
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల నిర్వహణలో కీలక పాత్ర పోషించే పహాణీని కుదించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. పహాణీలో ఇప్పటివరకు రాస్తున్న వాటిలో ఉపయోగం లేని కాలమ్‌లను తొలగించి ప్రత్యేక ఫార్మాట్‌ను తయారు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెవెన్యూ యంత్రాంగం దీనిపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు 31 కాలమ్‌లుగా ఉన్న పహాణీలను 14–15 కాలమ్‌లకు తగ్గించే కోణంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం వచ్చిన వివరాలను పాత ఫార్మాట్‌లోనే పహాణీలు చేస్తున్నా.... భవిష్యత్తు భూ రికార్డుల నిర్వహణ కోసం ఉపయోగించేందుకు ధరణి వెబ్‌సైట్‌లో కొత్త పహాణీ కోసం ప్రత్యేక డిజైన్ చేయాలని నిర్ణయించారు.
ఆ 15 అప్‌డేట్ కావడం లేదు...
ప్రస్తుతం పహాణీలో 31 కాలమ్‌లున్నా పంటల సాగు వివరాలతో కూడిన 15 కాలమ్‌లను కొంతకాలంగా అప్‌డేట్ చేయడం లేదు. దీంతో మిగిలిన 16 కాలమ్‌లలోనే పహాణీలోని వివరాలను పొందుపరుస్తున్నారు. అయితే ఆ 16 కాలమ్‌లలో కూడా కొన్ని కాలమ్‌లు ఉపయోగం లేదనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ భూములకు శిస్తు ఎప్పుడో రద్దయినా అందుకు సంబంధించిన కాలమ్ కొనసాగుతోంది. దీంతోపాటు పొజిషన్ (కబ్జా) కాలమ్, జలాధారం లాంటి కాలమ్‌లను తొలగించాలనే అభిప్రాయం రెవెన్యూ వర్గా ల్లో వ్యక్తమవుతోంది.
టైటిల్, సీరియల్ నంబర్, సర్వే నంబర్, సబ్ డివిజన్, అనుభవదారుని పేరు తదితర వివరాలుంటే సరిపోతుందని, వాటికితోడు ఆ సర్వే నంబర్‌లోని ఎంత భూమిలో ఏ పంట సాగుచేశారనే వివరాలను కూడా నమోదు చేస్తే సరిపోతుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అందరికీ అర్థమయ్యేలా పహాణీని తయారు చేయడం ద్వారా పారదర్శక విధానాన్ని అందుబాటులోకి తేవాలని రెవెన్యూ వర్గాలంటున్నాయి. సీఎం కేసీఆర్ కూడా పహాణీలోని కాలమ్‌ల కుదింపు, మార్పులకు అంగీకారం తెలపడంతో కొత్త పహాణీ రూపకల్పనకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
ప్రస్తుతానికి భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం వచ్చిన వివరాలను మాత్రం పాత ఫార్మాట్‌లోని పహాణీలోనే మాన్యువల్‌గా రాస్తున్నారు. అయితే దీనిని కంప్యూటరీకరించి «వ్యవసాయ భూముల రికార్డుల నిర్వహణకుగాను తయారు చేసే ‘ధరణి’వెబ్‌సైట్‌లో నమోదు చేసే సమయంలో కొత్త పహాణీ ఆధారంగా చేస్తామని, ఇందుకోసం ప్రత్యేకంగా పహాణీని డిజైన్ చేస్తున్నామని రెవెన్యూశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment