సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో ఐపీఎస్ అధికారుల పరిస్థితి విచిత్రంగా తయారైంది. పదోన్నతి లభించినా పాత పోస్టులోనే ఏళ్ల తరబడి కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంది. బదిలీపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు ప్రతిపాదనలు వెళ్లినా అటకెక్కడం తప్ప పోస్టింగ్‌లపై ఆదేశాలు వచ్చిన దాఖాలాలు లేవు. ఇటీవల కొందరు ఐపీఎస్‌ల బదిలీ జరిగినా ఇంకా చాలామేరకు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో నాలుగేళ్లుగా ఒకే పోస్టులో ఉన్న ఐపీఎస్‌లు తలలు పట్టుకుంటున్నారు.
పరిస్థితి మారదా?
►సీఐడీ చీఫ్‌గా ఉన్న గోవింద్‌సింగ్ అదనపు డీజీపీగా పదోన్నతి పొందినా నాలుగున్నరేళ్లుగా ఇదేపోస్టులో ఉన్నారు. కొద్ది రోజులపాటు ఏసీబీ, విజిలెన్స్ ఇన్‌చార్జి డీజీగా బాధ్యతలు నిర్వర్తించారు.
►శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా జితేందర్ సైతం నాలుగేళ్లుగా అదే పోస్టింగ్‌లో కొనసాగుతున్నారు. అదనంగా జైళ్ల శాఖను పర్యవేక్షిస్తున్నారు.
►ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఐజీ ర్యాంకు నుంచి పోలీస్ శాఖలోని పర్సనల్ విభాగానికి బదిలీపై వచ్చిన శివధర్‌రెడ్డి నాలుగున్నరేళ్లుగా అదేపోస్టులో ఉన్నారు. అదనపు డీజీపీగా పదోన్నతి వచ్చినా పాత స్థానంలోనే కొనసాగుతున్నారు.
►ప్రొవిజినల్, లాజిస్టిక్ ఐజీగా నాలుగేళ్ల క్రితం వచ్చిన సంజయ్‌కుమార్ జైన్ ఇటీ వల అదనపు డీజీపీగా పదోన్నతి పొం దిన ఇంకా అక్కడే కొనసాగిల్సిన పరిస్థితి ఏర్పడింది. అగ్నిమాపకశాఖతోపాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
►అపరేషన్స్ విభాగాలుగా ఉన్న గ్రేహౌం డ్స్, ఆక్టోపస్ యూనిట్లకు అదనపు డీజీపీగా శ్రీనివాస్‌రెడ్డి ఐదేళ్లకుపైగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఐజీగా బదిలీపై వెళ్లిన ఆయన అదనపు డీజీపీగా పదోన్నతి పొంది రెండేళ్లు దాటినా ఇంకా పాత స్థానంలోనే కొనసాగాల్సి వస్తోంది.
►సీనియర్ ఐపీఎస్ రవిగుప్తా, పోలీస్ టెక్నాలజీ, కంప్యూటర్ సర్వీసెస్ అదన పు డీజీపీతోపాటు హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీపై వెళ్లి మూడున్నరేళ్లు కావస్తోంది. డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందినా బదిలీకి నోచుకోలేదు.
►పోలీస్ ఆర్గనైజేషన్ అదనపు డీజీపీగా సీనియర్ ఐపీఎస్ రాజీవ్ రతన్ మూడున్నరేళ్లుగా అక్కడే విధులు నిర్వర్తిసున్నారు.
►రోడ్ సేఫ్టీ అదనపు డీజీపీ సందీప్ శాండిల్యా దాదాపు నాలుగేళ్లుగా అదే పోస్టులో కాలం వెళ్లదీస్తున్నారు.
►రాచకొండ కమిషనర్‌గా మహేష్ భగవత్ దాదాపు నాలుగున్నరేళ్లుగా అక్కడే ఐజీగా, ప్రస్తుతం అదనపు డీజీపీగా కొనసాగుతున్నారు.
►హైదరాబాద్ కమిషనరేట్‌లో అదనపు సీపీగా ఉన్న దేవేంద్రసింగ్ చౌహాన్ మూడున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల పదోన్నతి పొందినా అక్కడే తిరిగి విధులు నిర్వర్తిస్తున్నారు.
►నార్త్‌జోన్ (వరంగల్) ఐజీగా వై. నాగిరెడ్డి మూడున్నరేళ్లుగా అక్కడే కొనసాగుతుం డగా స్టీఫెన్ రవీంధ్ర బదిలీతో వెస్ట్‌జోన్ (హైదరాబాద్) ఐజీ బాధ్యతలు కూడా ఆయనే నిర్వర్తిసున్నారు. ఇటీవల అదన పు డీజీపీగా పదోన్నతి పొందినా ఐజీ ర్యాంకు పోస్టులోనే విధులు నిర్వర్తిస్తున్నారు.
►కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన సీనియర్ ఐపీఎస్, అదనపు డీజీపీ విజయ్‌కుమార్ ఇంకా వెయిటింగ్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజులపాటు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్‌గా నియమించినా మళ్లీ ఆయన్ను బదిలీ చేసి డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
►ఇంటెలిజెన్స్‌లో డీఐజీగా నాలుగేళ్లు, ప్రస్తుతం ఐజీగా పదోన్నతి పొందిన శివకుమార్ అక్కడే నాలుగున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. ఇదే విభాగంలో ఎస్పీ, డీఐజీగా, ఐజీగా రాజేష్‌కుమార్ విధులు నిర్వర్తిస్తున్నారు. దాదాపుగా ఐదున్నరేళ్లుగా ఆయన ఇక్కడే విధులు నిర్వర్తించడం గమనార్హం.
►వీబీ కమలాసన్‌రెడ్డి ఇటీవలే ఐజీగా పదోన్నతి పొందినా వెయిటింగ్‌లోనే ఉన్నారు. అంతకుముందు ఐదేళ్లపాటు కరీంనగర్ కమిషనర్‌గా పనిచేసి ఆయన రికార్డు సృష్టించారు.
►డీసీపీ (ఎస్పీ ర్యాంకు)లో నగర కమిషనరేట్‌లోని ఈస్ట్‌జోన్‌కు బదిలీపై వెళ్లిన ఎం రమేష్‌రెడ్డి, డీఐజీగా పదోన్నతి పొంది దాదాపు మూడున్నరేళ్లు కావస్తోంది. ఇంకా ఆయన డీసీపీ పోస్టులో జాయింట్ సీపీగా పనిచేస్తున్నారు.
►డీఐజీ రమేష్‌నాయుడు, ఎస్పీ నవీన్‌కుమార్ పోలీస్ అకాడమీలోనే కాలం వెళ్లదీస్తున్నారు. వాళ్లు బదిలీపై వెళ్లి దాదాపు నాలుగున్నరేళ్లు కావస్తోంది.
►ఎస్పీగా సీఐడీకి బదిలీ అయిన ఐపీఎస్ శ్రీనివాస్, డీఐ జీగా పదోన్నతి రెండేళ్లు అయినా ఇప్పటివరకు స్థానచలనం రాలేదు. అలాగే సీఐడీకి వచ్చి మూడేళ్లు కావస్తున్న ఐపీఎస్ పరిమళహనా నూతన్‌కు సైతం స్థానచలనం కలగలేదు. డీఐజీగా ఉన్న సుమతి మూడేళ్లుగా సీఐడీ నుంచి అటాచ్‌మెంట్‌లో ఉమెన్ సేఫ్టీ వింగ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.
►కొత్తగా ఐపీఎస్ కన్ఫర్డ్ పదోన్నతి పొందిన ఆరుగురు అధికారులు వెయిటింగ్‌లోనే ఉన్నారు. మరో ఐదుగురు సీనియర్ ఐపీఎస్‌లు సైతం నెలల తరబడి వెయిటింగ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment