
గత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు
విచారణ జరిపితే, ఆ నివేదికలతో సభలో చర్చిద్దాం
మాపై బురద జల్లేందుకు సభా సమయాన్ని వృథా చేస్తున్నారు
ఒకవేళ చర్చిద్దామంటే 2014 నుంచి మాట్లాడదాం
ఏకపక్ష చర్చల్లో మేము పాల్గొనం
శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స
ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వైఎస్సార్‌సీపీ వాకౌట్
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం కాదని, వాటిపై విచారణ జరిపిస్తే ఆ నివేదికతో సభలో చర్చించాలే తప్ప.. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిరాధార ఆరోపణలతో ప్రతిపక్షంపై బురదజల్లేందుకు ప్రభుత్వం సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ చర్చించాలని ప్రభుత్వం అనుకొంటే 2014 నుంచి ఇప్పటివరకు చర్చించాలని మరోసారి స్పష్టం చేశారు.
సోమవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత గురువారం వాయిదా వేసిన ‘2019–24 మధ్య జరిగిన కుంభ కోణాలపై’ లఘు చర్చలో ప్రభుత్వ సమాధానానికి చైర్మన్ మోషేన్ రాజు అనుమతించారు. దీనిపై ప్రతిపక్ష నేత అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం ఒక పక్కన విచారణకు ఆదేశించామంటూనే, సభలో ఎలా మాట్లాడుతుందని ప్రశ్నించారు. ఇదే లఘు చర్చపై మంత్రి సమాధానానికి గత వారం అవకాశం ఇచ్చారని, 2014 నుంచి చర్చిద్దామని తాము అప్పుడే చెప్పామని అన్నారు. ప్రతిపక్షంపై బురద జల్లేందుకే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.
పైగా విచారణ అని చెప్పి దాన్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మరో 6 నుంచి 10 నెలల్లో విచారణ నివేదికలు తీసుకొచ్చి సభలో చర్చించాలని చెప్పారు. 2014–19 మధ్య జరిగిన కుంభకోణాల మీద కేసుల దర్యాప్తు పూర్తయిందని, నివేదికలూ వచ్చాయని, వాటి మీదా చర్చ జరగాలని స్పష్టంచేశారు. అయినప్పటికీ మంత్రి సమాధానం ఇవ్వాలనుకొంటే.. ఇలాంటి ఏకపక్ష చర్చలో మేము పాల్గొనలేమని స్పష్టం చేశారు. సభ నుంచి వెళ్లిపోతున్నాం అంటూ వాకౌట్ చేశారు.
తెలుగుదేశం పార్టీ పాలనలో పలు కుంభకోణాలు జరిగాయని, వాటిపై కేసులు నమోదయ్యాయని, దర్యాప్తు కూడా పూర్తయిందని తెలిపారు. వాటిపై మాత్రం చర్చకు ప్రభుత్వం అంగీకరించడం లేదని బొత్స మీడియా పాయింట్ వద్ద విమర్శించారు. ఇది కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరి కాదా అని నిలదీశారు.
చీఫ్ విప్‌పై చైర్మన్ ఆగ్రహం
ప్రతిపక్ష నేత మాట్లాడుతున్న సమయంలో చీఫ్ విప్ అనురాధ సమాధానం చెబుతానంటూ లేచి నిల్చోగా చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి ఉండగా మీరు క్లారిఫికేషన్ ఎలా ఇస్తారని, మీకు సంబంధం లేదు కూర్చోవాలని చెప్పారు. ఇలాంటి సంప్రదాయాలు తీసుకొచ్చి మంత్రులు సభను తప్పుదోవ పట్టించొద్దని హితవుపలికారు.
మార్షల్స్‌తో సభ్యులను సభలోకి తీసుకురండి!
ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేసి వెళ్లిపోవడంపై మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో కుంభకోణాలపై చర్చకు బీఏసీలో ప్రతిపక్షం ఆమోదించిందని, కానీ సభలో 2014–19 ప్రభుత్వ పాలనపై ఆరోపణలు చేసి వాకౌట్ చేసిందని అన్నారు. చర్చకు సిద్ధంగా ఉంటే రమ్మనండని అన్నారు. గతంలో మార్షల్స్‌ను పెట్టుకుని సభను అవమానించారని, ఇప్పుడు మార్షల్స్‌కు చెప్పి బయట ఉన్న సభ్యులను లోపలికి తీసుకురావాలని అన్నారు.
గత ఐదేళ్లలో ప్రభుత్వ, అటవీ భూములను కబ్జా చేశారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. లఘు చర్చపై ప్రభుత్వం తరఫున సమాధానమిస్తూ.. సుమారు 1.70లక్షల ఎకరాల్లో భూములు అన్యాక్రాంతం అయినట్టు గుర్తించామన్నారు. వీటిపై సీఐడీ విచారణ చేస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment