అభిప్రాయం
దేశంలోనే అన్ని రంగాల్ని మొట్టమొదటగా ప్రైవేటీకరించడం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అన్నిటికంటే ప్రమాదకరమైంది – స్కూళ్ళు, జూనియర్ కాలేజీల విద్యా ప్రైవేటీకరణ. దీంతో పేదలకు చదువు దూరమైంది. ఆంగ్లం అందకుండా పోయింది. దీనికి విరుగుడుగా జగన్ నేతృత్వంలో విద్యా, వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ వ్యతిరేక మోడల్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైంది. దేశంలోని మొత్తం స్కూలు విద్యను ఎల్‌కేజీ నుండి 12వ తరగతి వరకు ప్రైవేట్ రంగం నుండి ప్రభుత్వ రంగంలోకి మార్చకుండా విద్యా సమానత్వాన్ని తేవడం సాధ్యమా? అందుకే గ్రామాలలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు అట్టడుగు గ్రామీణ శ్రమజీవుల జీవితాలను మార్చడానికి ప్రభుత్వం ఏమి చేస్తున్నదో అర్థం చేసుకోవడం ముఖ్యం.
రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు ఎక్కువ ఎటు ఓటు వేశారనేది ముందుగానే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించినప్పుడు తెలుస్తుంది. ముఖ్యంగా అత్యధిక సంఖ్యలో ఉన్న టీచర్లు – స్కూలు, కాలేజీ, యూనివర్సిటీలలో పనిచేసేవారు ఎటువైపు ఉన్నారు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, సహాయక సిబ్బంది ఎటు ఓటు వేస్తారనేది కూడా ముఖ్యం. వీరితోపాటు గణనీయ సంఖ్యలో ప్రభుత్వ పోలీసు రంగం ఉద్యోగులు కూడా ఎటు ఓటు వేస్తారనేది చాలా ముఖ్యం. ఇక రెవెన్యూ, మున్సిపాలిటీ, సఫాయి శాఖతో పాటు ప్రభుత్వ రంగంలో ఉన్న పర్మనెంటు ఉద్యోగులు ఎటు ఓటు వేస్తారు, ఎవరు గెలవాలనుకుంటారు అనేది చాలా ముఖ్యమైంది. ఇంతకీ ఈ ఉద్యోగుల ఓటు గురించి ఎన్నడూలేని విధంగా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లోనే ఎందుకు చర్చించాలి? దానికొక ముఖ్య కారణమున్నది.
జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబులాగే ఒక రీజినల్ పార్టీ నడిపే ప్రభుత్వం. దేశంలోనే అన్ని రంగాల్ని మొట్టమొదటగా ప్రైవేటీ కరించడం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి, చంద్రబాబునాయుడు. అన్నిటికంటే ప్రమాదకరమైంది–స్కూళ్ళు, జూనియర్ కాలేజీల విద్యా ప్రైవేటీకరణ. దాన్ని ఆయన విపరీతంగా ప్రైవేటీకరించి అక్కడినుండి పార్టీ ఫండ్‌ను జమ చేశాడు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో ఎంట్రెన్సులు, కోచింగ్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. ఈ దశలోనే పుట్టగొడుగుల్లా స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు, గైడ్ రైటింగ్ కంపెనీలు, అడ్వరై్టజ్ ర్యాంకులు మొదలయ్యాయి.
వైద్య రంగంలో కూడా ప్రభుత్వ రంగాన్ని మండలాల వరకు అభివృద్ధి చెయ్యకుండా ప్రైవేట్ హాస్పిటల్స్, ఒక్కొక్క డాక్టరు తన సొంత హాస్పిటల్ కట్టి నడపడం మొదలయ్యాయి. గత ఐదేళ్ళ జగన్ పాలనలో ప్రభుత్వ విద్యా రంగంలో ఇంగ్లిష్ మీడియం పెట్టి, స్కూళ్ళ అభివృద్ధి ప్రారంభించాక స్కూలు విద్యలో ప్రైవేట్ రంగం విద్య బాగా పడిపోయింది.
స్కూలు టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థ వ్యతిరేక అభివృద్ధిని ఎలా చూడాలి? రాష్ట్రంలో మండలం, గ్రామ స్థాయిలో చిన్న, చిన్న ప్రభుత్వ హాస్పిటల్స్ పెరిగి, వాటిని టెలీ మెడిసిన్‌తో ముడేసిన వైద్యం... వైద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకమైందా, కాదా? గ్రామ సెక్రటేరియట్‌ల నిర్మాణం, చిన్న జీతాలతోనైనా 2,50,000 మంది వలంటీర్లను ప్రభుత్వ రంగంలో నియమిస్తే ప్రభుత్వ రంగం విస్తరించినట్టా, ప్రైవేట్ రంగం విస్తరించినట్టా?
నిజంగానే బడ్జెట్ డబ్బులో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంత బీద, దిగువ మధ్యతరగతి రైతాంగానికి, కూలీలకు బదిలీ చేయబడ్డది కనుక ఉద్యోగుల జీతభత్యాల పెరుగుదల ఆగిందనుకుందాం. అయినా ప్రభుత్వ రంగ ఎదుగుదల, ప్రైవేట్ రంగ ఎదుగుదల కోణం నుండి చూసినప్పుడు ప్రభుత్వం 30 వేల ఎకరాల్లో అమరావతి కట్టడం కోసం కాంట్రాక్టర్లకు ఆ డబ్బు ఇస్తే ఏ రంగం పెరిగేది? అందుకు బదులు గ్రామీణ అభివృద్ధి ముఖ్యంగా విద్యా, వైద్య రంగాల అభివృద్ధి జాతీయ వాదంలో కీలకమైంది.
ఈ స్థితిలో ప్రభుత్వ రంగ ఉద్యో గులు, ముఖ్యంగా టీచర్లు ఏ ముఖ్యమంత్రిని కోరుకోవాలి? ప్రభుత్వ రంగాన్ని గణనీయంగా పెంచిన జగన్‌నా, ప్రైవేట్ రంగ అనుకూల బాబునా? మరీ ముఖ్యంగా మోదీల కూటమినా? పవన్ కల్యాణ్‌కి సినిమా రంగం తప్ప ఏ రంగం గురించి తెలియదు. ఆయన మోదీ, బాబు ఏది చెబితే అది చేస్తాడు.
ఉద్యోగస్తులు నిరంతరం ప్రజా జీవన విధానం, వారి ఆర్థిక స్థితి గతులతో సంబంధం లేకుండా తమ జీతాల పెంపు, అనుకూల ట్రాన్స్ ఫర్, రిటైర్మెంట్ ఏజ్ పెంపు గురించి ఆలోచిస్తే క్రమంగా ప్రభుత్వ రంగాన్ని మూసేసి ప్రైవేట్ రంగ ఎదుగుదలకు ఓటెయ్యడమే. భవిష్యత్ తరాల బతుకుదెరువు గురించి, రాష్ట్ర, దేశ భవిష్యత్ గురించి మాకెందుకు అనుకుంటే ప్రైవేటీకరణను ప్రభుత్వ రంగ ఉద్యోగులే కోరుకోవడం కాదా? ఉద్యోగుల్లో, ముఖ్యంగా టీచర్లు కమ్యూనిస్టు పార్టీలతో ఉండి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుంటారు.
అదే టీచర్లు ఇప్పుడు ఏపీలో ప్రైవేట్ విద్యారంగాన్ని ప్రభుత్వ రంగంలోకి మారిస్తే, ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే, నాడు–నేడు పథకం ద్వారా స్కూళ్ల రూపురేఖలను మారిస్తే ఈ ప్రక్రియకు మద్దతు ఇవ్వాలి కదా! కమ్యూ నిస్టు పార్టీలు ఈ నూతన ప్రభుత్వ రంగ అభివృద్ధిని వ్యతిరేకిస్తూ జగన్‌ను ఓడించాలని చూస్తున్నాయి. ఇది విద్యా, వైద్య రంగంలో పెరుగుతున్న ప్రభుత్వ ఆస్తులను వ్యతిరేకించడం కాదా?
కమ్యూనిస్టులు ఏపీలో ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ మీడియంను తీసేసి, ఆ బడులను మూసేసి, విద్యా దోపిడీదారులకు అప్పజెబుతారా? భారతదేశంలో అతి పెద్ద ప్రైవేట్ సెక్టార్, విద్యా రంగం. ప్రైవేట్ రంగంలో ఇంగ్లిష్ విద్య పేరుతో చంద్రబాబు మిత్రబృందం వేల కోట్లు దోచుకుంటుంటే జగన్ ప్రభుత్వం ఆ దోపిడీకి అడ్డుకట్ట వేసే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది.
కమ్యూనిస్టులు సైతం ప్రభుత్వ రంగ అభివృద్ధిని వ్యతిరేకిస్తూ, మాతృభాష ప్రాంతీయ వాదానికి తలొగ్గి మళ్ళీ ప్రైవేట్ విద్యా వైద్యానికి ఊడిగం చేస్తే ప్రజలు వీరినెలా నమ్ముతారు? విద్యా, వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ వ్యతిరేక మోడల్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైంది. దాన్ని చంపెయ్యడానికి కమ్యూనిస్టులు నడుం కడితే ప్రజలు ఏమైపోవాలి?
ఆరెస్సెస్/బీజేపీ నేతృత్వంలో నడిచే కేంద్ర ప్రభుత్వం కేంద్ర స్థాయి పరీక్షలు, సెంట్రల్ యూనివర్సిటీల ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే రాయనిస్తున్నది. అంటే క్రమంగా హిందీని దేశపు ఉత్పత్తి కులాల పిల్లల మీద రుద్ది, ధనవంతులకు మాత్రమే ప్రైవేట్ ఇంగ్లిష్ అంతర్జాతీయ జ్ఞాన సంపదను అందు బాటులో ఉంచ చూస్తున్నది.
ఈ విద్యా విధానాన్ని ఎలా ఎదు ర్కోవాలి? దేశంలోని మొత్తం స్కూలు విద్యను ఎల్‌కేజీ నుండి 12వ తరగతి వరకు ప్రైవేట్ రంగం నుండి ప్రభుత్వ రంగంలోకి మార్చ కుండా విద్యా సమానత్వాన్ని సాధించగలమా? దేశంలో విద్యా వ్యవస్థని, కనీసం స్కూలు విద్యా వ్యవస్థనైనా ప్రభుత్వ రంగంలోకి మార్చడానికి ప్రభుత్వ టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, మానవ సమానత్వం కోసం పనిచేసేవాళ్ళు సపోర్టు చెయ్యకపోతే ఎలా?
అంతేకాక ప్రభుత్వ ఉద్యోగులు బీద ప్రజల సంక్షేమం కోసం బడ్జెట్ డబ్బును ఖర్చు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తమ కుటుంబాల గురించే ఆలోచిస్తే ప్రభుత్వ రంగం కూలిపోక ఏమౌతుంది? ఈ సమస్య చాలా కీలకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ముందు ఉన్నది. దేశంలోనే అన్ని రంగాల్ని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలోకి నెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్లు ప్రభుత్వ రంగ వ్యతిరేకికే ఓటు వేస్తే జరిగేదేంటి?
గ్రామాలలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్లు అట్టడుగు గ్రామీణ శ్రమ జీవుల జీవితాలను మార్చడానికి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూసి ఆ ప్రభుత్వాన్ని కొనసాగించాలా వద్దా అని నిర్ణ యించుకోవాలి. ఉత్పత్తి రంగంలో పనిచేసే ప్రజల జీవితాలను మెరుగుపర్చే ప్రభుత్వం ఉన్నప్పుడు తమ జీతభత్యాల పెంపుదలతో కొంత రాజీపడాల్సి వస్తే కూడా పడాలి. అది ఒక ఉద్యోగి రాష్ట్రానికి, దేశానికి చేసే మేలు. రాజకీయ నాయకులు దోచుకుంటున్నప్పుడు వారిపై పోరాటం తప్పు కాదు.
ఉద్యోగులు హక్కులను, ఆత్మగౌర వాన్ని ఎప్పుడు కూడా తాకట్టు పెట్టకూడదు. అయితే, తమ హక్కుల పోరాటం, ఉత్పత్తి రంగంలో పనిచేసే మానవాళిని ఆకలితో మాడ్చ టానికో, బీద పిల్లలు ధనవంతుల పిల్లలతో పోటీపడి ఎదిగే జీవితాన్ని అడ్డుకోవడానికో చెయ్యడం మహానేరం. ఈ మాట 38 సంవత్సరాలు ప్రభుత్వ రంగంలో పనిచేసిన వ్యక్తిగా చెబుతున్నాను. ప్రతి ఉద్యోగి, ఓటరు, పౌరుడు దిక్కు లేని వారికి దిక్కుగా నిలబడాలి. అందుకే 2024 ఎన్నికల్లో వాళ్ళ ఓటు వాళ్ళ జీవిత లక్ష్యాన్ని సూచిస్తుంది.
ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment