
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల నీటి లెక్కలపై ఇంకా స్పష్టత రావడం లేదు. జూన్ నుంచి వాటర్ ఇయర్ మొదలయ్యేందుకు మరో 20 రోజుల గడువే ఉన్నా కృష్ణా జలాల పంపిణీపై ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కృష్ణాలో ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న తాత్కాలిక ఒప్పందాలను సవరించాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కృష్ణా జలాల నీటి వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎడతెగని వివాదాల నేపథ్యంలో.. 2015లో జూన్ 21, 22న ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశమైన కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున పంపిణీ చేస్తూ తాత్కాలిక కేటాయింపు చేశారు. దీనికి మొదట ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరినా మరుసటి ఏడాది నుంచే ఇరు రాష్ట్రాలు దీనిపై అభ్యంతరాలు తెలిపాయి.
తెలంగాణకు మళ్లీ అన్యాయం..
పట్టిసీమ ద్వారా తరలిస్తున్న నీటి వాటాలో తమకు న్యాయంగా దక్కే 45 టీఎంసీలు పెంచి తమ కోటా 299 టీఎంసీలకు జత చేయాలని తెలంగాణ కోరుతోంది. అయితే దీనిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. దీనికి తోడు పోలవరం ద్వారా ఎగువన రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలను ఇప్పటికే కర్ణాటక వినియోగిస్తున్నందున తమకు వాటా పెంచాలని కోరుతున్నా అదీ పెండింగ్‌లోనే ఉంది. దీంతో కృష్ణా నదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణకు మళ్లీ అన్యాయం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై తెలంగాణ ఏ మేరకు ఒత్తిడి తెస్తుందన్నది కీలకంగా మారింది.
తేలని టెలీమెట్రీ ఏర్పాటు..
ఇక నీటి లెక్కలు పక్కాగా ఉండేందుకు సాగర్, శ్రీశైలం పరిధిలో గుర్తించిన ప్రాంతాల్లో టెలీమెట్రీ వ్యవస్థ ఏర్పాటు ఇంత వరకు జరగలేదు. తొలి విడతలో 18 చోట్ల ఏర్పాటుకు రెండేళ్ల కింద స్పష్టత వచ్చినా వాటిని అమల్లోకి తేలేదు. ఇక రెండో విడతలో మరో 29 చోట్ల కృష్ణా బోర్డు ప్రతిపాదించగా, ఇరు రాష్ట్రాల నుంచి అనేక అభ్యంతరాలున్నాయి. దీంతో వీటి ఏర్పాటు 20 రోజుల వ్యవధిలో పూర్తయ్యేలా కనిపించడం లేదు. కృష్ణాబోర్డు చైర్మన్‌గా ఉన్న వైకే శర్మ 4 రోజుల కిందటే బదిలీ కావడంతో ఆయన స్థానంలో కొత్త చైర్మన్ వచ్చే వరకు టెలిమెట్రీ ఏర్పాటుపై స్పష్టత తేవడం సాధ్యమ్యేది కాదని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment