ఓసారి భూ.. రికార్డులు తిరగేస్తే..  | Updating Land Records By Telangana Government | Sakshi
Sakshi News home page

ఓసారి భూ.. రికార్డులు తిరగేస్తే.. 

Published Wed, May 9 2018 3:07 AM | Last Updated on Wed, May 9 2018 3:13 AM

Updating Land Records By Telangana Government - Sakshi

నిజాం కాలంలో భూ రికార్డు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో భూ రికార్డుల నవీకరణను ప్రభుత్వం చేపడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ సంస్థానంలో రెవెన్యూ శాఖ ఏర్పాటు ఎలా జరిగింది ? నిజాం కాలం నాటి భూ రికార్డులు నేటికీ  ఎలా ఆధారమయ్యాయి? అప్పటి భూముల స్థితిగతులు, రికార్డులు, పన్ను వసూలు ఎలా ఉండేవి తదితర వివరాలను ఓ సారి చూద్దామా..  

సాలార్‌ జంగ్‌ హయాంలో రెవెన్యూ వ్యవస్థ .. 
ప్రధానమంత్రి సాలార్‌ జంగ్‌ నేతృత్వంలో రెవెన్యూ బోర్డును 1864లో ఏర్పాటు చేశారు. అప్పటికే దే«శవ్యాప్తంగా షేర్‌షా సూరి ఏర్పాటు చేసిన రెవెన్యూ వ్యవస్థ కొనసాగేది. నిజాం పాలనలో ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు వసూలు. అప్పటికే భూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీంతో తొలిసారి 1864– 1880 మధ్య కాలంలో భూములను గొలుసుల ద్వారా కొలిచి గుంటలుగా లెక్కగట్టి ఎకరాలుగా నిర్ధారణ చేశారు. ఇలా భూముల సర్వే, భూ రికార్డుల పునర్‌వ్యవస్థీకరణ, రెవెన్యూ రికార్డుల క్రమబద్ధీకరణ జరిగింది. 

హైదరాబాద్‌ స్టేట్‌లో తొలి భూముల సర్వే
1940–1950 మధ్య కాలంలో మహారాష్ట్ర బ్రాహ్మణులతో ప్రతి గ్రామంలో రైత్వారీ పట్టా భూములు, ప్రభుత్వ భూముల సర్వేను నిర్వహించారు. ఈ సర్వేలో భూముల కొలతలు, హద్దులు, యాజమాన్యపు హక్కులు సరిచేసి వసూల్‌ బాకీ, సేత్‌వార్‌ రికార్డులను తయారు చేశారు. ఈ రికార్డుల్లో సర్వే నంబర్‌ విస్తీర్ణం, పట్టాదారుడి వివరాలు, యోగ్యమైన భూమి... పూట్‌ కరాబ్‌ (వ్యవసాయానికి పనికిరాని భూమి), ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల వివరాలు నమోదు చేశారు.

వసూలు బాకీ రికార్డు

పాత సర్వే నంబర్, పాత విస్తీర్ణం, కొత్త సర్వే నంబర్, కొత్త విస్తీర్ణం నమోదు చేసి దీని ఆధారంగా వసూలు బాకీ రికార్డులు రూపొందించారు. సర్వే నంబర్‌ వారీగా నిర్ణీత విస్తీర్ణంతో హద్దు రాళ్లు పాతి, టిప్పన్‌ ఆధారంగా సేత్‌వార్‌ రికార్డు తయారు చేశారు. వసూల్‌ బాకీ, సేత్‌వార్‌ ఆధారంగా 1953–56 వరకు మూడేళ్లకు ఒకే కాస్రా పహాణీ రాశారు.

భూ రికార్డుల ప్రక్షాళన ఎందుకంటే... 
62 ఏళ్లుగా రెవెన్యూ రికార్డుల్లో ఎన్నో మార్పులు జరిగాయి. (ఉదాహరణకు పట్టాదారు చనిపోవడం, భూముల క్రయ విక్రయాలు, వంశపారంపర్యంగా వారసుల పేర మార్పిడి). సేత్‌వార్‌ ప్రకారం సర్వే నంబర్‌ నిర్ణీత విస్తీర్ణంలో మార్పులు చేర్పులు, పట్టాదారుల, కబ్జాదారుల పేర్లు, యాజమాన్యపు ఆధారాలు, సంబంధం లేని వ్యక్తుల పేర్లు పహాణీలోని తప్పుగా నమోదు చేయడంతో రికార్డుల ప్రక్షాళన అనివార్యమైంది.

కాస్రా పహాణీ రికార్డు

రైతులకు రుణాలు, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం విషయంలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. గతంలో ఉన్న రికార్డుల ఆధారంగానే భూముల దగ్గరకు వెళ్లి సేత్‌వార్‌ ప్రకారం సర్వే నంబర్‌ విస్తీర్ణం ఉందా లేదా చూసి, ఆ భూమి పట్టాదారుడు, అనుభవదారుడు పేరిట సరికొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ చేస్తున్నారు. 

మారిన భూమి శిస్తు వసూలు విధానం 
గతంలో ప్రతి వ్యవసాయ భూమికి నీటి వనరుల పారకం ఆధారంగా శిస్తులు జమాబందీలో నిర్ణయించి వసూలు చేసేవారు. దీనికి అదనంగా మెట్ట పంటలకు లోకల్‌ సెస్‌ పేరుతో శిస్తు ఉండేది. ప్రస్తుత విధానంలో ప్రభుత్వ నీటి వనరుల ద్వారా పారకం ఉన్న మాగాణి, మెట్ట భూములకు నీటి పన్ను మాత్రమే వసూలు చేస్తున్నారు. పాత భూమి శిస్తు విధానంలో పహాణీలో పట్టాదారు, కబ్జాదారుడి వివరాలు సరిగా నమోదయ్యేవి. ప్రస్తుత విధానంలో కేవలం నీటి పన్ను (వాటర్‌ సెస్‌ ) చెల్లించే వారి పేర్లు మాత్రమే నమోదు చేస్తున్నారు. ఇతర వ్యవసాయ భూముల పట్టాదారు, కబ్జాదారు, ఇతర వనరులతో సేద్యం చేసిన భూముల వివరాలు పహాణీల్లో సరిగా నమోదు కావడం లేదు. 

రాగితో తయారు చేసిన భూ రికార్డు

రెవెన్యూ సంవత్సరం ఎప్పటి నుంచి అంటే....  
ఇప్పటికీ ఫసలీ సంవత్సరం ప్రకారం జూన్‌ మొదటి తేదీ నుంచి మే చివరి తేదీ వరకు రెవెన్యూ వ్యవస్థ కొనసాగుతోంది. వర్షాకాలం మొదటి పంట(ఆది) జూన్‌ నుంచి నవంబర్‌ వరకు, రెండో పంట (తాబి) డిసెంబర్‌ నుంచి మే వరకు. దీని ఆధారంగానే నేటికీ భూమి శిస్తులు వసూలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement