ఈ నెల 14న పీఆర్సీ..! | Announcement On PRC By CM KCR On 14th | Sakshi
Sakshi News home page

ఈ నెల 14న పీఆర్సీ..!

Published Wed, May 9 2018 1:01 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

Announcement On PRC By CM KCR On 14th - Sakshi

తెలంగాణ సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సర్కారు తీపి కబురు వినిపించబోతోంది. ఈ నెల 14న వేతన సవరణ సంఘం(పీఆర్సీ) ఏర్పాటుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటన చేయనున్నారు. ఉపాధ్యాయులు, టీచర్ల డిమాండ్లపైనా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 14న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కానున్నారు. పీఆర్సీ, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌), బదిలీలు, పదవీ విరమణ వయసు పెంపు సహా ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన మొత్తం 18 డిమాండ్లను చర్చించనున్నారు.

అలాగే ఉపాధ్యాయ సంఘాల 36 డిమాండ్లపైనా ఈ భేటీలో చర్చించి అదేరోజు నిర్ణయాన్ని వెలువరించనున్నారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు, నివేదిక గడువు, వేతన సవరణను అమల్లోకి తేనున్న కాలవ్యవధిపై సీఎం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే ఆన్‌లైన్‌ విధానంలో టీచర్ల బదిలీలు, ఏకీకృత సర్వీస్‌ రూల్స్, పదోన్నతుల వంటి అంశాలపై ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి చర్చిస్తారు. 

నివేదిక సిద్ధం చేస్తున్న ఉపసంఘం 
ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి మంత్రి ఈటల రాజేందర్, కె.తారకరామారావు, జి.జగదీశ్‌రెడ్డితో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం గత శుక్ర, శనివారాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. సీపీఎస్‌ రద్దు మినహా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రధాన డిమాండ్లపై మంత్రివర్గ ఉప సంఘం సానుకూలత వ్యక్తం చేసింది. సీపీఎస్‌పై నిర్ణయాన్ని ముఖ్యమంత్రికి అప్పగిస్తున్నట్లు తెలిపింది.

ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాల డిమాండ్ల సాధ్యాసాధ్యాలపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సిద్ధం చేస్తోంది. ఈ నెల 11న సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించనుంది. అనంతరం ఖజానాపై పడనున్న అదనపు భారాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులతో సీఎం చర్చించనున్నారు. ఈ కసరత్తు ముగిసిన తర్వాత 14న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఆయన నేరుగా సమావేశమై చర్చలు జరుపుతారు. 

సీపీఎస్‌పై సర్వత్రా ఆసక్తి 
సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని గత కొంత కాలంగా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం వెలువరించనున్న నిర్ణయంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం నుంచి సానుకూల స్పందన రావొచ్చని ఆయా వర్గాలు ఆశిస్తున్నాయి. గత మార్చిలో జరిగిన రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో సీపీఎస్‌ రద్దు చేయాలని విపక్షాల నుంచి వచ్చిన డిమాండ్‌కు కేసీఆర్‌ ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది.

గత యూపీఏ ప్రభుత్వ హయాంలో సీపీఎస్‌ అమలును అంగీకరిస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఒప్పందం చేసుకుందని, ఈ నేపథ్యంలో సీపీఎస్‌ రద్దుపై నిర్ణయాధికారం కేవలం కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉందని సీఎం అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. సీపీఎస్‌ రద్దు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement