PRC of Employees
-
ఆర్టీసీ ఉద్యోగులకు వచ్చేనెల నుంచి కొత్త పీఆర్సీతో వేతనాలు
విజయనగరం గంటస్తంభం: ఆర్టీసీ ఉద్యోగులు వచ్చేనెల 1వ తేదీన కొత్త పీఆర్సీ వేతనాలు అందుకుంటారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. న్యాయ అంశాలు, నిబంధనలన్నీ పరిశీలించాక కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబదీ్ధకరణ ఉంటుందని, ఈ విషయంలో నెలరోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) 4వ వార్షికోత్సవ రాష్ట్ర సభ విజయనగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవడానికే తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, సీపీఎస్ కంటే మెరుగైన ప్రయోజనాలు కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని మంత్రుల కమిటీకి సీఎం సూచించారన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓపీఎస్ అమలు సాధ్యంకాదన్నారు. తాము ఇచ్చిన ఎన్నికల హామీల్లో 95 శాతం నెరవేర్చామని, ఐదు శాతంలో సీపీఎస్ కూడా ఉందన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములమన్న భావనతో పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమన్నారు. పెండింగ్ డీఏల సమస్య తొందరలోనే పరిష్కారమవుతుందన్నారు. పీహెచ్సీ మొదలుకుని అన్నిస్థాయిల్లోని ఆస్పత్రుల్లో పోస్టులన్నీ డిసెంబర్ ఆఖరుకు భర్తీ చేస్తామన్నారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా అదే సమయానికి భర్తీ చేస్తామని చెప్పారు. తెలంగాణ నుంచి వచ్చిన ఉద్యోగులకు ఎటువంటి పెన్షన్ స్కీం వర్తింపచేయాలన్నది రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కె.సూర్యనారాయణ మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, ఇతర సమస్యలు పరిష్కారానికి చొరవ తీసుకోవాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పీఆర్సీతో ఉద్యోగులకు డబుల్ లాభం
సాక్షి, అమరావతి: పీఆర్సీ అమలు వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు వచ్చే దాని కంటే అదనంగా ప్రతి నెలా దాదాపు రూ.1,000 కోట్ల లబ్ధి చేకూరనుంది. 23 శాతం ఫిట్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.10,247 కోట్ల అదనపు భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. ఇది కాకుండా ఇంకా పలు ప్రయోజనాలు కలుపుకుంటే ప్రతి నెలా ఉద్యోగుల ఖాతాల్లో రూ.1,000 కోట్లకు పైగా జమ కానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. జనవరి నెల జీతంతోపాటే ఈ పెరుగుదల ఉండనుంది. ఉద్యోగులు డిసెంబర్ నెలలో తీసుకున్న జీతం కంటే జనవరి జీతం కచ్చితంగా పెరుగుతుంది. 23 శాతం ఫిట్మెంట్ అమలు వల్ల మూల వేతనం (బేసిక్ పే) కనీసం 53.84 శాతం పెరుగుతుంది. అంటే గత పీఆర్సీలో రూ.13 వేల మూల వేతనం ఉన్న ఉద్యోగికి అది ఇప్పుడు రూ.20 వేలకు పెరుగుతుంది. గత పీఆర్సీలో ఉన్న గరిష్ట మూల వేతనం రూ.1,10,850 ఇప్పుడు రూ.1.79 లక్షలకు పెరుగుతుంది. అంటే ప్రతి ఉద్యోగి మూల వేతనాన్ని బట్టి రూ.7 వేల నుంచి రూ.68,150 వరకు పెరుగుతుంది. దీన్ని బట్టే ఉద్యోగుల జీపీఎఫ్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్సు, డీఏ, ఇతర ఆలవెన్సులన్నింటినీ లెక్కిస్తారు. తద్వారా పీఆర్సీ వల్ల ఉద్యోగులకు ప్రయోజనం సంతృప్తికర స్థాయిలో ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీనివల్లే రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా పడే అదనపు భారం రూ.10,247 కోట్లకు రెట్టింపు భారం ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకేసారి అనేక ప్రయోజనాలు ► ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సిఫారసు చేసింది. అయితే పీఆర్సీతోపాటు ఉద్యోగులకు ఒకేసారి అనేక రకాల ప్రయోజనాలు కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. ► రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఇంత ఫిట్మెంట్ ఇవ్వడం గొప్ప విషయమని ఉద్యోగ సంఘాల నాయకులే చెబుతున్నారు. ఫిట్మెంట్తో పాటు ఒకేసారి ఐదు డీఏలను ఇవ్వడం వల్ల ఉద్యోగుల వేతనాల్లో పెరుగుదల సంతృప్త స్థాయిలో ఉంటుందని ఉద్యోగులు చెబుతున్నారు. ► ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌కు సంబంధించి రెండు వారాల్లో తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ సీఎస్‌ను ఆదేశించడం.. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా తాజా పీఆర్సీ వస్తుందని ప్రకటించడం పట్ల ఉద్యోగులు హర్హం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ వయసు పెంపుతో భారీగా లబ్ధి ► ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం సాహసోపేతమైన నిర్ణయంగా ఉద్యోగులు అభివర్ణిస్తున్నారు. తెలంగాణలో 60 నుంచి 61 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసు పెంచారు. అక్కడికన్నా ఇక్కడ మరో ఏడాది పెంచడం వల్ల వేలాది మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ► లబ్ధి పొందే ప్రతి ఉద్యోగికి అదనంగా 24 నెలల ఉద్యోగ సమయం ఉంటుంది. దీనివల్ల మధ్యస్థాయి ఉద్యోగికి రూ.30 నుంచి రూ.40 లక్షలకుపైగా లబ్ధి చేకూరుతుందని అంచనా. రెండేళ్ల సర్వీసు పెరగడం వల్ల పెన్షన్ కూడా ఆదే స్థాయిలో పెరుగుతుంది. అడక్కపోయినా ఇళ్ల స్థలాలు ► సొంతిల్లు ప్రభుత్వ ఉద్యోగుల కల. వాస్తవానికి ఉద్యోగ సంఘాల డిమాండ్లలో ఇది లేదు. అసలు సంఘాలు దీని గురించి ప్రభుత్వాన్ని అడగలేదు. అడక్కపోయినా ఉద్యోగులకు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్‌లోని ఎంఐజీ లేఅవుట్లలో పది శాతం స్థలాలు రిజర్వు చేస్తామని సీఎం ప్రకటించారు. వాటిలో 20 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించడంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ► ఇళ్ల స్థలాలపై గత టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులను నమ్మించి మోసం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఇళ్ల స్థలాలు వస్తాయని ఉద్యోగులు ఎంతో ఎదురు చూశారు. కానీ చంద్రబాబు మాయ మాటలతో కాలక్షేపం చేశారు. తుదకు రాజధానిలోనూ ఉద్యోగులకు ఇళ్లు ఇస్తానని నమ్మించి రంగుల కలలు చూపించి మోసం చేశారు. వైఎస్ జగన్ మాత్రం ఉద్యోగులు అడక్కుండానే నియోజకవర్గాల వారీగా ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తానని ప్రకటించడం పీఆర్సీలో ప్రత్యేక అంశంగా నిలిచింది. పలు కీలక నిర్ణయాలతో మరింత లబ్ధి ► మానిటరీ బెనిఫిట్స్ 21 నెలల ముందు నుంచి ఇస్తుండడం వల్ల ఉద్యోగులకు భారీగా లబ్ధి చేకూరనుంది. కార్యదర్శుల కమిటీ పీఆర్సీ బెనిఫిట్స్‌ను 2022 అక్టోబర్ నుంచి ఇవ్వాలని సిఫారసు చేసింది. దీనివల్ల కొందరు ఉద్యోగులు నష్టపోతారని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేయడంతో 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా ఉద్యోగులకు 21 నెలల బకాయిలు దక్కనున్నాయి. ► సీఎస్ నేతృత్వంలోని కమిటీ చెప్పినట్లు ఈ ఏడాది అక్టోబర్ నుంచి కాకుండా, 2020 ఏప్రిల్ నుంచి అమలు చేయడం వల్ల 31 నెలల ముందే పీఆర్సీ అమలయినట్లు అవుతుందని ఉద్యోగులు విశ్లేషిస్తున్నారు. ► కోవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబాల వారికి కారుణ్య నియామకాలు, ఉద్యోగుల హెల్త్ స్కీంపైనా ఉద్యోగులకు భరోసా ఇచ్చే నిర్ణయాలు ప్రకటించారు. ► సీఎం వైఎస్ జగన్ మానస పుత్రిక అయిన గ్రామ సచివాలయ వ్యవస్థలోని 1.38 లక్షల ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌ను జూన్ లోపు పూర్తి చేసి, జూలై నుంచి పే స్కేల్ వర్తింప చేయనున్నారు. దీనివల్ల లక్షలాది కుటుంబాలకు ఉద్యోగ భద్రత సమకూరనుంది. ఇలా ఉద్యోగులకు మేలు చేయడమే లక్ష్యంగా అడిగిన వాటిని, అడగని వాటిని రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చేందుకు నడుం బిగించింది. దీనిపై ఉద్యోగుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని ప్రయోజనాలు చిన్న విషయం కాదు ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీతో సహా అనేక ప్రయోజనాలను ఒకేసారి కల్పించడం గతంలో ఎప్పుడూ జరగలేదు. 5 డీఏలను ఒకేసారి విడుదల చేయడం సామాన్య విషయం కాదు. 23 శాతం ఫిట్మెంట్, రిటైర్మెంట్ వయసు రెండేళ్లు పెంపు, ఇళ్ల స్థలాలు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు జూన్‌లో ప్రొబేషన్ డిక్లరేషన్ వంటివన్నీ సీఎం జగన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు. ఉద్యోగులకు రూ.10 వేల కోట్లకుపైగా లబ్ధి చేకూరనుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. కళ్ల ముందు వాస్తవాలు కనపడుతున్నా తప్పుడు ప్రచారాలు చేయడం సమంజసం కాదు. – ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) వాస్తవాలకు మసి పూస్తున్న ఎల్లో మీడియా ► పీఆర్సీ వల్ల ప్రభుత్వంపై రూ.వేల కోట్ల భారం పడుతున్న విషయం వాస్తవమని తెలిసినా.. ఎల్లో మీడియా, కొన్ని ప్రభుత్వ వ్యతిరేక శక్తులు దుష్ప్రచారం చేస్తూ ఉద్యోగ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వాస్తవాలను వక్రీకరిస్తూ పీఆర్సీ వల్ల ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని అదేపనిగా అబద్ధాలు చెబుతున్నాయి. ► ఉద్యోగులకు జీతాలు పెరగకపోతే ప్రభుత్వంపై ఇంత భారం పడే అవకాశం ఉండదు. రకరకాల లెక్కలు వేసి ఉద్యోగుల జీతాలు తగ్గుతున్నాయంటూ ఎల్లో మీడియా తప్పుడు వార్తలు ప్రచురిస్తోంది. సోషల్ మీడియాలోనూ, ఉద్యోగుల గ్రూపుల్లోను తప్పుడు ప్రచారాలను వైరల్ చేస్తుండడంపై విస్మయం వ్యక్తమవుతోంది. -
ఉద్యోగుల ఆశలకు అనుగుణంగానే పీఆర్సీ
సాక్షి, అమరావతి: వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) విషయంలో ఉద్యోగులకు స్పష్టత ఉందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల ఆశలకు అనుగుణంగానే పీఆర్సీ అమలు ఉంటుందన్నారు. సచివాలయ ప్రాంగణంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత నెల 29న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పీఆర్సీ నివేదిక ఇచ్చిన తర్వాతే ప్రభుత్వంతో చర్చిస్తామని సీఎస్‌కు ఉద్యోగ సంఘాలు చెప్పాయని, దీంతో.. వారంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి నివేదికపై స్పష్టత ఇస్తామని సీఎస్ చెప్పారన్నారు. కొన్ని అనివార్య కారణాలతో సీఎం మాట్లాడడం కుదర్లేదని.. దీంతో ఉద్యోగ సంఘాల వినతి మేరకే బుధవారం సాయంత్రం సీఎస్ ముఖ్యమంత్రిని కలిశారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో.. గత జేఎస్సీ సమావేశానంతరం పరిణామాలు, సీఎంతో చర్చించిన అంశాలను వివరించేందుకు శుక్రవారం (ఈనెల 12న) మధ్యాహ్నం మరోసారి అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం నివేదిక ఇవ్వకుండా పీఆర్సీ అమలు సాధ్యంకాదన్నారు. నివేదికపై అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి చర్చించుకుని సమావేశంలో వ్యక్తమైన సలహాలు, సూచనలను తిరిగి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని వివరించారు. కేంద్రం హెచ్ఆర్ఏను తగ్గించడం, తెలంగాణ కూడా తక్కువ ఇస్తున్నందున రాష్ట్రంలో హెచ్ఆర్ఏ విషయంలో ఉద్యోగులకు నష్టం జరగకుండా ఉండేలా చూసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుండటంతో పీఆర్సీ నివేదిక ఆలస్యమవుతోందని వెంకట్రామిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగులందరూ పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో సానుకూల పరిస్థితులను అర్థంచేసుకోకుండా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం, అధికారులపై ఆరోపణలు చేయడం బాధాకరమని విలేకరుల ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కేవలం మైలేజీ పెంచుకునేందుకు అనవసర నిరసనలు చేస్తున్నారన్నారు. తాము పీఆర్సీపై ఆందోళన చెందడంలేదన్నారు. -
టీఆర్ఎస్ ఎదురుదాడి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, వేతన సవరణ (పీఆర్సీ) వంటి అంశాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్.. ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో ప్రతి విమర్శలకు సిద్ధమవుతోంది. తెలం గాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గడిచిన ఆరున్నరేళ్లలో యువత, నిరుద్యోగుల కోసం ఉద్యోగాల భర్తీ, వేతనాల పెంపు వంటి అంశాలపై రోజుకో నివేదిక విడుదల చేయడం ద్వారా విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, వేతనాల పెంపు వంటి అంశాలు పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకం కానుండటంతో ఆయా అంశాలకు సంబంధించిన గణాంకాలను ఎన్నికల ప్రచార ఎజెండాగా మార్చుకోవాలని నిర్ణయిం చింది. ఇందులో భాగంగానే 2014 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యో గాలు భర్తీ చేశామని, దీనిపై ఎవరికైనా సందేహాలు ఉంటే చర్చకు సిద్ధమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు రెండు రోజుల క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో సవాల్ చేశారు. దీనిపై చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్, బీజేపీ నుంచి ప్రతిస్పందన రావడంతో 1.32 లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించిన గణాంకాలను ప్రభుత్వ విభాగాలవారీగా విడుదల చేసిన కేటీఆర్... సందేహాలుంటే సంబంధిత విభాగాల్లో సరిచూసుకోవాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీపాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా మంటూ గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వహించలేమనే ప్రధాని ప్రకటనలు తదితరాలపై టీఆర్ఎస్ అటు మీడియా, ఇటు సోషల్ మీడియాలో ఎదురుదాడి చేస్తోంది. ప్రచారాస్త్రంగా వేతనాల పెంపు... వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) సిఫార్సులపై విమర్శలతోపాటు వేతన సవరణపై ప్రభుత్వ ప్రకటనలో జాప్యంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తి పట్టభద్రుల ఎన్నికలపై ప్రభావం చూపకుండా టీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. తమది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని ప్రకటించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులతో తమకున్న అనుబంధాన్ని మరోమారు తెరమీదకు తెచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత అత్యధికంగా 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేయడంతోపాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న చిరుద్యోగులకు వేతనాలు సవరించిన తీరుపై తాజాగా గణాంకాలు విడుదల చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బంది, హోంగార్డులు, జీహెచ్ఎంసీ కార్మికులు తదితరులతో సీఎం స్వయంగా భేటీ కావడంతోపాటు వేతనాలు పెంచిన విషయాన్ని ఎన్నికల ప్రచారంలో గుర్తుచేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. చిరుద్యోగుల జీతాలను రెట్టింపు చేయడంతోపాటు ప్రతి నెలా వేతనాలు అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఓట్లను కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వేతనాలు రెట్టింపు చేసిన విషయాన్ని ఎన్నికల ప్రచారాంశాల్లో చేర్చాలని పార్టీ నిర్ణయించింది. హోంగార్డుల నుంచి పారిశుద్ధ్య కార్మికుల దాకా... రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం రూ. 9 వేలుగా ఉన్న హోంగార్డుల వేతనం ప్రస్తుతం రూ. 23,250కి చేరగా, 108 సిబ్బందికి రూ. 4 వేలు చొప్పున పెరిగింది. వీఆర్ఏలకు రూ. 10,500, వీఏఓలకు రూ. 5 వేలు, కాంట్రాక్టు లెక్చరర్లకు రూ. 37,100 వేతనాలు ఇస్తున్న విషయాన్ని తాజా నివేదికలో టీఆర్ఎస్ పేర్కొంది. వీరితోపాటు ప్రధానంగా అటెండర్లు, ఉపాధి హామీ ఉద్యోగులు, సెర్ప్, ఆశా వర్కర్లు, అర్చకులు, సీఆర్టీలు, పీఈటీలు, ఏఎన్ఎంలు తదితరులకు ఆరున్నరేళ్లలో వేతనాలు పెంచిన తీరును గణాంకాలతో సహా ప్రసంగాలు, కరపత్రాలు, సామాజిక మాధ్యమాల ద్వారా ఓటర్లకు వివరించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. దీంతోపాటు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పనకు సంబంధించి పారిశ్రామిక, ఐటీ రంగాల్లో పెరిగిన ఉద్యోగ అవకాశాలపైనా గణాంకాలను విడుదల చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. -
రోడ్డెక్కిన ఉపాధ్యాయులు
కవాడిగూడ(హైదరాబాద్): బోధన చేసే ఉపాధ్యాయలోకం వేదనతో రోడ్డెక్కింది.. రాష్ట్రం నలమూలల నుంచి వేలాదిమంది టీచర్లు కదిలివచ్చారు. నినాదాలతో ధర్నాచౌక్‌ను హోరెత్తించారు. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ మహాధర్నా నిర్వహించారు. ధర్నా చౌక్‌కు వచ్చే రహదారులపై బైఠాయించారు. పీఆర్సీని అమలు చేయాలని, టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టా లని డిమాండ్ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వందలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పైసా ఖర్చు లేని బదిలీలూ చేపట్టరా: నర్సిరెడ్డి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారాలను మొత్తం తన వద్ద ఉంచు కోకుండా విద్యారంగానికి సంబంధించిన అధికారాలను విద్యాశాఖ మంత్రికి ఇవ్వాలని, తక్షణమే పీఆర్సీ, టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఒక్క పైసా ఖర్చు లేకుండా చేపట్టే బదిలీలు, పదోన్నతులు సైతం ఎందుకు నిర్వహించడంలేదని ప్రశ్నించారు. టీచర్లు పోలీసుస్టేషన్లలోనా? మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ మాట్లాడుతూ.. 3 నెలల్లో ఇస్తామన్న పీఆర్సీ 30 నెలలుగా ఎందుకు జాడలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. క్లాసు రూం లో ఉండాల్సిన టీచర్లను అరెస్టు చేసి.. పోలీస్ స్టేషన్లో ఉంచడం సిగ్గుచేటన్నారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పీఆర్సీ లేటుతో టీచర్లకు 18 నెలలుగా ఐఆర్ ఇస్తూ ఆదుకుంటున్నారని, మరి తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్ర శ్నించారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యు డు అజీజ్‌పాషా, సీపీఎం నేత వెంకట్, న్యూడెమోక్రసీ నేతలు పోటు రంగారావు, కె.గోవర్ధన్, ఉపాధ్యాయ సంఘాల నేతలు రవి, కె.రమణ, శ్రీనివాసులు, సదానంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులను అరెస్టు చేయడం దుర్మార్గం: తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ సాక్షి, హైదరాబాద్: హక్కుల కోసం పోరాడుతున్న ఉపాధ్యాయులను అన్యాయంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె. చక్రధరరావు, హరగోపాల్‌లు తీవ్రంగా ఖండిచారు. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి తరలి వస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేయడాన్ని వారు తప్పుబట్టారు. న్యాయమైన డి మాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుండా ఉ ద్యమాన్ని అణిచివేసేలా వ్యవహరించడం దారుణమని విమర్శించారు. టీచర్ల పట్ల, విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చర్చలకు పిలిచి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరారు. -
నిధుల సమీకరణపై దృష్టి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక అవసరాలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో.. అవసరమైన నిధుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019–20లోని తదుపరి 3 త్రైమాసికాలకు అవసరమైన నిధులను సమీకరించేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తోంది. వివిధ ఆదాయ మార్గాల ద్వారా రానున్న నెలల్లో రాష్ట్రానికి వచ్చే నిధులను అత్యంత జాగ్రత్తగా వినియోగించుకోవడంతోపాటుగా పెరిగిన ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి అవసరమైన నిధులను బయటి ఆర్థిక సంస్థల నుంచి రాబట్టేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల సలహాదారు, రిటైర్డు ఐఏఎస్ జీఆర్ రెడ్డికి ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది. వచ్చేనెలలో పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టాల్సి ఉండగా, ఆర్థిక అవసరాలు, నిధుల లభ్యతపై స్పష్టత కోసం ఈ కసరత్తును ప్రారంభించింది. హామీల పూర్తికే భారీగా నిధులు శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన కొత్త హామీలను నెరవేర్చడం, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయడం, నిర్మాణంలో ఉన్న సాగునీటి పథకాలు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టుల కొనసాగింపునకు రానున్న రోజుల్లో భారీగా నిధులు అవసరం కానుంది. ఇదే విషయాన్ని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించడంతో రాష్ట్ర సంక్షేమ పథకాల వ్యయం రూ.40,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లకు పెరిగిపోయింది. రైతుబంధు పథకం కింద అన్నదాతలకు చేసే ఆర్థిక సాయాన్ని ప్రస్తుత ఖరీఫ్ నుంచి ఎకరానికి రూ.4వేల నుంచి రూ.5వేలకు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ పథకం వార్షిక వ్యయం ఒక్కసారిగా రూ.12,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లకు పెరిగింది. ఇప్పటి వరకు 70% మందికి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించగా, ఇంకా 30% మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అదే విధంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పంపిణీ చేస్తున్న సామాజిక పింఛన్లను రెట్టింపు చేసి ప్రస్తుత జూలై నెల నుంచి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సామాజిక పింఛన్ల వార్షిక భారం రూ.6000 కోట్ల నుంచి రూ.12వేల కోట్లకు చేరింది. దీనికి తోడు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు సంబంధించి రూ.10,000 కోట్ల వరకు పెండింగ్ బిల్లులను ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పీఆర్సీ నిర్ణయం తీసుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ఖజానాపై ఏటా మరో రూ.4వేల కోట్ల నుంచి రూ.5వేల కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు మినహాయిస్తే రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్రఖజానా నుంచే నిధులు వెచ్చించాల్సి ఉంది. మిషన్ కాకతీయతోసహా నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల కొనసాగింపుకు మరో రూ.15 వేల కోట్లను ఈ ఏడాది ఖర్చు చేయకతప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అవసరాలను తీర్చాలంటే ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న ఆదాయానికి తోడుగా మరో రూ.40వేల కోట్ల నిధులు అవసరమవుతాయని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు నిధులు సమీకరించేందుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సంప్రదింపులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఎఫ్ఆర్బీఎం పరిమితులకు లోబడి బయటి సంస్థల నుంచి ఆర్థిక సహాయం పొందేందుకున్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అదే విధంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల కోసం కార్పొరేషన్లు స్థాపించి నిధులను సమీకరించిన తీరులోనే మరికొన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది. -
ఉద్యోగుల వెన్నుతట్టేలా..
అగనంపూడి (గాజువాక): కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)లో ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది ఉద్యమాలు పట్టినా పట్టించుకోని సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీపీఎస్ ఉద్యోగులకు జగనన్న హామీ భరోసా నిస్తున్నాయి. హర్తాళ్లు, ధర్నాలు, రాస్తారోకోలు పికెటింగ్‌లు చేసినా చలించని చంద్రబాబు తీవ్రంగా అన్యాయం చేశారని ఆయా వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీపీఎస్ వల్ల.. జిల్లాలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)లో 14,100 మంది ఉద్యోగులకు జగన్ భరోసాతో మేలు జరుగనున్నది. వీరిలో 6వేల మంది ఉపాధ్యాయులుగా, మిగతా 8 వేల మంది వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నారు. పీఆర్సీ అంటే వైఎస్సార్ పే రివిజన్ కమిషనర్ (పీఆర్సీ) అంటే గుర్తుకు వచ్చేవి దివంగత సీఎం వైఎస్ పాలనలో రోజులు. ఆయన రెండు విడతల పీఆర్సీలు అమలు చేయడంతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య సంఘాలు ఆశించిన దానికంటే ఒకింత ఎక్కువ ప్రకటించి ఉద్యోగుల, వారి కుటుంబాల కళ్లలో కాంతులు నింపిన వైఎస్సార్ నేటికీ ఉద్యోగ, ఉపాధ్యాయుల మదిలో కొలువై ఉంటారు. అటువంటి భరోసా మళ్లీ జగన్ సీఎం అయితే దక్కుతుందని అత్యధిక శాతం ఉద్యోగులు విశ్వసిస్తున్నారు. జిల్లాలో వివిధ విభాగాల్లో 2,617 మంది గెజిటెడ్, 26,230 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, 5,557 మంది నాల్గో తరగతి ఉద్యోగులు, 18,737 మంది ఇతరులు మొత్తమ్మీద 51,141 మంది ఉద్యోగులకు జగన్ హామీ వల్ల లబ్ధి చేకూరనుంది. అర్హతను బట్టి రెగ్యులర్... కాంట్రాక్ట్ ఉద్యోగులు అనే పదాన్ని, విద్యాధికులతో వెట్టి చాకిరీ చేయించుకొని కనీస వేతనాలు కూడా చెల్లించని విధానానికి చంద్రబాబే శ్రీకారం చుట్టారు. అదే చంద్రబాబు 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. రెగ్యులర్ మాట దేవుడెరుగు కనీస వేతనాలకు కూడా నోచుకోని పరిస్థితుల వల్ల ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. ఈ తరుణంలో ప్రజాసంకల్పయాత్రలో జగన్‌ను కలిసిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. అన్ని అర్హతలు ఉండి ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా విధులు నిర్వహిస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ప్రకటించారు. అవకాశం లేని వారిక కనీస వేతన చట్ట ప్రకారం జీతాలు చెల్లిస్తామని ఆయన ఇవ్వడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. దీనివల్ల జిల్లాలో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న సుమారు 22 వేల మందికి ప్రయోజనం చేకూరనుంది. వీరిలో ఒక్క విద్యా విభాగంలోనే 2,500 మంది సీఆర్పీలు, ఐఆర్టీయూ, డీఎంఎల్టీలు, మెసెంజర్లు, ఐఈ కోర్డినేటర్లు, సైట్ ఇంజనీర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పార్ట్ టైమ్ ఇనస్ట్రక్టర్లు, కస్తూర్బా పాఠశాలల్లో పనిచేస్తున్నారు. ఉద్యోగికి పదవీ విరమణ తదనంతర జీవితానికి భరోసా పెన్షన్... ఆ పెన్షన్‌కు పంగనాలు పెట్టించి ఇప్పుడు తన చేతిలో లేదని మొండి చేయి చూపిస్తున్న చంద్రబాబు అసలు ఈ విధానానికి మన రాష్ట్రంలో పచ్చ జెండా ఊపింది కూడా ఆయనే. సీపీఎస్ అమలు రాష్ట్రాల ఐచ్చికం అని కేంద్రం స్పష్టం చేసినా, నేడు కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసా ఉద్యోగుల్లో కొండంత ధైర్యాన్నిచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే సీపీఎస్ రద్దు ఫైల్‌పై సంతకం చేస్తానని ప్రకటించడాన్ని సీపీఎస్ ఉద్యోగులు పూర్తిగా విశ్వసిస్తున్నారు. సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్‌కే మద్దతు – జాకీర్ ఆలీ, జిల్లా అధ్యక్షుడు, సీపీఎస్ పోరాట కమిటీ కన్వీనర్, యూటీఎఫ్ సీపీఎస్ రద్దు చేసే వారికి సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగులు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా ప్రయోజనం లేకుండా పోయిం ది. కంట్రిబ్యూటరీ పెన్షన్ అనేది ఒక దోపిడీ విధానం. కష్టపడి 30 ఏళ్లు పనిచేసే ఉద్యోగికి పింఛన్ అనేది హక్కు. ఉద్యోగుల జీతాల నుంచి కోసిన మొత్తాన్ని షేర్ మార్కెట్లో పెట్టడం, ఉద్యోగి పదవీ విరమణ పొందే నాటికి ఆ షేర్ విలువను బట్టి సొమ్ము తిరిగి చెల్లించడం అనేది జూదం లాంటిది. సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్మోహన్రెడ్డికి ఉద్యోగులు మద్దతు లభిస్తుంది. జగన్‌తోనే ఉద్యోగుల సంక్షేమం – పి. రాధారాణి, సైన్స్ అసిస్టెంట్ ఉద్యోగులు కూడా ప్రజల్లో ఒక భాగమనే విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం విస్మరించింది. ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన కరువు భత్యం (డీఏ) మూడు విడతలు, చట్ట ప్రకారం గడువు తేదీకి ఇవ్వాల్సిన పీఆర్సీని అమలుచేయకుండా నిర్లక్ష్యగా వ్యవహరిస్తోంది. ఉద్యోగుల పక్షపాతిగా వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా దివంగత సీఎం వైఎస్ పీఆర్సీ అమలు చేశారు. ఆయనలా పట్టుదల, ధైర్యం, నమ్మకం, విశ్వాసం ఉన్న జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే మెరుగైన పీఆర్సీ అమలు చేస్తానని హామీ ఇవ్వడం సంతోషంగా ఉంది. మాట మీద నిలబడే మనస్తత్వం ఉన్న జగన్ మాటలను విశ్వసిస్తున్నాం. జగన్ హామీని నమ్ముతున్నాం – ఎస్. కూర్మారావు, సీపీఎస్ ఉద్యోగి సీపీఎస్ రద్దు చేయాలని పలు విడతల్లో ఆందోళనలు చేపట్టాం. ముట్టడి చేశాం. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రతిపక్ష నేత జగన్‌కు సమస్యను వివరించాం. ఆయన పాదయాత్రలో పలుమార్లు స్పష్టంగా హామీ ఇచ్చారు. ఆయన పలు సందర్భాల్లో సీపీఎస్ అనే దోపిడీ పెన్షన్ విధానానికి ఫుల్స్టాప్ పెడతానని ప్రకటించారు. ఆయన ముఖ్యమంత్రి ఐతే సీపీఎస్ భేషరతుగా రద్దు చేస్తానని సీపీఎస్ ఉద్యోగులకు, సంఘాలకు హామీ ఇచ్చారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా పెడతామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పనిలేకుండా చేస్తామని హామీ ఇవ్వడం సంతోషంగా ఉంది. జగన్ మాటలను నమ్ముతున్నాం. ఆయన ఉద్యోగులను మోసం చేయడని విశ్వసిస్తున్నాం. భద్రత కల్పిస్తామనడం అభినందనీయం ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగ భద్రత కల్పించాలి. దశాబ్దాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వేలాది మంది కనీస వేతనాలకు నోచుకోవడం లేదు. జిల్లాలో సుమారు 22వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. జగన్ సీఎం కాగానే అర్హత ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయనున్నట్టు ప్రకటించడం సంతోషంగా ఉంది. – కింతాడ అప్పారావు, రాష్ట్ర అధ్యక్షుడు, సీఆర్పీల సంఘం ఉద్యోగుల వ్యతిరేకి చంద్రబాబు – బి.గణేష్, ఉపాధ్యాయుడు రాష్ట్రం అప్పుల్లో ఉందంటూనే దుబారా ఖర్చులు చేస్తున్నారు. ఉద్యోగుల కరువు భత్యాన్ని వాయిదా పద్ధతిలో చెల్లిస్తామంటున్నారు. ఏడాదిన్నర ఆలస్యంగా ప్రకటించడం, వాటిని కూడా వాయిదాల్లో చెల్లిస్తామని హామీ ఇవ్వడం బాధాకరమైన విషయం. ఉద్యోగులంటే ప్రభుత్వంలో భాగం కాదని పాలకులు భావిస్తున్నారు. ఉద్యోగులు కూడా మనుషులే, వారు ప్రభుత్వంలో భాగమే అని విశ్వసించే పాలకులు వస్తే తప్పా ఉద్యోగులకు డీఏలు విడతల్లో తప్పవు. జగన్ ఆ భరోసా ఇస్తానని చెబుతుండడంతో ఉద్యోగులు ఆయన మాటల్ని విశ్వసిస్తున్నారు. చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో నేను మారాను, ఉద్యోగుల పక్ష పాతిగా ఉంటానని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు ఆయన మాటల్ని విశ్వసించారు. కానీ ఆయనకు ఉద్యోగులంటే గిట్టదని ఈ ఐదేళ్లలో నిరూపించారు. వేతన సవరణ వైఎస్ చలువే – బి.శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు బతకలేక బడి పంతులు అనే నానుడి ఉండేది. 2003కు ముందు అరకొర జీతాలు. పీఆర్సీ ఫిట్మెంట్లు కూడా గొర్రెతోక బెత్తుడు మాదిరిగా ఉండేవి. దీంతో జీతభత్యాలు తక్కువగా ఉండేవి. వైఎస్ సీఎం అయిన తరువాతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తలెత్తుకొని నిలబడేలా వేతన సవరణకు నాంది పలికారు. రెండు విడతల పీఆర్సీలో వైఎస్ మార్క్ కనపడటంతో ఎనిమిదేళ్లలో జీతాలు రెండింతలు అయ్యాయి. మళ్లీ జగన్ సీఎం అయితే ఆ రోజులు చూస్తామనే ఆశ కలుగుతుంది. ప్రస్తుత ప్రభుత్వానికి ఉద్యోగులపై చులకన భావం ఉంది. కమిటీ పేరుతో కాలయాపన – జి.నరసింగరావు, ఉపాధ్యాయుడు సీపీఎస్ విధానాన్ని ఇటీవల చాలా రాష్ట్రాల్లో విరమించుకున్నాయి. మన రాష్ట్రంలో కమిటీ పేరుతో కాలయాపన చేయడం తగదు. కమిటీల వల్ల ఒరిగేది ఏదీ ఉండదని ఉద్యోగులకు తెలుసు. మా జీతాల నుంచి డబ్బులు కోత కోసి వేరే సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం, లాభాలు వస్తాయో రావోకూడా తెలయని పరిస్థితుల్లో సీపీఎస్ విశ్రాంత ఉద్యోగికి భద్రత ఎక్కడ. సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్ హామీపై నమ్మకం ఉంది. ఉద్యోగులకు ఆర్థిక భరోసా మెరుగైన పీఆర్సీ ద్వారా ఉద్యోగులకు ఆర్థిక భరోసా కలుగుతుంది. చట్టం ప్రకారం ప్రతీ ఐదేళ్లకోసారి వేతన సవరణ జరగాలి. అది ఉద్యోగుల హక్కు ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి కాదు. జగన్ సీఎం అయితే మెరుగైన పీఆర్సీ అమలు చేస్తారని విశ్వసిస్తున్నాం. - శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు -
తెలంగాణ తొలి పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతన సవరణకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్ అధ్వర్యంలో త్రిసభ్య కమిషన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బిశ్వాల్‌ను చైర్మన్‌గా, రిటైర్డ్ ఐఏఎస్‌లు సి.ఉమామహేశ్వరరావు, డాక్టర్ మహ్మద్ అలీ రఫత్‌లను సభ్యులుగా నియమించింది. ఉద్యోగుల వేతన సవరణపై అధ్యయనం చేసే బాధ్యతలను సంఘానికి అప్పగించింది. కమిషన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడు నెలల్లో నివేదిక సమర్పించాలంటూ నిర్ణీత గడువు విధించింది. ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన పదో పీఆర్సీయే ఇప్పటికీ అమల్లో ఉంది. ఈ వరుసలో తాజా పీఆర్సీ పదకొండోది. అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే తొలి పీఆర్సీ కావటంతో తెలంగాణ తొలి పీఆర్సీ ఇదేనని ప్రభుత్వం ప్రకటించింది. ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది జులై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలను సవరించాల్సి ఉందని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే పీఆర్సీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషన్‌కు అప్పగించిన బాధ్యతల వివరాలను జీవోతో పాటు పొందుపరిచింది. హైదరాబాద్ కేంద్రంగా కమిషన్ పని చేస్తుందని, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, వ్యక్తులు, సంస్ధలు, ఎవరి నుంచైనా సమాచారం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, జేఎన్టీయూ, జయశంకర్ వ్యవసాయ విద్యాలయం సహా వర్సిటీల బోధనేతర సిబ్బంది, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, వర్క్ చార్జ్డ్ ఉద్యోగులకు సంబంధించిన పే స్కేళ్లను రూపొందించి, విభాగాలవారీగా సర్వీసు నిబంధనలను కమిషన్ అధ్యయనం చేస్తుంది. ప్రస్తుతమున్న డీఏ (కరువు భత్యం)ను ఎంతమేరకు వేతనంలో విలీనం చేయాలి, విలీనమైన డీఏ ప్రకారం సవరించిన వేతనాలను ఎలా స్థిరీకరించాలో కూడా పరిశీలిస్తుంది. సీఎం వెల్లడించిన అంశాలపై ఫోకస్ ఆటోమేటిక్ అడ్వాన్సుడ్ స్కీమ్‌ను యథాతథంగా కొనసాగించాలా, మార్పులు చేయాల్సి ఉంటే ఏం చేయాలో సూచనలు అందించాలని కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. ప్రత్యేక అలవెన్సులు, స్పెషల్ పేలు, నష్ట పరిహార అలవెన్సులు కొనసాగించాలా, మార్పులు అవసరమా సిఫార్సు చేయాలని సూచించింది. ప్రభుత్వ క్వార్టర్లకు రెంట్ ఫ్రీ విధానాన్ని అధ్యయనం చేయాలని కోరింది. పట్టణీకరణ, పెరిగిన రవాణా సదుపాయాలు, కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో షెడ్యూలు ఏరియా, ప్రాజెక్టుల పరిధిలోని ఉద్యోగులకు అదనపు హెచ్ఆర్ఏ కొనసాగించాలా, వద్దా సమీక్షించాలని సూచించింది. ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించిన పలు అంశాలను జీవోలో ప్రభుత్వం ప్రస్తావించింది. షెడ్యూలు, మారుమూల ప్రాంతాల ఉద్యోగులకు అదనంగా ఎలాంటి ప్రోత్సాహకాలు, ఏ రూపంలో ఇవ్వాలో సిఫార్సు చేయడంతో పాటు మారుమూల ప్రాంతాలను గుర్తించాలని కోరింది. ఉద్యోగుల లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) పద్ధతికి కొత్తగా ఎలాంటి మార్పులు చేయాలో అధ్యయనం చేయాలని సూచించింది. పెన్షన్ విధానాన్ని సమీక్షించి సిఫార్సులు చేయాలని కోరింది. ఉద్యోగుల సంఖ్యపై సమీక్ష రాష్ట్రంలో అన్ని విభాగాల్లో ఉన్న ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సంఖ్యను పరిశీలించి, ప్రస్తుత అవసరాల మేరకు సమీక్షించాలని సూచించింది. కొన్ని పోస్టులకున్న గెజిటెడ్ హోదాను కొనసాగించాలా, ప్రత్నామ్నాయమేమైనా ఉందా, నాన్ గెజిటెడ్ హోదాలో ఉన్న వాటికి గెజిటెడ్ హోదా ఇవ్వాలా అనే విషయంలో పదో పీఆర్సీ సిఫార్సులను సమీక్షించాలని కోరింది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న లోన్లు, అడ్వాన్సులు కొనసాగించాలో, లేదో ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా సూచనలు చేయాలని నిర్దేశించింది. సిఫార్సులు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకోవాలని కోరింది. -
ప్రభుత్వ ఉద్యోగులు,టీచర్లకు కేసీఆర్ తీపికబురు
-
పీఆర్సీ, బదిలీలకు ఓకే..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీపి కబురు అందించారు. వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు మూడ్రోజుల్లోనే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేయటంతో పాటు.. శాశ్వత ప్రాతిపదికన బదిలీల ప్రక్రియ నిర్వహించేలా ‘తెలంగాణ బదిలీల విధానం’ రూపొందిస్తామని ప్రకటించారు. జూన్‌లోనే ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు వీలుగా చర్యలు చేపడుతామని తెలిపారు. వీటితోపాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలన్నింటిపై ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో బుధవారం ప్రగతి భవన్లో సీఎం భేటీ అయ్యారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లతో పాటు ఆర్థిక శాఖ మంత్రి ఈటల సారథ్యంలోని మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులను పరిశీలించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో విలేకరుల సమావేశంలో సీఎం ఈ వివరాలను వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని అన్నారు. ముగ్గురు కమిషనర్లతో కమిషన్ ఇప్పటివరకు ఆనవాయితీగా ఉన్న ఏక సభ్య కమిషన్‌కు బదులు కొత్త పీఆర్సీని ముగ్గురు కమిషనర్లతో (త్రిసభ్య కమిషన్) వేస్తామని సీఎం వెల్లడించారు. ‘‘గతంలో ఏడాదిపాటు పీఆర్సీ అధ్యయనం చేసేది. ఈసారి అందుకు భిన్నంగా శరవేగంగా పీఆర్సీ అధ్యయన ప్రక్రియ పూర్తి చేసేలా కమిషన్‌కు విధివిధానాలను నిర్దేశిస్తాం. ఆగస్టు 15కు పది రోజుల ముందే పీఆర్సీ తమ నివేదికను ప్రభుత్వానికి అందించేలా గడువు విధిస్తాం. పంద్రాగస్టు కానుకగా ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తాం. ఈలోపే ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త పీఆర్సీ వేయగానే.. వారిచ్చే సిఫారసుల మేరకు జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఐఆర్ ప్రకటిస్తాం..’’అని చెప్పారు. బదిలీలకు శాశ్వత విధానం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సాధారణ బదిలీలకు అవకాశమివ్వలేదని సీఎం పేర్కొన్నారు. ‘‘అన్ని సంఘాలు బదిలీల అవసరముందని విజ్ఞప్తి చేశాయి. విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య డీఎస్పీలు తప్ప మిగతా ఉద్యోగుల పంపిణీ దాదాపుగా పూర్తయింది. అందుకే బదిలీలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అవినీతి లేకుండా పారదర్శకంగా, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా బదిలీల ప్రక్రియ జరగాలి. అందుకే స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా అధ్వర్యంలో ముఖ్య కార్యదర్శులు అదర్ సిన్హా, శివశంకర్ ముగ్గురు ఐఏఎస్‌లతో కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ రేపు, ఎల్లుండి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి, ఎప్పట్నుంచి బదిలీల ప్రక్రియ చేపట్టాలి, అవినీతికి తావులేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిస్తుంది. తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే సిఫారసుల మేరకు బదిలీలకు ఉత్తర్వులు జారీ అవుతాయి. భార్యభర్తలను ఒకే చోటికి బదిలీ చేస్తారు. పంచాయతీ ఎన్నికలకు ముందే బదిలీలు పూర్తి చేస్తాం. జూన్ 15లోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందని అనుకుంటున్నాం. బదిలీల్లో ఎక్కడ అవినీతి జరిగినా కఠిన చర్యలుంటాయి. ఇకపై బదిలీలకు సంబంధించి శాశ్వత ప్రాతిపదికన ఒక విధానం ఉండాలని నిర్ణయించాం. నిర్ణీత గడువు లేదా ప్రతి ఏడాది బదిలీలు చేయాలా.. చేస్తే ఎంత శాతం చేయాలి.. ఇవన్నీ పొందుపరుస్తూ బదిలీ విధానం ఉంటుంది. ఈ బాధ్యతను అధికారుల కమిటీతోపాటు మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగించాం. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు మంత్రివర్గ ఉపసంఘాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం’’అని వివరించారు. సీఎం వెల్లడించిన ముఖ్య నిర్ణయాలివీ.. ఒక డీఏ చెల్లించే ఫైలుపై సంతకం పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలకు సంబంధించి ఒక కరువు భత్యం (డీఏ)ను వెంటనే చెల్లిస్తాం. ఈరోజే డీఏకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశాను. మరో డీఏను రెండు నెలల్లో చెల్లిస్తాం. పదోన్నతులకు విధానం సంఘాల కోరిక మేరకు ఉద్యోగుల పదోన్నతుల అర్హతకు రెండేళ్ల సీనియారిటీ ఉండేలా ఇచ్చిన వెసులుబాటును మరో ఏడాది పొడిగిస్తాం. ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించి ఒక విధానం రూపొందిస్తాం. పైరవీలతో ప్రమోషన్లు చేసుకోవాల్సి వస్తోంది. ఆరోపణలున్న ఉద్యోగులకు తప్ప తప్పు చేయని ఉద్యోగులందరికీ పదోన్నతులు రావాలి. ఏ హోదాలో ఉన్న ఉద్యోగికి ఎప్పుడు ప్రమోషన్ వస్తుందో తెలియాలి. అందుకు వీలుగా ఇప్పుడున్న లొసుగులన్నీ తొలిగించి పారదర్శకంగా విధానం తయారు చేయాలి. మహిళా ఉద్యోగులకు 5 రోజుల ప్రత్యేక సెలవు మహిళా ఉద్యోగులకు ఏడాదికి 5 రోజుల ప్రత్యేక సెలవు ఇస్తాం. ఉద్యోగుల ఎల్టీసీకి సంబంధించి నిర్దిష్టమైన విధానం రూపొందిస్తాం. ఇప్పుడున్న ఎల్టీసీ విధానం గందరగోళంగా ఉంది. దుర్వినియోగమవుతుందనే ఫిర్యాదులున్నాయి. విదేశాలకు వెళ్లినా సరే.. ప్రతి ఉద్యోగికి ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇకపై బస్ టికెట్లు, బిల్లులు పెట్టే పద్ధతి ఉండదు. ప్రతి ఉద్యోగి ఏటా ఈ సదుపాయం వినియోగించుకునేలా విధానం ఉంటుంది. ఏటా లేదా మూడేళ్లకోసారి విదేశాలకు వెళ్లినా సరే. ఈ సదుపాయం వినియోగించుకునేలా ఓ నిర్ణీత విధానం ఖరారు చేస్తాం. రిమోట్ ఏరియా అలవెన్స్ ప్రస్తుతం అమల్లో ఉన్న హెచ్ఆర్ఏ చెల్లింపుల్లో లోపాలున్నాయి. మారుమూల ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రోత్సాహం లేదు. అందుకే మారుమూల ప్రాంతాల్లో పని చేసే వారికి ప్రత్యేక అలవెన్స్ ఇస్తాం. ఏయే ప్రాంతాలు మారుమూలన ఉన్నాయి.. ఎక్కడ పని చేసే వారికి ఎంత అలవెన్స్ ఇవ్వాలనేది పీఆర్సీ అధ్యయనం చేసి వెల్లడిస్తుంది. పకడ్బందీగా ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న హెల్త్ స్కీమ్‌ను మరింత పకడ్బందీగా అమలు చేస్తాం. దీనికి ప్రత్యేకంగా హెల్త్ స్కీమ్ విధానం రూపొందిస్తాం. 10 రోజుల్లో కారుణ్య నియామకాలు ఉద్యోగి మరణిస్తే, వారి కుటుంబీకులకు ఇచ్చే కారుణ్య నియామకాలు పది రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తున్నాం. రిటైరైన ఉద్యోగులను సాదరంగా వీడ్కోలు పలకాలి. ప్రభుత్వం తరఫున అందించే పెన్షన్ బెనిఫిట్ ప్యాకేజీని అందించి సత్కరించాలి. ప్రభుత్వ వాహనంలోనే ఇంటి వద్ద దింపి రావాలి. ఇప్పటికే ఈ ఉత్తర్వులిచ్చాం. కానీ పాక్షికంగా అమలవుతోంది. పూర్తిస్థాయిలో అమలయ్యేందుకు ఆదేశాలు జారీ చేస్తాం. సీపీఎస్ ఉద్యోగులకు డెత్, రిటైర్మెంట్ గ్రాట్యుటీ సీపీఎస్ ఉద్యోగులకు తమకు రావాల్సిన బెనిఫిట్స్ రావనే అనుమానాలున్నాయి. వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నంత మేరకు ప్రయోజనం కల్పిస్తాం. డెత్, రిటైర్మెంట్ గ్రాట్యుటీని చెల్లిస్తాం. త్వరలోనే ఈ ఉత్తర్వులు జారీ అవుతాయి. ఏకీకృత సర్వీసులపై న్యాయపోరాటం ఉపాధ్యాయులకు సంబంధించిన ఏకీకృత సర్వీసులు చిన్న మెలికతో ఆగిపోయాయి. ప్రభుత్వమే వారి తరఫున న్యాయపోరాటం చేస్తుంది. సుప్రీంకోర్టులో ప్రత్యేక న్యాయవాదిని పెట్టి వాదనలు వినిపిస్తుంది. భాషా పండితులు, పీఈటీలపై.. భాషా పండితులు, పీఈటీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తాం. ఎయిడెడ్ టీచర్లు, అధ్యాపకులకు సంబంధించి నెలల తరబడి జీతాలు రావడం లేదనే ఫిర్యాదులున్నాయి. దీనికి సంబంధించి సమగ్ర విధానం రూపొందిస్తాం. జోనల్ విధానంపై చర్చలు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇప్పుడున్న జోనల్ విధానంలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. రాష్ట్రంలో నాలుగు జోన్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది. కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలను ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు అందించి అభిప్రాయాలు తీసుకుంటాం. తదుపరి తుది నివేదికను కేబినెట్ ఆమోదంతో రాష్ట్రపతికి పంపించాల్సి ఉంటుంది. -
త్వరలోనే పీఆర్సీ..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి నిర్ణీత గడువు లోపలే పదకొండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటుతోపాటు అమలు కూడా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా వచ్చే జూన్ 2న కొత్త పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని యోచిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పదో పీఆర్సీ గడువు ఈ ఏడాది జూన్ 30న ముగుస్తుంది. పదకొండో పీఆర్సీ ఎప్పుడు వేసినా దానిని ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జూన్ 2న పీఆర్సీ అమలును ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. శరవేగంగా ప్రక్రియ.. గతంలో ఉన్న ఆనవాయితీ ప్రకారం వేతన కమిషన్ ఏర్పాటు, అధ్యయనం, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు వంటి ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు దాదాపు ఏడాది కాలం పట్టేది. దీనికి భిన్నంగా వీలైనంత వేగంగా పీఆర్సీ ప్రక్రియ పూర్తి చేసేలా సీఎం కేసీఆర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీంతో పీఆర్సీ అధ్యయనాన్ని, వివిధ సంఘాలతో చర్చలను కేవలం 15 రోజుల్లో పూర్తి చేసేందుకు ఉన్న అవకాశాలను మంత్రులు, అధికారులు ఇప్పటికే ముఖ్యమంత్రికి నివేదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జూన్ రెండో తేదీనే పీఆర్సీ తీపి కబురు అందించాలని సీఎం యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పదో పీఆర్సీకి సంబంధించి బకాయిల చెల్లింపు ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుంది. దీంతో కొత్త పీఆర్సీ చెల్లింపులను జూలై నుంచే చేయాలా.. నవంబర్ తర్వాత నుంచి ఇవ్వాలా అన్నదిశగా ఆర్థిక శాఖ తమ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. నేడు స్పష్టత వచ్చే అవకాశం ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఉద్యోగ సంఘాలతో సమావేశమై చర్చలు జరపనున్నారు. ఇదే వేదికగా పలు కీలక నిర్ణయాలను సీఎం ప్రకటిస్తారని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులతో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సారథ్యంలోని మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. ఉద్యోగుల డిమాండ్లు, తమ సిఫారసుల నివేదికను మంగళవారం సీఎంకు అందించింది. ఇక ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ గడువు గతేడాది మార్చి నెలాఖరుతోనే ముగిసింది. 50 శాతానికిపైగా ఫిట్మెంట్ ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి స్వయంగా జరిపే చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక బుధవారం నాటి భేటీ సందర్భంగా ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న రెండు డీఏల చెల్లింపు, ఉద్యోగుల బదిలీలు, ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వుల రద్దు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దు, రిటైర్మెంట్ వయో పరిమితి పెంపు తదితర అంశాలపై సీఎం ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. కాస్మోపాలిటన్ నగరాల తరహాలో హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ఏను 40 శాతం పెంచడం, కార్పొరేషన్ల పరిధిలో 30 శాతానికి, తదుపరి కేటగిరీని 20 శాతానికి పెంచే ప్రతిపాదన కూడా సీఎం పరిశీలనలో ఉంది. -
ఈ నెల 14న పీఆర్సీ..!
-
ఈ నెల 14న పీఆర్సీ..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సర్కారు తీపి కబురు వినిపించబోతోంది. ఈ నెల 14న వేతన సవరణ సంఘం(పీఆర్సీ) ఏర్పాటుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటన చేయనున్నారు. ఉపాధ్యాయులు, టీచర్ల డిమాండ్లపైనా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 14న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కానున్నారు. పీఆర్సీ, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్), బదిలీలు, పదవీ విరమణ వయసు పెంపు సహా ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన మొత్తం 18 డిమాండ్లను చర్చించనున్నారు. అలాగే ఉపాధ్యాయ సంఘాల 36 డిమాండ్లపైనా ఈ భేటీలో చర్చించి అదేరోజు నిర్ణయాన్ని వెలువరించనున్నారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు, నివేదిక గడువు, వేతన సవరణను అమల్లోకి తేనున్న కాలవ్యవధిపై సీఎం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే ఆన్లైన్ విధానంలో టీచర్ల బదిలీలు, ఏకీకృత సర్వీస్ రూల్స్, పదోన్నతుల వంటి అంశాలపై ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి చర్చిస్తారు. నివేదిక సిద్ధం చేస్తున్న ఉపసంఘం ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి మంత్రి ఈటల రాజేందర్, కె.తారకరామారావు, జి.జగదీశ్‌రెడ్డితో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం గత శుక్ర, శనివారాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. సీపీఎస్ రద్దు మినహా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రధాన డిమాండ్లపై మంత్రివర్గ ఉప సంఘం సానుకూలత వ్యక్తం చేసింది. సీపీఎస్‌పై నిర్ణయాన్ని ముఖ్యమంత్రికి అప్పగిస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాల డిమాండ్ల సాధ్యాసాధ్యాలపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సిద్ధం చేస్తోంది. ఈ నెల 11న సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించనుంది. అనంతరం ఖజానాపై పడనున్న అదనపు భారాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులతో సీఎం చర్చించనున్నారు. ఈ కసరత్తు ముగిసిన తర్వాత 14న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఆయన నేరుగా సమావేశమై చర్చలు జరుపుతారు. సీపీఎస్‌పై సర్వత్రా ఆసక్తి సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని గత కొంత కాలంగా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం వెలువరించనున్న నిర్ణయంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం నుంచి సానుకూల స్పందన రావొచ్చని ఆయా వర్గాలు ఆశిస్తున్నాయి. గత మార్చిలో జరిగిన రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో సీపీఎస్ రద్దు చేయాలని విపక్షాల నుంచి వచ్చిన డిమాండ్‌కు కేసీఆర్ ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో సీపీఎస్ అమలును అంగీకరిస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఒప్పందం చేసుకుందని, ఈ నేపథ్యంలో సీపీఎస్ రద్దుపై నిర్ణయాధికారం కేవలం కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉందని సీఎం అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. సీపీఎస్ రద్దు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పడం గమనార్హం. -
ఉద్యోగుల పీఆర్సీ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై శుక్రవారం రాత్రి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పదో పీఆర్సీ కమిషన్ సిఫారసుల మేరకు వేతన సవరణ చేసినట్లు అందులో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ చేస్తున్నట్లు గురువారం ప్రకటించిన సీఎం కేసీఆర్... మంచి రోజైన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు సూచించారు. దీంతో ఆర్థికశాఖ ఆగమేఘాలపై ఈ ఫైలును సిద్ధం చేసింది. గురువారం అర్ధరాత్రి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ ఫైలుపై సంతకం చేశారు. అప్పటికే కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లటంతో శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులు హడావుడి పడ్డారు. ఆ ఫైలును సీఎం ఆమోదం, సంతకం కోసం ఫ్యాక్స్‌లో ఢిల్లీకి పంపారు. సీఎం ఆమోదం అనంతరం రాత్రి 7 గంటలకు జీవో నం.12 జారీ చేసినట్లు అధికారికంగా వెబ్సైట్లో పొందుపరిచారు.