గాలేరు నగరి–హంద్రీనీవా అనుసంధానం
రూ.4,373.23 కోట్లతో పథకం నిర్మాణ పనులు
20 టీఎంసీల కృష్ణా జలాల సద్వినియోగం
కొత్తగా 2 రిజర్వాయర్ల పనులు పూర్తి
2,48,150 ఎకరాలకు సాగుకు నీరు
బి.కొత్తకోట : ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతం, ప్రస్తుత అన్నమయ్య జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టుల అనుసంధాన ప నులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పథకం ద్వారా జిల్లాకు 20 టీఎంసీల కృష్ణా నీరు సద్వినియోగం చేసుకోవాలన్నదే లక్ష్యం.
2021 జూలై, 4న ములకలచెరువు మండ లం నాయనచెరువుపల్లె వద్ద పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.5,030 కోట్లు మంజూరు చేయగా, రూ.4,373.23 కోట్లకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. ఈ అనుసంధాన పనులు పూర్తయితే హంద్రీనీవా ప్రాజెక్టు ఉప కాలువలు, ప్రధాన కాలువ, ప్రధాన రిజర్వాయర్లకు కృష్ణా జలాలు పుష్కలంగా చేరుతాయి. జీఎన్‌ఎస్‌ఎస్–హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎత్తిపోతల పథకంగా పిలవబడే ఈ పథకం ద్వారా గండికోట రిజర్వాయర్ నుంచి 13 టీఎంసీలు ప్రస్తుత అన్నమయ్య జిల్లాకు వినియోగించుకుంటారు.
రూ.1,100 కోట్లతో పనులు పూర్తి
20 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకునే లక్ష్యంతో రూపొందిన ఈ పథకం ద్వారా రెండు ప్రాజెక్టుల అనుసంధానం జరుగుతోంది. పది చోట్ల ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తారు. వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్ నుంచి గాలేరు–నగరి ప్రాజెక్టు ప్రధాన కాలువ కిలోమీటర్ 56.000 వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి 2 వేల క్యూసెక్కుల నీటిని కాలేటి వాగు రిజర్వాయర్‌కు తరలిస్తారు. ఇక్కడ నుంచి కల్లూరుపల్లె రిజర్వాయర్‌కు, ఇక్కడి నుంచి 1,550 క్యూసెక్కుల నీటిని వెలిగల్లు రిజర్వాయర్‌కు తరలిస్తారు. తర్వాత తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలంలోని హంద్రీనీవా ప్రధాన కాలువ కిలోమీటర్ 483.750లోకి 750 క్యూసెక్కులు తరలిస్తారు. వెలిగల్లు రిజర్వాయర్ నుంచి తంబళ్లపల్లె సమీపంలోని పెద్దేరు ప్రాజెక్టులోకి 800 క్యూసెక్కులు, అక్కడి నుంచి నాయునిచెరువుకు 800 క్యూసెక్కులు, నాయనిచెరువుపల్లె ఎత్తిపోతల పథకం నుంచి హంద్రీనీవా పుంగనూరు ఉపకాలువ కిలోమీటర్ 79.600 వద్ద నీటిని మళ్లిస్తారు. మొత్తం 10చోట్ల ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తారు.
55 కిమీ పైప్‌లైన్ పూర్తి
అనుసంధాన పనుల్లో భాగంగా 153 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులు జరగాల్సి ఉండగా 55 కిలోమీటర్ల పనులు పూర్తి చేశారు. కాలువ పనులు 5.313 కిలోమీటర్లు పూర్తయ్యింది. 10 చోట్ల ఎత్తిపోతల పథకాల పనులు చేపట్టగా అందులో ఒక పథకం పూర్తి కావొస్తోంది. చక్రాయపేట మండలం గండి వద్ద 5 కిలోమీటర్ల సొరంగం పనులు చేయాల్సి ఉంది. వెలిగల్లు ప్రాజెక్టులోకి నీటిని తరలించే కాలేటివాగు రిజర్వాయర్ పనులు పూర్తయ్యాయి. కొత్తగా నిర్మించిన కల్లూరివారిపల్లె రిజర్వాయర్ పూర్తయ్యింది.
120 రోజులూ నీటి తరలింపు
పథకం ద్వారా మొత్తం 20 టీఎంసీల నీటిని 120 రోజుల్లో తరలించుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో 13 టీఎంసీలు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు దక్కుతాయి. పుంగనూరు ఉప కాలువకు 800 క్యూసెక్కులు తరలిస్తే 120 రోజుల్లో 13 టీఎంసీల నీరు తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు చేరుతుంది. 750 క్యూసెక్కులతో ప్రధాన కాలువకు 5 టీఎంసీల నీరు చేరుతుంది. ఈ పథకంతో పశ్చిమ మండలాల్లో 2,48,150 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రజలకు తాగునీటి కష్టాలు తీరుతాయి, భూగర్బజలాలు వృద్ది చెందుతాయి.
కృష్ణా జలాలతో చెరువులు నింపుతాం
ప్రాజెక్టుల అనుసంధాన పనులు పూర్తవగానే తంబళ్లపల్లె నియోజకవర్గంలోని చెరువులకు కృష్ణా జలాలను తర లిస్తాం. ముదివేడు రిజర్వాయర్ నుంచి కురబలకోట, బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం మండలాల్లోని చెరువులకు నీటిని అందించే ప్రణాళిక ఉంది. మిగతా మండలాలకు ఉపకాలువ ద్వారా నీటి తరలింపుపై అధ్యయనం చేయాల్సి ఉంది. కరువు రైతులకు శాశ్వతంగా సాగునీటి కష్టాలు తీరుతాయి.
– పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే
ప్రాజెక్టు పూర్తికి సీఎం సహకారం
ప్రాజెక్టుల అనుసంధా నం పనులు సత్వరమే పూర్తయ్యేలా కృషి చేస్తున్నాం. ఎంపీలు అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలతో సమీక్షిస్తున్నాం.వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టుకు నిధుల ఇబ్బంది లేకుండా సహకారం అందిస్తున్నారు. పనులు పూర్తయ్యాక రాయచోటి నియోజకవర్గానికి తాగునీటి సమస్య పూర్తిగా తీరుతుంది. సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టుతో అన్నమయ్యజిల్లా మొత్తం సస్యశ్యామలం ఆవుతుంది.
– గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment