సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేత మళ్లీ తెరపైకి వచ్చింది. అర్హులైన పేదలకు కొత్తగా రేషన్ కార్డులు జారీ చేస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన నేపథ్యంలో.. కొత్త కార్డుల కంటే ముందుగా బోగస్ కార్డుల ఏరివేతపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టనుంది. రాష్ట్రంలో సుమారు 8 లక్షలకు పైగా బోగస్ కార్డులు చెలామణీలో ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో ముందుగా వాటిని తొలగించాకే కొత్తవాటిపై దృష్టి పెట్టాలని యోచిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో సీఎం స్థాయిలో జరిగే సమీక్ష అనంతరం కార్యాచరణ సిద్ధం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
గతంలో మాదిరే మళ్లీ ఏరివేత..
రాష్ట్రంలో ప్రస్తుతం 87.56 లక్షల రేషన్ కార్డులు ఉండగా, వీటి ద్వారా 2.8 కోట్ల మంది లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున రూపాయికి కిలో బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇందులో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద గుర్తించిన వారు 1.91 కోట్ల మంది ఉన్నారు. రాయితీ బియ్యం పంపిణీకి ప్రభుత్వం ఏటా రూ.2,200 కోట్ల మేర ఖర్చు చేస్తోంది. రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే బోగస్ కార్డుల ఏరివేతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించిన ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ కోసం సేకరించిన ఐరిస్, వేలిముద్రలతో పాటు ఆధార్ కార్డుల జారీకి తీసుకున్న కుటుంబాల వివరాలను కూడా ప్రత్యేక సర్వర్ ద్వారా క్రోడీకరించి బోగస్ కార్డులను తొలగించింది.
వలస వెళ్లిన కుటుంబాలు, ఒకే కుటుంబంలో రెండు, అంతకంటే ఎక్కువ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, ఒకే కుటుంబంలో తెలుపు, గులాబీ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, నివాసంలో లేకుండా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, చనిపోయిన వారి వివరాలను సేకరించి సుమారు 10 లక్షల కార్డులను తొలగించింది. ప్రస్తుతం కొత్త కార్డులు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో బోగస్ కార్డుల ఏరివేత మళ్లీ కానుంది. రాష్ట్రంలో ఈ ఏడేళ్లలో చనిపోయిన వారు, ఇతర రాష్ట్రాల్లో కార్డులు కలిగి ఉన్న వారు సుమారు 8 లక్షల వరకు ఉంటారని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. ఈ కార్డులన్నింటినీ ఆధునిక పరిజ్ఞానం ద్వారా తొలగించాలని చూస్తోంది.
కొత్త కార్డుల కోసం ఎదురు చూపులు
బోగస్ కార్డుల ఏరివేత తర్వాతే కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో చాలా ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ నిలిచిపోయింది. ప్రతి జిల్లాలో కుప్పలు తెప్పలుగా రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు రాగా, వీటిల్లో కొన్ని పరిశీలనలోనే నిలిచిపోగా, మరికొన్ని మంజూరు కాకుండా ఆగిపోయాయి. మీ–సేవ ద్వారా, ఆహార భద్రతా కార్డు వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా కొత్త కార్డులు, రద్దయిన కార్డుల పునరుద్ధరణ, కార్డుల్లో మార్పుచేర్పులు చేసుకునేందుకు భారీగా దరఖాస్తులు వచ్చినా చాలా వరకు పరిష్కారం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా పౌర సరఫరాల వద్ద కనీసం 5.5 లక్షల కార్డులు పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది.
ఇందులో గ్రేటర్ పరిధిలోనే 1.65 లక్షల దరఖాస్తులు, రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో లక్ష దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా వేస్తున్నా రు. ప్రస్తుతం కొత్త కార్డుల జారీ మొదలు పెడితే పాత దరఖాస్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం కొత్తగా మళ్లీ వచ్చే దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంటుంద ని పౌర సరఫరాల వర్గాలు చెబుతున్నాయి. ఇక అర్హులందరికీ గతంలో మాదిరి లామినేషన్ చేసిన కార్డును కాకుండా యూవిక్ పేపర్‌తో కూడిన కార్డును అందజేయాలనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment