సాగు నీరు.. నిధుల జోరు | TS Government Allocating Major Budget To Kaleshwaram project | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 20 2018 12:50 AM | Last Updated on Thu, Dec 20 2018 11:26 AM

TS Government Allocating Major Budget To Kaleshwaram project - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించే క్రమంలో భాగంగా వచ్చే బడ్జెట్‌లోనూ భారీగా నిధులు పారించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రెండున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరు అందించాలన్నదే తమ ముందున్న ప్రధాన లక్ష్యమంటున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అందుకు తగ్గ్గట్టే నిధుల కేటాయింపు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గడిచిన రెండు, మూడు బడ్జెట్‌ల్లో కేటాయించిన మాదిరే ఈసారి కూడా రూ.25 వేల కోట్లకు తగ్గకుండా కేటాయింపులు చేసి సాగునీటికి అగ్రపీఠం కట్టబెట్టాలని, అందుకు తగ్గట్లే పనులు చేయించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా రూ.26,452 కోట్లతో ఇప్పటికే ప్రాథమిక బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిని ప్రభుత్వ పరిశీలనకు పంపిన అనంతరం రూ.25 వేల కోట్లకు సర్దుబాటు చేసే అవకాశాలున్నాయని నీటి పారుదల వర్గాలు తెలిపాయి.  

రుణాలతో గట్టెక్కారు... 
2018–19 ఆర్థిక ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రూ.25వేల కోట్లు కేటాయించారు. ఇందులో ఇప్పటికే రూ.18,450 కోట్ల మేర ఖర్చు చేశారు. మరో రూ.5,535 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా సుమారు రూ.24 కోట్ల మేర పనులు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఎక్కువగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌ ద్వారా రూ.10,476 కోట్ల రుణాలు తీసుకొని బిల్లులు చెల్లించారు. ఇక సీతారామ, దేవాదుల, ఎఫ్‌ఎఫ్‌సీ, ఎస్సారెస్పీ–2లను కలిపి ఏర్పాటు చేసిన మరో కార్పొరేషన్‌ ద్వారా రూ.2,439 కోట్ల రుణాలు తీసుకున్నారు. మొత్తంగా సుమారు రూ.13 వేల కోట్లు రుణాల ద్వారా సేకరించగా, రాష్ట్ర ప్రభుత్వం తన పద్దు నుంచి కేవలం రూ.5,535కోట్లు కేటాయించింది. మొత్తంగా రుణాల ద్వారానే ఈ ఏడాది బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులన్నీ గట్టెక్కాయి. 

మొదటి ప్రాధాన్యత కాళేశ్వరానికే... 
సీఎం ఆలోచనలకు తగినట్లుగా ప్రస్తుత బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొత్తంగా రూ.26,452 కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఇందులో మళ్లీ తొలి ప్రాధాన్యం కాళేశ్వరం ప్రాజెక్టుకే దక్కనుంది. ప్రాజెక్టుకు గత ఏడాది రూ.6,157 కోట్ల మేర నిధులు కేటాయించారు. అందుకు తగ్గట్లే పనులు జరుగుతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఖరీఫ్‌ నాటికి నీళ్లందించాలని సీఎం లక్ష్యంగా నిర్ణయించారు. ఆ మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌజ్‌లతో పాటు ఎల్లంపల్లి దిగువన మల్లన్నసాగర్‌ వరకు ఉన్న అన్ని బ్యారేజీల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీని కోసం వచ్చే బడ్జెట్‌లో ఏకంగా రూ. 9,205 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తర్వాతి స్థానంలో పాలమూరు–రంగారెడ్డికి రూ.3,214 కోట్లు కేటాయించాలని కోరారు. దేవాదుల పరిధిలో లింగంపల్లి బ్యారేజీతో పాటు ఇతర పైప్‌లైన్‌ల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నందున ఇక్కడ రూ.2,052 కోట్లు, ఖమ్మం జిల్లాలోని సీతారామ సహా ఇతర చిన్న తరహా ప్రాజెక్టులకు కలిపి రూ.1,346 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటితో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా వంటి ప్రాజెక్టులను వంద శాతం పూర్తి చేసేందుకు రూ.1,346 కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు. ఇక మైనర్‌ ఇరిగేషన్‌ కింద చిన్న నీటి వనరుల అభివృద్ధి, మిషన్‌ కాకతీయకు రూ.2,727 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి.  

సీతారామ, పాలమూరుపై ఫోకస్‌.. 
ఇక కొత్త ఏడాదిలో జనవరి నుంచి పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఏడాదిన్నరలో ఈ ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టిన ముఖ్యమంత్రి అందుకు తగ్గట్టే ఆర్థిక వనరులను సమకూర్చేలా ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రాజెక్టు పరిధిలో ఈ ఏడాది మార్చి నుంచి సుమారు రూ.1,500 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దృష్ట్యా నిధుల కొరత లేకుండా పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.17వేల కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు నిర్ణయం జరగ్గా, చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ చర్చలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి ఏప్రిల్‌ నుంచి పనులను వేగిరం చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. ఇక సీతారామ ఎత్తిపోతలకు రుణాల ప్రక్రియ కొలిక్కి వచ్చినందున ప్రాజెక్టును వేగిరం చేసే దిశగా కేసీఆర్‌ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరికొన్ని రోజుల్లో స్వయంగా ప్రాజెక్టు పరిధిలో పర్యటించనున్నారు.  
ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో ప్రతిపాదనలు ఇలా..(రూ.కోట్లలో) 
ప్రాజెక్టు                           బడ్జెట్‌ ప్రతిపాదన 
కాళేశ్వరం                            9,205 
పాలమూరు–రంగారెడ్డి            3,214 
కంతనపల్లి                             845 
ఖమ్మం జిల్లా ప్రాజెక్టులు          1,346 
ఆదిలాబాద్‌ ప్రాజెక్టులు              922 
వరద కాల్వ, ఎల్లంపల్లి             1,121 
దేవాదుల                            2,052 
నల్లగొండ ప్రాజెక్టులు              1,621 
ఎస్సారెస్పీ                            338 
మైనర్‌ ఇరిగేషన్‌                   2,727

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement