నిధుల సమీకరణపై దృష్టి! | TRS Government Focus On Collecting Funds To Fulfill Promises | Sakshi
Sakshi News home page

నిధుల సమీకరణపై దృష్టి!

Published Wed, Jul 17 2019 1:35 AM | Last Updated on Wed, Jul 17 2019 1:36 AM

TRS Government Focus On Collecting Funds To Fulfill Promises - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక అవసరాలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో.. అవసరమైన నిధుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019–20లోని తదుపరి 3 త్రైమాసికాలకు అవసరమైన నిధులను సమీకరించేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తోంది. వివిధ ఆదాయ మార్గాల ద్వారా రానున్న నెలల్లో రాష్ట్రానికి వచ్చే నిధులను అత్యంత జాగ్రత్తగా వినియోగించుకోవడంతోపాటుగా పెరిగిన ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి అవసరమైన నిధులను బయటి ఆర్థిక సంస్థల నుంచి రాబట్టేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల సలహాదారు, రిటైర్డు ఐఏఎస్‌ జీఆర్‌ రెడ్డికి ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది. వచ్చేనెలలో పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టాల్సి ఉండగా, ఆర్థిక అవసరాలు, నిధుల లభ్యతపై స్పష్టత కోసం ఈ కసరత్తును ప్రారంభించింది.

హామీల పూర్తికే భారీగా నిధులు
శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన కొత్త హామీలను నెరవేర్చడం, పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు, ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయడం, నిర్మాణంలో ఉన్న సాగునీటి పథకాలు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టుల కొనసాగింపునకు రానున్న రోజుల్లో భారీగా నిధులు అవసరం కానుంది. ఇదే విషయాన్ని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించడంతో రాష్ట్ర సంక్షేమ పథకాల వ్యయం రూ.40,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లకు పెరిగిపోయింది. రైతుబంధు పథకం కింద అన్నదాతలకు చేసే ఆర్థిక సాయాన్ని ప్రస్తుత ఖరీఫ్‌ నుంచి ఎకరానికి రూ.4వేల నుంచి రూ.5వేలకు పెంచుతూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ పథకం వార్షిక వ్యయం ఒక్కసారిగా రూ.12,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లకు పెరిగింది. ఇప్పటి వరకు 70% మందికి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించగా, ఇంకా 30% మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అదే విధంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పంపిణీ చేస్తున్న సామాజిక పింఛన్లను రెట్టింపు చేసి ప్రస్తుత జూలై నెల నుంచి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సామాజిక పింఛన్ల వార్షిక భారం రూ.6000 కోట్ల నుంచి రూ.12వేల కోట్లకు చేరింది. దీనికి తోడు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు సంబంధించి రూ.10,000 కోట్ల వరకు పెండింగ్‌ బిల్లులను ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

పీఆర్సీ నిర్ణయం తీసుకుంటే..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ఖజానాపై ఏటా మరో రూ.4వేల కోట్ల నుంచి రూ.5వేల కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు మినహాయిస్తే రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్రఖజానా నుంచే నిధులు వెచ్చించాల్సి ఉంది. మిషన్‌ కాకతీయతోసహా నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల కొనసాగింపుకు మరో రూ.15 వేల కోట్లను ఈ ఏడాది ఖర్చు చేయకతప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అవసరాలను తీర్చాలంటే ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న ఆదాయానికి తోడుగా మరో రూ.40వేల కోట్ల నిధులు అవసరమవుతాయని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు నిధులు సమీకరించేందుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సంప్రదింపులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడి బయటి సంస్థల నుంచి ఆర్థిక సహాయం పొందేందుకున్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అదే విధంగా కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టుల కోసం కార్పొరేషన్లు స్థాపించి నిధులను సమీకరించిన తీరులోనే మరికొన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement