రేపు తేలనున్న తెలంగాణ పీఆర్సీ అంశం | Tomorrow Meeting on PRC with NGO's Leaders | Sakshi
Sakshi News home page

27న పీఆర్సీ చర్చలు!

Published Tue, Jan 26 2021 11:22 AM | Last Updated on Tue, Jan 26 2021 11:25 AM

Tomorrow Meeting on PRC with NGO's Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ), పదవీ విరమణ వయసు పెంపు, ఇతర సమస్యలపై ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ.. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే అవకాశముంది. తక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం సీఎస్‌కు ఆదేశించిన విషయం తెలిసిందే. సోమేశ్‌కుమార్‌ సోమవారం టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ను బీఆర్‌కేఆర్‌ భవన్‌కు పిలిపించి చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఉద్యోగ సంఘాలు చర్చలకు ఎప్పుడు వస్తాయో తేదీ నిర్ణయించుకుని చెప్పాలని కోరారు.

అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి తేదీ తెలుపుతామని ఆయన సీఎస్‌కు చెప్పారు. వేతన సవరణ, పదవీ విరమణ వయసు పెంపు తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ఈ నెల 27న త్రిసభ్య కమిటీతో సమావేశమై చర్చలు జరపాలని ఉద్యోగ సంఘాల భావిస్తున్నాయి. అదే రోజు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉద్యోగ సంఘాల చేతికి పీఆర్సీ నివేదికను అందజేసే అవకాశాలున్నాయి. 27న చర్చలు విజయవంతంగా ముగిస్తే, సీఎస్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వెంటనే సీఎం కేసీఆర్‌కు చర్చల సారంపై నివేదిక సమర్పించనుంది. ఈ నెలాఖరులోగా సీఎం కేసీఆర్‌ ఉద్యోగులకు పీఆర్సీ, పదవీ విరమణ వయసు పెంపుపై కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి.

పీఆర్సీపై త్రిసభ్య కమిటీ భేటీ
పీఆర్సీపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సోమవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో సమావేశమైంది. వేతన సవరణ నివేదికతో పాటు ఉద్యోగులకు నిర్ధిష్ట కాల వ్యవధిలో పదోన్నతులు, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పొడిగింపు, సర్వీసు నిబంధనల సరళీకరణ తదితర అంశాలపై చర్చించింది. త్వరలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని నిర్ణయించింది. ఉద్యోగ సంఘాలతో సమావేశాల షెడ్యూల్‌ను సైతం రూపొందించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. సమావేశంలో త్రిసభ్య కమిటీ సభ్యులు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement