Wages to employees
-
రేపు తేలనున్న తెలంగాణ పీఆర్సీ అంశం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ), పదవీ విరమణ వయసు పెంపు, ఇతర సమస్యలపై ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ.. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే అవకాశముంది. తక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం సీఎస్‌కు ఆదేశించిన విషయం తెలిసిందే. సోమేశ్‌కుమార్ సోమవారం టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ను బీఆర్కేఆర్ భవన్‌కు పిలిపించి చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఉద్యోగ సంఘాలు చర్చలకు ఎప్పుడు వస్తాయో తేదీ నిర్ణయించుకుని చెప్పాలని కోరారు. అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి తేదీ తెలుపుతామని ఆయన సీఎస్‌కు చెప్పారు. వేతన సవరణ, పదవీ విరమణ వయసు పెంపు తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ఈ నెల 27న త్రిసభ్య కమిటీతో సమావేశమై చర్చలు జరపాలని ఉద్యోగ సంఘాల భావిస్తున్నాయి. అదే రోజు సీఎస్ సోమేశ్‌కుమార్ ఉద్యోగ సంఘాల చేతికి పీఆర్సీ నివేదికను అందజేసే అవకాశాలున్నాయి. 27న చర్చలు విజయవంతంగా ముగిస్తే, సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వెంటనే సీఎం కేసీఆర్‌కు చర్చల సారంపై నివేదిక సమర్పించనుంది. ఈ నెలాఖరులోగా సీఎం కేసీఆర్ ఉద్యోగులకు పీఆర్సీ, పదవీ విరమణ వయసు పెంపుపై కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. పీఆర్సీపై త్రిసభ్య కమిటీ భేటీ పీఆర్సీపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సోమవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమైంది. వేతన సవరణ నివేదికతో పాటు ఉద్యోగులకు నిర్ధిష్ట కాల వ్యవధిలో పదోన్నతులు, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పొడిగింపు, సర్వీసు నిబంధనల సరళీకరణ తదితర అంశాలపై చర్చించింది. త్వరలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని నిర్ణయించింది. ఉద్యోగ సంఘాలతో సమావేశాల షెడ్యూల్‌ను సైతం రూపొందించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. సమావేశంలో త్రిసభ్య కమిటీ సభ్యులు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ పాల్గొన్నారు. -
లాక్డౌన్ ముగియగానే వేతనాల విడుదల
సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల వేతనాలు తగ్గించి ఇవ్వాల్సి వచ్చింది.. అదేమీ పూర్తి స్థాయి కోత అని భావించవద్దు.. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహకరించినట్టుగా భావించాలి. అది రిజర్వు ఫండ్ కిందే పెడతాం.. ఆపత్కాలంలో ఇబ్బంది ఉండకూడదనే ఆ నిర్ణయం తీసుకున్నాం. లాక్డౌన్ ముగియగానే ఆ నిధులను విడుదల చేస్తాం’అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ హామీ ఇచ్చారు. ఉద్యోగుల వేతనాల్లో కోత విషయంపై ఉద్యోగ సంఘాల జేఏసీ మంగళవారం టీఎన్జీవో భవన్లో అత్యవసరంగా సమావేశమైంది. జీవో 27 జారీ తర్వాత తలెత్తిన పరిణామాలపై చర్చించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో జేఏసీ చైర్మన్ కారెం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ మమత మాట్లాడారు. కరోనా డ్యూటీ చేస్తున్న ఉద్యోగులను జీవో 27 నుంచి మినహాయించి వారికి పూర్తి వేతనం చెల్లించాలని కోరారు. చాలా తక్కువ స్థాయిలో పింఛను పొందుతున్న పెన్షనర్లకు కోత లేకుండా చెల్లించాలని కోరారు. అలాగే మార్చి నెలలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై సీఎంతో చర్చించి పరిష్కారం అయ్యేలా చూస్తానని ఈ సందర్భంగా సీఎస్ హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు. జేఏసీ సమావేశంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, టీజీవో ప్రధాన కార్యదర్శి ఎనుగుల సత్యనారాయణ, ట్రెస్సా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
నోటిఫికేషన్ తర్వాతే వేతనాలు
ట్రెజరీ డైరక్టర్ విజయ్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: రెవెన్యూ నోటిఫికేషన్ తరువాతే ముంపు మండలాల ఉద్యోగులకు వేతనాలు మంజూరు చేస్తామని ట్రెజరీ డెరైక్టర్ విజయ్‌కుమార్ అన్నారు. సొమవారం జిల్లాలో పర్యటించిన ఆయనను జిల్లా ఖజానా కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని పలు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ బిల్లు ఆమోదించారని, దీంతో రెవెన్యూ నోటిఫికేషన్ వెలువడితేనే వేతనాలు చెల్లింపు తెలంగాణ ట్రెజరీ నుంచా, ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ నుంచా అనే విషయం తేలుతుందన్నారు. జిల్లాలో పలు సబ్‌ట్రెజరీ కార్యాలయాలు శిథిలావస్ధల్లో ఉన్నాయని, కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్‌తో చర్చించి వాటి మరమ్మతులకు తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగులు సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో ట్రెజరీ డీడీ కె.నీలిమ, ఎస్టీవో ఖాజామియా, వెంకటేశ్వర్లు, కృష్ణారావు, వేలాద్రి,దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.