ఉద్యోగుల  వెన్నుతట్టేలా..  | Jagan Stands For Ccs Employees | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల  వెన్నుతట్టేలా.. 

Published Sat, Mar 9 2019 3:22 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

Jagan Stands For Ccs Employees - Sakshi

అగనంపూడి (గాజువాక):  కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)లో ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది ఉద్యమాలు పట్టినా పట్టించుకోని సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీపీఎస్‌ ఉద్యోగులకు జగనన్న హామీ భరోసా నిస్తున్నాయి. హర్తాళ్‌లు, ధర్నాలు, రాస్తారోకోలు పికెటింగ్‌లు చేసినా చలించని చంద్రబాబు తీవ్రంగా అన్యాయం చేశారని ఆయా వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

సీపీఎస్‌ వల్ల..

జిల్లాలో కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)లో 14,100 మంది ఉద్యోగులకు జగన్‌ భరోసాతో మేలు జరుగనున్నది. వీరిలో 6వేల మంది ఉపాధ్యాయులుగా, మిగతా 8 వేల మంది వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నారు. 

పీఆర్సీ అంటే వైఎస్సార్‌

పే రివిజన్‌ కమిషనర్‌ (పీఆర్సీ) అంటే గుర్తుకు వచ్చేవి దివంగత సీఎం వైఎస్‌ పాలనలో రోజులు. ఆయన రెండు విడతల పీఆర్సీలు అమలు చేయడంతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య సంఘాలు ఆశించిన దానికంటే ఒకింత ఎక్కువ ప్రకటించి ఉద్యోగుల, వారి కుటుంబాల కళ్లలో కాంతులు నింపిన వైఎస్సార్‌ నేటికీ ఉద్యోగ, ఉపాధ్యాయుల మదిలో కొలువై ఉంటారు.

అటువంటి భరోసా మళ్లీ జగన్‌ సీఎం అయితే దక్కుతుందని అత్యధిక శాతం ఉద్యోగులు విశ్వసిస్తున్నారు. జిల్లాలో వివిధ విభాగాల్లో  2,617 మంది గెజిటెడ్, 26,230 మంది నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులు, 5,557 మంది నాల్గో తరగతి ఉద్యోగులు, 18,737 మంది ఇతరులు మొత్తమ్మీద 51,141 మంది ఉద్యోగులకు జగన్‌ హామీ వల్ల లబ్ధి చేకూరనుంది. 

అర్హతను బట్టి రెగ్యులర్‌...

కాంట్రాక్ట్‌ ఉద్యోగులు అనే పదాన్ని, విద్యాధికులతో వెట్టి చాకిరీ చేయించుకొని కనీస వేతనాలు కూడా చెల్లించని విధానానికి చంద్రబాబే శ్రీకారం చుట్టారు. అదే చంద్రబాబు 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చారు. రెగ్యులర్‌ మాట దేవుడెరుగు కనీస వేతనాలకు కూడా నోచుకోని పరిస్థితుల వల్ల ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి.

ఈ తరుణంలో ప్రజాసంకల్పయాత్రలో జగన్‌ను కలిసిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. అన్ని అర్హతలు ఉండి ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా విధులు నిర్వహిస్తున్న  వేలాది మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని  ప్రకటించారు. అవకాశం లేని వారిక కనీస వేతన చట్ట ప్రకారం జీతాలు చెల్లిస్తామని ఆయన ఇవ్వడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి.

దీనివల్ల జిల్లాలో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న సుమారు 22 వేల మందికి  ప్రయోజనం చేకూరనుంది. వీరిలో ఒక్క విద్యా విభాగంలోనే  2,500 మంది  సీఆర్‌పీలు, ఐఆర్‌టీయూ, డీఎంఎల్‌టీలు, మెసెంజర్లు, ఐఈ కోర్డినేటర్లు, సైట్‌ ఇంజనీర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పార్ట్‌ టైమ్‌ ఇనస్ట్రక్టర్లు, కస్తూర్బా పాఠశాలల్లో పనిచేస్తున్నారు. 

ఉద్యోగికి పదవీ విరమణ తదనంతర జీవితానికి భరోసా పెన్షన్‌... ఆ పెన్షన్‌కు పంగనాలు పెట్టించి ఇప్పుడు తన చేతిలో లేదని మొండి చేయి చూపిస్తున్న చంద్రబాబు అసలు ఈ విధానానికి మన రాష్ట్రంలో పచ్చ జెండా ఊపింది కూడా ఆయనే.

సీపీఎస్‌ అమలు రాష్ట్రాల ఐచ్చికం అని కేంద్రం స్పష్టం చేసినా, నేడు కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన భరోసా ఉద్యోగుల్లో కొండంత ధైర్యాన్నిచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే సీపీఎస్‌ రద్దు ఫైల్‌పై సంతకం చేస్తానని ప్రకటించడాన్ని సీపీఎస్‌ ఉద్యోగులు పూర్తిగా విశ్వసిస్తున్నారు. 

సీపీఎస్‌ రద్దు చేస్తామన్న జగన్‌కే మద్దతు

         

– జాకీర్‌ ఆలీ, జిల్లా అధ్యక్షుడు,  సీపీఎస్‌ పోరాట కమిటీ కన్వీనర్, యూటీఎఫ్‌ 

సీపీఎస్‌ రద్దు చేసే వారికి  సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగులు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.  ప్రస్తుత ప్రభుత్వంపై ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా ప్రయోజనం లేకుండా పోయిం ది. కంట్రిబ్యూటరీ పెన్షన్‌ అనేది ఒక దోపిడీ విధానం. కష్టపడి 30 ఏళ్లు పనిచేసే ఉద్యోగికి పింఛన్‌ అనేది హక్కు.    

 ఉద్యోగుల జీతాల నుంచి కోసిన మొత్తాన్ని షేర్‌ మార్కెట్‌లో పెట్టడం,  ఉద్యోగి పదవీ విరమణ పొందే నాటికి ఆ షేర్‌ విలువను బట్టి సొమ్ము తిరిగి చెల్లించడం అనేది జూదం లాంటిది. సీపీఎస్‌ రద్దు చేస్తామన్న జగన్‌మోహన్‌రెడ్డికి ఉద్యోగులు మద్దతు లభిస్తుంది.  

జగన్‌తోనే ఉద్యోగుల సంక్షేమం

– పి. రాధారాణి, సైన్స్‌ అసిస్టెంట్‌ 

ఉద్యోగులు కూడా ప్రజల్లో ఒక భాగమనే విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం విస్మరించింది. ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన కరువు భత్యం (డీఏ) మూడు విడతలు, చట్ట ప్రకారం గడువు తేదీకి ఇవ్వాల్సిన పీఆర్సీని అమలుచేయకుండా నిర్లక్ష్యగా వ్యవహరిస్తోంది. 

ఉద్యోగుల పక్షపాతిగా వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా దివంగత సీఎం వైఎస్‌ పీఆర్సీ అమలు చేశారు. ఆయనలా పట్టుదల, ధైర్యం, నమ్మకం, విశ్వాసం ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే మెరుగైన పీఆర్సీ అమలు చేస్తానని హామీ ఇవ్వడం సంతోషంగా ఉంది. మాట మీద నిలబడే మనస్తత్వం ఉన్న జగన్‌ మాటలను విశ్వసిస్తున్నాం.


జగన్‌ హామీని నమ్ముతున్నాం

 – ఎస్‌. కూర్మారావు, సీపీఎస్‌ ఉద్యోగి

సీపీఎస్‌ రద్దు చేయాలని పలు విడతల్లో ఆందోళనలు చేపట్టాం. ముట్టడి చేశాం. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రతిపక్ష నేత జగన్‌కు సమస్యను వివరించాం. ఆయన పాదయాత్రలో పలుమార్లు స్పష్టంగా హామీ ఇచ్చారు. ఆయన పలు సందర్భాల్లో సీపీఎస్‌ అనే దోపిడీ పెన్షన్‌ విధానానికి ఫుల్‌స్టాప్‌ పెడతానని ప్రకటించారు.

ఆయన ముఖ్యమంత్రి ఐతే సీపీఎస్‌ భేషరతుగా రద్దు చేస్తానని సీపీఎస్‌ ఉద్యోగులకు, సంఘాలకు హామీ ఇచ్చారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా పెడతామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పనిలేకుండా చేస్తామని హామీ ఇవ్వడం సంతోషంగా ఉంది. జగన్‌ మాటలను నమ్ముతున్నాం. ఆయన ఉద్యోగులను మోసం చేయడని విశ్వసిస్తున్నాం. 

భద్రత కల్పిస్తామనడం అభినందనీయం

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఉద్యోగ భద్రత కల్పించాలి. దశాబ్దాలుగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న వేలాది మంది కనీస వేతనాలకు నోచుకోవడం లేదు. జిల్లాలో సుమారు 22వేల మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. జగన్‌ సీఎం కాగానే అర్హత ఉన్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయనున్నట్టు ప్రకటించడం సంతోషంగా ఉంది. 
 

– కింతాడ అప్పారావు, రాష్ట్ర అధ్యక్షుడు, సీఆర్పీల సంఘం 


ఉద్యోగుల వ్యతిరేకి చంద్రబాబు

– బి.గణేష్, ఉపాధ్యాయుడు

రాష్ట్రం అప్పుల్లో ఉందంటూనే దుబారా ఖర్చులు చేస్తున్నారు. ఉద్యోగుల కరువు భత్యాన్ని వాయిదా పద్ధతిలో చెల్లిస్తామంటున్నారు. ఏడాదిన్నర ఆలస్యంగా ప్రకటించడం, వాటిని కూడా వాయిదాల్లో చెల్లిస్తామని హామీ ఇవ్వడం బాధాకరమైన విషయం. ఉద్యోగులంటే ప్రభుత్వంలో భాగం కాదని పాలకులు భావిస్తున్నారు.

ఉద్యోగులు కూడా మనుషులే, వారు ప్రభుత్వంలో భాగమే అని విశ్వసించే పాలకులు వస్తే తప్పా ఉద్యోగులకు డీఏలు విడతల్లో తప్పవు. జగన్‌ ఆ భరోసా ఇస్తానని చెబుతుండడంతో ఉద్యోగులు ఆయన మాటల్ని విశ్వసిస్తున్నారు. చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో నేను మారాను, ఉద్యోగుల పక్ష పాతిగా ఉంటానని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు ఆయన మాటల్ని విశ్వసించారు. కానీ ఆయనకు ఉద్యోగులంటే గిట్టదని ఈ ఐదేళ్లలో నిరూపించారు.      

వేతన సవరణ వైఎస్‌ చలువే

– బి.శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు  

బతకలేక బడి పంతులు అనే నానుడి ఉండేది.     2003కు ముందు అరకొర జీతాలు. పీఆర్సీ ఫిట్‌మెంట్లు కూడా గొర్రెతోక బెత్తుడు మాదిరిగా ఉండేవి. దీంతో జీతభత్యాలు తక్కువగా ఉండేవి. వైఎస్‌ సీఎం అయిన తరువాతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తలెత్తుకొని నిలబడేలా వేతన సవరణకు నాంది పలికారు. రెండు విడతల పీఆర్సీలో వైఎస్‌ మార్క్‌ కనపడటంతో ఎనిమిదేళ్లలో జీతాలు రెండింతలు అయ్యాయి. మళ్లీ జగన్‌ సీఎం అయితే ఆ రోజులు చూస్తామనే ఆశ కలుగుతుంది. ప్రస్తుత ప్రభుత్వానికి ఉద్యోగులపై చులకన భావం ఉంది.  

కమిటీ పేరుతో కాలయాపన

 – జి.నరసింగరావు, ఉపాధ్యాయుడు 

సీపీఎస్‌ విధానాన్ని ఇటీవల చాలా రాష్ట్రాల్లో విరమించుకున్నాయి. మన రాష్ట్రంలో కమిటీ పేరుతో కాలయాపన చేయడం తగదు. కమిటీల వల్ల ఒరిగేది ఏదీ ఉండదని ఉద్యోగులకు తెలుసు. మా జీతాల నుంచి డబ్బులు కోత కోసి వేరే సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం, లాభాలు వస్తాయో రావోకూడా తెలయని పరిస్థితుల్లో సీపీఎస్‌ విశ్రాంత ఉద్యోగికి భద్రత ఎక్కడ. సీపీఎస్‌ రద్దు చేస్తామన్న జగన్‌ హామీపై నమ్మకం ఉంది.  

ఉద్యోగులకు ఆర్థిక భరోసా

మెరుగైన పీఆర్సీ ద్వారా ఉద్యోగులకు ఆర్థిక భరోసా కలుగుతుంది. చట్టం ప్రకారం ప్రతీ ఐదేళ్లకోసారి వేతన సవరణ జరగాలి. అది ఉద్యోగుల హక్కు ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి కాదు. జగన్‌ సీఎం అయితే మెరుగైన పీఆర్‌సీ అమలు చేస్తారని విశ్వసిస్తున్నాం. 

- శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement