సాక్షి, హైదరాబాద్ : బొమ్మల రామారం హాజీపూర్ ఘటన దేశ ప్రజలని దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ నరసింహన్‌ను కోరినట్లు తెలిపారు. బుధవారం రాజ్‌భవన్‌లో ఆయనను కలిసిన సందర్భంగా.. గత నాలుగు మాసాలుగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి వివరించినట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ సంవత్సరంలో వెయ్యికి పైగా మహిళలు అపహరణకు గురయ్యారన్నారు. వారి ఆచూకీ ఇప్పటివరకు దొరకకపోవడం చాలా బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు అమ్మాయిలను ఒక వ్యక్తి అత్యాచారం చేసి, హత్య చేసిన దారుణ ఘటన అందరినీ కలచివేసిందన్నారు. అలాంటి నిందితులకు ఉరి శిక్షే సరైందని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయడంతో పాటుగా.. ప్రభుత్వం వారి కుటుంబాలకు రూ. 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణా ప్రభుత్వంలో మహిళా మంత్రి లేకపోవడం వల్లే మహిళలకు సరైన న్యాయం జరగడం లేదని విమర్శించారు. హాజీపూర్ హత్యోందంతంపై ఢిల్లీ వెళ్లి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని దత్తాత్రేయ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment