సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్ ప్రాజెక్టులను తన పరిధిలోకి తెచ్చుకునేలా సిద్ధం చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రతిపాదనలను కేంద్రానికి పంపొద్దని తెలంగాణ ప్రభుత్వం గోదావరి బోర్డుకు విన్నవించింది. ఏక పక్షంగా బోర్డు పరిధిని నిర్ణయించడం సమంజసం కాదని, ఇది పునర్విభజన చట్టానికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం బోర్డుకు లేఖ రాసింది. గోదావరి బేసిన్‌లో తెలంగాణ, ఏపీల మధ్య ఎలాంటి ఉమ్మడి ప్రాజె క్టులు లేవని, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు లేక ఇరు రాష్ట్రాల మధ్య సంయుక్తంగా నిర్మించిన ప్రాజెక్టుల్లేవని పేర్కొంది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్–87 ప్రకారం గతంలో ఉన్న అవార్డులు, అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం–1956 మేరకు ఏర్పడ్డ ట్రిబ్యునల్‌ల తీర్పులకు లోబడి కేంద్రం బోర్డుల పరిధిని నోటిఫై చేయాల్సి ఉంటుందని గుర్తు చేసింది.
అయితే గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకోవడానికి సంబంధించి ఎలాంటి అంశాల్లేవని పేర్కొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త మార్గదర్శకాలను తెలంగాణ, ఏపీలోని గోదావరి ప్రాజెక్టులపై రుద్దరాదని స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్–85 ప్రకారం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బోర్డు సమావేశంలో చర్చించాలని, అయితే గోదావరి బోర్డు చైర్మన్ ఏకపక్షంగా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించడం సమంజసం కాదని పేర్కొంది. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని తెలిపింది. వీటిని పరిగణనలోకి తీసుకొని తక్షణమే బోర్డు పరిధిని ఖరారు చేయాలని పంపే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విన్నవించింది.
Comments
Please login to add a commentAdd a comment