పీఆర్సీతో ఉద్యోగులకు డబుల్‌ లాభం | Double profit for employees with PRC in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పీఆర్సీతో ఉద్యోగులకు డబుల్‌ లాభం

Published Mon, Jan 10 2022 2:47 AM | Last Updated on Mon, Jan 10 2022 8:19 AM

Double profit for employees with PRC in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: పీఆర్సీ అమలు వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు వచ్చే దాని కంటే అదనంగా ప్రతి నెలా దాదాపు రూ.1,000 కోట్ల లబ్ధి చేకూరనుంది. 23 శాతం ఫిట్‌మెంట్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.10,247 కోట్ల అదనపు భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. ఇది కాకుండా ఇంకా పలు ప్రయోజనాలు కలుపుకుంటే ప్రతి నెలా ఉద్యోగుల ఖాతాల్లో రూ.1,000 కోట్లకు పైగా జమ కానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. జనవరి నెల జీతంతోపాటే ఈ పెరుగుదల ఉండనుంది. ఉద్యోగులు డిసెంబర్‌ నెలలో తీసుకున్న జీతం కంటే జనవరి జీతం కచ్చితంగా పెరుగుతుంది.

23 శాతం ఫిట్‌మెంట్‌ అమలు వల్ల మూల వేతనం (బేసిక్‌ పే) కనీసం 53.84 శాతం పెరుగుతుంది. అంటే గత పీఆర్సీలో రూ.13 వేల మూల వేతనం ఉన్న ఉద్యోగికి అది ఇప్పుడు రూ.20 వేలకు పెరుగుతుంది. గత పీఆర్సీలో ఉన్న గరిష్ట మూల వేతనం రూ.1,10,850 ఇప్పుడు రూ.1.79 లక్షలకు పెరుగుతుంది. అంటే ప్రతి ఉద్యోగి మూల వేతనాన్ని బట్టి రూ.7 వేల నుంచి రూ.68,150 వరకు పెరుగుతుంది. దీన్ని బట్టే ఉద్యోగుల జీపీఎఫ్, హౌస్‌ బిల్డింగ్‌ అడ్వాన్సు, డీఏ, ఇతర ఆలవెన్సులన్నింటినీ లెక్కిస్తారు. తద్వారా పీఆర్సీ వల్ల ఉద్యోగులకు ప్రయోజనం సంతృప్తికర స్థాయిలో ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీనివల్లే రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా పడే అదనపు భారం రూ.10,247 కోట్లకు రెట్టింపు భారం ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఒకేసారి అనేక ప్రయోజనాలు  
► ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని సిఫారసు చేసింది. అయితే పీఆర్సీతోపాటు ఉద్యోగులకు ఒకేసారి అనేక రకాల ప్రయోజనాలు కల్పిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ 23 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు.  
► రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఇంత ఫిట్‌మెంట్‌ ఇవ్వడం గొప్ప విషయమని ఉద్యోగ సంఘాల నాయకులే చెబుతున్నారు. ఫిట్‌మెంట్‌తో పాటు ఒకేసారి ఐదు డీఏలను ఇవ్వడం వల్ల ఉద్యోగుల వేతనాల్లో పెరుగుదల సంతృప్త స్థాయిలో ఉంటుందని ఉద్యోగులు చెబుతున్నారు. 
► ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌కు సంబంధించి రెండు వారాల్లో తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ సీఎస్‌ను ఆదేశించడం.. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా తాజా పీఆర్సీ వస్తుందని ప్రకటించడం పట్ల ఉద్యోగులు హర్హం వ్యక్తం చేస్తున్నారు.  

రిటైర్‌మెంట్‌ వయసు పెంపుతో భారీగా లబ్ధి  
► ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం సాహసోపేతమైన నిర్ణయంగా ఉద్యోగులు అభివర్ణిస్తున్నారు. తెలంగాణలో 60 నుంచి 61 సంవత్సరాలకు రిటైర్‌మెంట్‌ వయసు పెంచారు. అక్కడికన్నా ఇక్కడ మరో ఏడాది పెంచడం వల్ల వేలాది మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.  
► లబ్ధి పొందే ప్రతి ఉద్యోగికి అదనంగా 24 నెలల ఉద్యోగ సమయం ఉంటుంది. దీనివల్ల మధ్యస్థాయి ఉద్యోగికి రూ.30 నుంచి రూ.40 లక్షలకుపైగా లబ్ధి చేకూరుతుందని అంచనా. రెండేళ్ల సర్వీసు పెరగడం వల్ల పెన్షన్‌ కూడా ఆదే స్థాయిలో పెరుగుతుంది. 

అడక్కపోయినా ఇళ్ల స్థలాలు  
► సొంతిల్లు ప్రభుత్వ ఉద్యోగుల కల. వాస్తవానికి ఉద్యోగ సంఘాల డిమాండ్లలో ఇది లేదు. అసలు సంఘాలు దీని గురించి ప్రభుత్వాన్ని అడగలేదు. అడక్కపోయినా ఉద్యోగులకు జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్స్‌లోని ఎంఐజీ లేఅవుట్లలో పది శాతం స్థలాలు రిజర్వు చేస్తామని సీఎం ప్రకటించారు. వాటిలో 20 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించడంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 
► ఇళ్ల స్థలాలపై గత టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులను నమ్మించి మోసం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఇళ్ల స్థలాలు వస్తాయని ఉద్యోగులు ఎంతో ఎదురు చూశారు. కానీ చంద్రబాబు మాయ మాటలతో కాలక్షేపం చేశారు. తుదకు రాజధానిలోనూ ఉద్యోగులకు ఇళ్లు ఇస్తానని నమ్మించి రంగుల కలలు చూపించి మోసం చేశారు. వైఎస్‌ జగన్‌ మాత్రం ఉద్యోగులు అడక్కుండానే నియోజకవర్గాల వారీగా ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తానని ప్రకటించడం పీఆర్సీలో ప్రత్యేక అంశంగా నిలిచింది.  

పలు కీలక నిర్ణయాలతో మరింత లబ్ధి 
► మానిటరీ బెనిఫిట్స్‌ 21 నెలల ముందు నుంచి ఇస్తుండడం వల్ల ఉద్యోగులకు భారీగా లబ్ధి చేకూరనుంది. కార్యదర్శుల కమిటీ పీఆర్సీ బెనిఫిట్స్‌ను 2022 అక్టోబర్‌ నుంచి ఇవ్వాలని సిఫారసు చేసింది. దీనివల్ల కొందరు ఉద్యోగులు నష్టపోతారని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేయడంతో 2020 ఏప్రిల్‌ నుంచి మానిటరీ బెనిఫిట్స్‌ ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా ఉద్యోగులకు 21 నెలల బకాయిలు దక్కనున్నాయి. 
► సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ చెప్పినట్లు ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి కాకుండా, 2020 ఏప్రిల్‌ నుంచి అమలు చేయడం వల్ల 31 నెలల ముందే పీఆర్సీ అమలయినట్లు అవుతుందని ఉద్యోగులు విశ్లేషిస్తున్నారు.  
► కోవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబాల వారికి కారుణ్య నియామకాలు, ఉద్యోగుల హెల్త్‌ స్కీంపైనా ఉద్యోగులకు భరోసా ఇచ్చే నిర్ణయాలు ప్రకటించారు.  
► సీఎం వైఎస్‌ జగన్‌ మానస పుత్రిక అయిన గ్రామ సచివాలయ వ్యవస్థలోని 1.38 లక్షల ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ను జూన్‌ లోపు పూర్తి చేసి, జూలై నుంచి పే స్కేల్‌ వర్తింప చేయనున్నారు. దీనివల్ల లక్షలాది కుటుంబాలకు ఉద్యోగ భద్రత సమకూరనుంది. ఇలా ఉద్యోగులకు మేలు చేయడమే లక్ష్యంగా అడిగిన వాటిని, అడగని వాటిని రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చేందుకు నడుం బిగించింది. దీనిపై ఉద్యోగుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇన్ని ప్రయోజనాలు చిన్న విషయం కాదు 
ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీతో సహా అనేక ప్రయోజనాలను ఒకేసారి కల్పించడం గతంలో ఎప్పుడూ జరగలేదు. 5 డీఏలను ఒకేసారి విడుదల చేయడం సామాన్య విషయం కాదు. 23 శాతం ఫిట్‌మెంట్, రిటైర్‌మెంట్‌ వయసు రెండేళ్లు పెంపు, ఇళ్ల స్థలాలు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు జూన్‌లో ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ వంటివన్నీ సీఎం జగన్‌ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు. ఉద్యోగులకు రూ.10 వేల కోట్లకుపైగా లబ్ధి చేకూరనుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. కళ్ల ముందు వాస్తవాలు కనపడుతున్నా తప్పుడు ప్రచారాలు చేయడం సమంజసం కాదు.   – ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం)  

వాస్తవాలకు మసి పూస్తున్న ఎల్లో మీడియా  
► పీఆర్సీ వల్ల ప్రభుత్వంపై రూ.వేల కోట్ల భారం పడుతున్న విషయం వాస్తవమని తెలిసినా.. ఎల్లో మీడియా, కొన్ని ప్రభుత్వ వ్యతిరేక శక్తులు దుష్ప్రచారం చేస్తూ ఉద్యోగ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వాస్తవాలను వక్రీకరిస్తూ పీఆర్సీ వల్ల ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని అదేపనిగా అబద్ధాలు చెబుతున్నాయి. 
► ఉద్యోగులకు జీతాలు పెరగకపోతే ప్రభుత్వంపై ఇంత భారం పడే అవకాశం ఉండదు. రకరకాల లెక్కలు వేసి ఉద్యోగుల జీతాలు తగ్గుతున్నాయంటూ ఎల్లో మీడియా తప్పుడు వార్తలు ప్రచురిస్తోంది. సోషల్‌ మీడియాలోనూ, ఉద్యోగుల గ్రూపుల్లోను తప్పుడు ప్రచారాలను వైరల్‌ చేస్తుండడంపై విస్మయం వ్యక్తమవుతోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement