్లాడి ఉంటే హృదయ పూర్వక క్షమాపణలను తెలిపారు. -
ఉద్యోగుల ఆందోళన వాయిదా
సాక్షి, అమరావతి: పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీపై ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి. ప్రభుత్వం హామీ ఇచ్చినందున తమ ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఉద్యోగ సంఘాలతో గురువారం చర్చలు జరిపారు. రెండు జేఏసీల ప్రతినిధి బృందం, సచివాలయ ఉద్యోగుల సంఘం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధి బృందంతో వేర్వేరుగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న 71 డిమాండ్లను ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. వీటిలో చాలా డిమాండ్లు ఆర్థికేతర అంశాలే. అన్ని సమస్యలు ఒక్క రోజులో పరిష్కారం అయ్యేవి కావని, చాలా సమస్యలు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలకు ఆర్థిక మంత్రి బుగ్గన వివరించారు. ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి చర్చలు జరపడం నిరంతర ప్రక్రియ అని, దాన్ని కొనసాగిస్తూ పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆర్థిక మంత్రి ఇచ్చిన హామీకి ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి. డిమాండ్ల సాధనకే ఆందోళన చేపట్టామని, అవన్నీ పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పాక ఇంకా ఆందోళన చేయాల్సిన అవసరం లేదని, ఆందోళనను వాయిదా వేస్తామని, ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తామని భేటీలో ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఆర్థికేతర అంశాలపై వచ్చే బుధవారం మళ్లీ చర్చలకు పిలుస్తామని ప్రభుత్వం తెలియచేసింది. అన్ని శాఖల కార్యదర్శులు, ఉద్యోగ సంఘాల నేతలతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంశాలపై చర్చిద్దామని, సమస్యలకు పరిష్కారం అన్వేషిద్దామని ఆర్థిక మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్పందన పట్ల ఉద్యోగ సంఘాలు సంతృప్తి వ్యకం చేశాయి. పీఆర్సీపై సోమవారానికి తేల్చాలని ఉద్యోగ సంఘాలు కోరగా తాము అదే పనిలో నిమగ్నమైనట్లు సీఎస్ తెలిపారు. సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన, ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి చర్యలు: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోంది. కోవిడ్ కారణంగా కొంత ఆలస్యమైంది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు 71 అంశాలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఆర్థికేతర అంశాల పరిష్కారానికి సీఎస్ అన్ని విభాగాల సెక్రటరీలతో బుధవారం సమావేశం ఏర్పాటు చేస్తారు. సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా సత్ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం అనే కుటుంబంలో ఉద్యోగులు కూడా భాగమే. రెండు జేఏసీల్లోని 9 సంఘాలు చేస్తున్న ఉద్యమాన్ని విరమించాలని కోరాం. అందుకు వారు అంగీకరించారు. ప్రభుత్వం, ఉద్యోగులు బాగుంటేనే ప్రజా సేవలు సక్రమంగా అందుతాయి. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరాం: వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పెండింగ్ సమస్యల పరిష్కారంపై ఆర్థిక మంత్రి, సీఎస్‌తో చర్చించాం. సచివాలయంలో పోస్టుల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశాం. ఏపీ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి 11 అంశాలు, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్‌కు సంబంధించి 85 అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఖాళీగా ఉండే ఏఎస్‌వోలు, స్టెనోగ్రాఫర్ల పోస్టుల భర్తీతో పాటు ఆర్థిక శాఖలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయడం, గ్రేడ్–5 సెక్రటరీలకు జాబ్ చార్ట్ అమలు, వీఆర్ఏ నుంచి వీఆర్వోలుగా ప్రమోషన్ పొందిన వారికి డైరెక్ట్‌గా గ్రేడ్–1 వీఆర్వో ఇవ్వాలని అడిగాం. సచివాలయ ఉద్యోగులకు ఇంటి స్థలాలు, రాష్ట్ర ఉద్యోగులకు జిల్లా హెడ్ క్వార్టర్లో 50 ఎకరాలు కేటాయించాలి. మోడల్ స్కూళ్లు, గ్రంథాలయాల ఉద్యోగులకు 010 పద్దు కింద జీతాలు, మ్యూచువల్ బదిలీలకే కాకుండా జనరల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పించాలని కోరాం. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. తాత్కాలికంగా విరమిస్తున్నాం: బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ చైర్మన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చినందున ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నాం. ఉద్యోగుల ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆర్థికేతర డిమాండ్లను కార్యదర్శుల కమిటీ ద్వారా పరిష్కరిస్తామని రాతపూర్వక హామీ ఇచ్చారు. సానుకూల స్పందన: బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ ప్రభుత్వం ఆదేశించినా ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశాలతో పాటు 11వ పీఆర్సీ అమలుపై ప్రభుత్వంతో జరిగిన సుదీర్ఘ చర్చల్లో సానుకూలత వ్యక్తమైంది. ఇక పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయని విశ్వసిస్తున్నాం. ప్రధాన అంశాలపై చర్చించాం: సూర్యనారాయణ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నిబంధనలకు సంబంధించిన అంశాలు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి పరిష్కారాన్ని చూపాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ విషయంలో చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిలిచారు. మా సమస్యలను మూడు అంశాలుగా విభజించి సీఎస్‌కు వివరించాం. వాటిలో ప్రధాన అంశాలపై చర్చించారు. అన్ని డిపార్ట్మెంట్ల ప్రిన్సిపల్ సెక్రటరీలతో వచ్చే బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించి దీనిపై చర్చిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. -
Andhra Pradesh: సుదీర్ఘ చర్చలు
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం బుధవారం సుదీర్ఘంగా చర్చలు జరిపింది. సచివాలయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఏడు గంటలకుపైగా చర్చలు జరిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 9 గంటల వరకు జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకుల అభిప్రాయాలను పూర్తిస్థాయిలో తెలుసుకున్నారు. ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ సహా ప్రతి అంశంపైనా బుగ్గన రాజేంద్రనాథ్, సజ్జల రామకృష్ణారెడ్డి కూలంకషంగా చర్చించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వివరించి తమ ఆలోచనలు చెప్పారు. కార్యదర్శుల కమిటీ నివేదిక తమకు ఆమోదయోగ్యం కాదని, 11వ పీఆర్సీని యథాతథంగా అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. కేంద్ర వేతన సంఘంతో తమకు సంబంధం లేదంటూ ఫిట్‌మెంట్‌పై తమ డిమాండ్లు తెలిపాయి. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ ఫిట్‌మెంట్‌పై ఇప్పుడు చేస్తున్న డిమాండ్ కాకుండా అందరు కలిసి ఒక అంకె చెప్పాలని కోరారు. దానిపై నాయకులు ఇప్పటికిప్పుడు చెప్పలేమని తెలిపారు. దీంతో ఫిట్‌మెంట్‌పై మళ్లీ చర్చిద్దామని చెప్పిన సజ్జల మిగిలిన అంశాలపై వివరంగా చర్చించారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సజ్జల హమీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరగా చర్చల సారాంశాన్ని ఆయనకు వివరించి త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఆందోళనలు చేస్తున్న ఉద్యోగుల జేఏసీ నేతలతో విడిగా మాట్లాడి ఆందోళనలు విరమించుకోవాలని సజ్జల, ఆర్థిక మంత్రి కోరారు. సమస్యల పరిష్కారంపై రూట్ మ్యాప్ ఇస్తే ఆందోళనలు విరమిస్తామని జేఏసీ నేతలు చెప్పారు. కాగా, నేడు మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడారు. ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, ఫిట్మెంట్ విషయంలో స్పష్టత రాలేదన్నారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ.. పీఆర్సీ నివేదిక కాకుండా అధికారుల కమిటీ కొత్తగా సిఫార్సులు చేయడం సంప్రదాయం కాదన్నారు. అన్ని డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. కనీసంగా 34 శాతం ఫిట్మెంట్ æఇవ్వాలని అడిగామని, మెడికల్ రీయింబర్సుమెంటు రూ. 10 లక్షలకు పెంచాలని కోరామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఫిట్మెంట్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ 20 అంశాలపై అన్ని సంఘాలు ఒకే తాటిపై నిలబడ్డాయన్నారు. నిబద్ధతతో ఉన్నాం: సజ్జల ఉద్యోగుల సంక్షేమం పట్ల పూర్తి నిబద్ధతతో ఉన్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. సీపీఎస్ మీద తన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. సీపీఎస్ సమస్యకు పరిష్కారం చూపే దిశగా కసరత్తు చేస్తున్నామని సజ్జల చెప్పారు. -
రేపు తేలనున్న తెలంగాణ పీఆర్సీ అంశం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ), పదవీ విరమణ వయసు పెంపు, ఇతర సమస్యలపై ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ.. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే అవకాశముంది. తక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం సీఎస్‌కు ఆదేశించిన విషయం తెలిసిందే. సోమేశ్‌కుమార్ సోమవారం టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ను బీఆర్కేఆర్ భవన్‌కు పిలిపించి చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఉద్యోగ సంఘాలు చర్చలకు ఎప్పుడు వస్తాయో తేదీ నిర్ణయించుకుని చెప్పాలని కోరారు. అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి తేదీ తెలుపుతామని ఆయన సీఎస్‌కు చెప్పారు. వేతన సవరణ, పదవీ విరమణ వయసు పెంపు తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ఈ నెల 27న త్రిసభ్య కమిటీతో సమావేశమై చర్చలు జరపాలని ఉద్యోగ సంఘాల భావిస్తున్నాయి. అదే రోజు సీఎస్ సోమేశ్‌కుమార్ ఉద్యోగ సంఘాల చేతికి పీఆర్సీ నివేదికను అందజేసే అవకాశాలున్నాయి. 27న చర్చలు విజయవంతంగా ముగిస్తే, సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వెంటనే సీఎం కేసీఆర్‌కు చర్చల సారంపై నివేదిక సమర్పించనుంది. ఈ నెలాఖరులోగా సీఎం కేసీఆర్ ఉద్యోగులకు పీఆర్సీ, పదవీ విరమణ వయసు పెంపుపై కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. పీఆర్సీపై త్రిసభ్య కమిటీ భేటీ పీఆర్సీపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సోమవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమైంది. వేతన సవరణ నివేదికతో పాటు ఉద్యోగులకు నిర్ధిష్ట కాల వ్యవధిలో పదోన్నతులు, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పొడిగింపు, సర్వీసు నిబంధనల సరళీకరణ తదితర అంశాలపై చర్చించింది. త్వరలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని నిర్ణయించింది. ఉద్యోగ సంఘాలతో సమావేశాల షెడ్యూల్‌ను సైతం రూపొందించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. సమావేశంలో త్రిసభ్య కమిటీ సభ్యులు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ పాల్గొన్నారు. -
తెలంగాణ తొలి పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతన సవరణకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్ అధ్వర్యంలో త్రిసభ్య కమిషన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బిశ్వాల్‌ను చైర్మన్‌గా, రిటైర్డ్ ఐఏఎస్‌లు సి.ఉమామహేశ్వరరావు, డాక్టర్ మహ్మద్ అలీ రఫత్‌లను సభ్యులుగా నియమించింది. ఉద్యోగుల వేతన సవరణపై అధ్యయనం చేసే బాధ్యతలను సంఘానికి అప్పగించింది. కమిషన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడు నెలల్లో నివేదిక సమర్పించాలంటూ నిర్ణీత గడువు విధించింది. ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన పదో పీఆర్సీయే ఇప్పటికీ అమల్లో ఉంది. ఈ వరుసలో తాజా పీఆర్సీ పదకొండోది. అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే తొలి పీఆర్సీ కావటంతో తెలంగాణ తొలి పీఆర్సీ ఇదేనని ప్రభుత్వం ప్రకటించింది. ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది జులై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలను సవరించాల్సి ఉందని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే పీఆర్సీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషన్‌కు అప్పగించిన బాధ్యతల వివరాలను జీవోతో పాటు పొందుపరిచింది. హైదరాబాద్ కేంద్రంగా కమిషన్ పని చేస్తుందని, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, వ్యక్తులు, సంస్ధలు, ఎవరి నుంచైనా సమాచారం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, జేఎన్టీయూ, జయశంకర్ వ్యవసాయ విద్యాలయం సహా వర్సిటీల బోధనేతర సిబ్బంది, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, వర్క్ చార్జ్డ్ ఉద్యోగులకు సంబంధించిన పే స్కేళ్లను రూపొందించి, విభాగాలవారీగా సర్వీసు నిబంధనలను కమిషన్ అధ్యయనం చేస్తుంది. ప్రస్తుతమున్న డీఏ (కరువు భత్యం)ను ఎంతమేరకు వేతనంలో విలీనం చేయాలి, విలీనమైన డీఏ ప్రకారం సవరించిన వేతనాలను ఎలా స్థిరీకరించాలో కూడా పరిశీలిస్తుంది. సీఎం వెల్లడించిన అంశాలపై ఫోకస్ ఆటోమేటిక్ అడ్వాన్సుడ్ స్కీమ్‌ను యథాతథంగా కొనసాగించాలా, మార్పులు చేయాల్సి ఉంటే ఏం చేయాలో సూచనలు అందించాలని కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. ప్రత్యేక అలవెన్సులు, స్పెషల్ పేలు, నష్ట పరిహార అలవెన్సులు కొనసాగించాలా, మార్పులు అవసరమా సిఫార్సు చేయాలని సూచించింది. ప్రభుత్వ క్వార్టర్లకు రెంట్ ఫ్రీ విధానాన్ని అధ్యయనం చేయాలని కోరింది. పట్టణీకరణ, పెరిగిన రవాణా సదుపాయాలు, కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో షెడ్యూలు ఏరియా, ప్రాజెక్టుల పరిధిలోని ఉద్యోగులకు అదనపు హెచ్ఆర్ఏ కొనసాగించాలా, వద్దా సమీక్షించాలని సూచించింది. ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించిన పలు అంశాలను జీవోలో ప్రభుత్వం ప్రస్తావించింది. షెడ్యూలు, మారుమూల ప్రాంతాల ఉద్యోగులకు అదనంగా ఎలాంటి ప్రోత్సాహకాలు, ఏ రూపంలో ఇవ్వాలో సిఫార్సు చేయడంతో పాటు మారుమూల ప్రాంతాలను గుర్తించాలని కోరింది. ఉద్యోగుల లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) పద్ధతికి కొత్తగా ఎలాంటి మార్పులు చేయాలో అధ్యయనం చేయాలని సూచించింది. పెన్షన్ విధానాన్ని సమీక్షించి సిఫార్సులు చేయాలని కోరింది. ఉద్యోగుల సంఖ్యపై సమీక్ష రాష్ట్రంలో అన్ని విభాగాల్లో ఉన్న ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సంఖ్యను పరిశీలించి, ప్రస్తుత అవసరాల మేరకు సమీక్షించాలని సూచించింది. కొన్ని పోస్టులకున్న గెజిటెడ్ హోదాను కొనసాగించాలా, ప్రత్నామ్నాయమేమైనా ఉందా, నాన్ గెజిటెడ్ హోదాలో ఉన్న వాటికి గెజిటెడ్ హోదా ఇవ్వాలా అనే విషయంలో పదో పీఆర్సీ సిఫార్సులను సమీక్షించాలని కోరింది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న లోన్లు, అడ్వాన్సులు కొనసాగించాలో, లేదో ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా సూచనలు చేయాలని నిర్దేశించింది. సిఫార్సులు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకోవాలని కోరింది. -
అసంపూర్తిగా ఉద్యోగుల పీఆర్సీ భేటీ
-
యనమలతో అసంపూర్తిగా ఉద్యోగుల పీఆర్సీ భేటీ
ఉద్యోగుల పీఆర్సీ విషయమై ఏపీ ఉద్యోగులతో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి భేటీ అసంపూర్తిగా ముగిసింది. కనీస వేతనం రూ. 15 వేలకు తక్కువ కాకుండా ఉండాలని, ఫిట్మెంట్ 62 శాతం ఇవ్వాలని, ఇంక్రిమెంట్లను 3 శాతానికి పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. కుటుంబ యూనిట్ నలుగురిగా గుర్తించాలని కోరారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు పలువురు మంగళవారం నాడు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడిని కలిశారు. అయితే.. దీనికి మంత్రి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో భేటీ అసంపూర్తిగానే ముగిసింది.