
సాక్షి, బయ్యారం(మహబూబబాద్): నిరుపేద యువతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకాన్ని కొందరు అభాసుపాలు చేస్తున్నారు. పథకం ప్రారంభం కాక ముందు జరిగిన వివాహాలు ఇటీవలే జరిగినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి డబ్బు కాజేసేందుకు ప్రయత్నించారు. అయితే, విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు దీన్ని అడ్డుకున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాలాజీపేటకు చెందిన ముగ్గురు మహిళలకు ఐదేళ్ల క్రితం, మరో మహిళకు రెండేళ్ల క్రితం వివాహాలు జరిగాయి.
వీరిలో ఇద్దరికి ఐదు, నాలుగేళ్ల పిల్లలు కూడా ఉన్నారు. అయితే, తాజాగా వారి పేరున కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరవడంతో అనుమానం వచ్చిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ నలుగురికి సంబంధించిన చెక్కులను నిలిపివేశామని తహసీల్దార్ నాగభవాని మంగళవారం తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అక్రమార్కులను శిక్షించాలని స్థానికులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment