
విజయనగరం గంటస్తంభం: ఆర్టీసీ ఉద్యోగులు వచ్చేనెల 1వ తేదీన కొత్త పీఆర్‌సీ వేతనాలు అందుకుంటారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. న్యాయ అంశాలు, నిబంధనలన్నీ పరిశీలించాక కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబదీ్ధకరణ ఉంటుందని, ఈ విషయంలో నెలరోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) 4వ వార్షికోత్సవ రాష్ట్ర సభ విజయనగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవడానికే తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, సీపీఎస్ కంటే మెరుగైన ప్రయోజనాలు కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని మంత్రుల కమిటీకి సీఎం సూచించారన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓపీఎస్ అమలు సాధ్యంకాదన్నారు. తాము ఇచ్చిన ఎన్నికల హామీల్లో 95 శాతం నెరవేర్చామని, ఐదు శాతంలో సీపీఎస్ కూడా ఉందన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములమన్న భావనతో పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమన్నారు.
పెండింగ్ డీఏల సమస్య తొందరలోనే పరిష్కారమవుతుందన్నారు. పీహెచ్‌సీ మొదలుకుని అన్నిస్థాయిల్లోని ఆస్పత్రుల్లో పోస్టులన్నీ డిసెంబర్ ఆఖరుకు భర్తీ చేస్తామన్నారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా అదే సమయానికి భర్తీ చేస్తామని చెప్పారు. తెలంగాణ నుంచి వచ్చిన ఉద్యోగులకు ఎటువంటి పెన్షన్ స్కీం వర్తింపచేయాలన్నది రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కె.సూర్యనారాయణ మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, ఇతర సమస్యలు పరిష్కారానికి చొరవ తీసుకోవాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.