
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు కనీస సర్వీసు వ్యవధిని ప్రభుత్వం మూడేళ్ల నుంచి రెండేళ్లకు తాత్కాలికంగా కుదించింది. ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సంతకం చేశారు. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక కేటగిరీ/ క్లాస్/ గ్రేడ్ నుంచి మరో కేటగిరీ/ క్లాస్/ గ్రేడ్‌కు పదోన్నతి, లేదా పదోన్నతి ద్వారా బదిలీ కోసం కనీసం 2 ఏళ్ల సర్వీసు వ్యవధి ఉండాలనే తాత్కాలిక నిబంధన(అడ్‌హక్ రూల్)ను అమల్లోకి తెస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
2020–21 ప్యానెల్ సంవత్సరం ముగిసే వరకు అనగా.. 2021, ఆగస్టు 31 వరకు ఈ తాత్కాలిక నిబంధన అమల్లో ఉంటుందని తెలిపారు. అర్హులైన వ్యక్తులు లేక చాలా వరకు ఖాళీగా ఉన్న పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయలేకపోతున్నామని, అందుకే కనీస సర్వీసు వ్యవధిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.
త్వరగా నివేదిక ఇవ్వండి..
ఉద్యోగుల వేతన సవరణ నివేదిక(పీఆర్సీ)పై అధ్యయనం, ఉద్యోగ సంఘాలతో చర్చల ప్రక్రియలను సత్వరంగా పూర్తి చేసి తనకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. టీఎన్జీవోల సంఘంఅధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, త్రిసభ్య కమిటీ సమక్షంలో సోమవారం ఆయన ప్రగతిభవన్‌లో పదోన్నతులకు కనీస సర్వీసు వ్యవధిని రెండేళ్లకు కుదిస్తూ సంబంధిత ఫైల్‌పై సంతకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన సీఎస్ సోమేశ్‌కుమార్‌కు పలు సూచనలు చేశారు. ఈ నెల మూడో వారంలో వేతన సవరణ, పదవీ విరమణ వయస్సు పెంపుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ దగ్గర పడిందని, వీటిపై నివేదిక ఇవ్వాలని కోరారు. నివేదిక వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటానని సీఎం పేర్కొన్నారు.