
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం భవనాల కూల్చివేత పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. భవనాల కూల్చివేతకు సంబంధించి ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. పిటిషనర్ అభ్యంతరాలను ఆయన తరఫున లాయర్ చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలియజేశారు. నూతన సచివాలయ నిర్మాణంపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని.. సచివాలయం నిర్మాణం, భవనాల కూల్చివేతపై ఇప్పటికే కమిటీ వేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న సచివాలయంలో ఫైర్ సెఫ్టీ నిబంధనలు సరిగాలేవని, సరైన పార్కింగ్ సదుపాయం కూడా లేదని చెప్పారు. కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికను కోర్టు సమర్పించారు.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో కొనసాగిన సచివాలయ భవనాలను ఇప్పుడు ఎందుకు కూల్చివేస్తున్నారని పిటిషనర్ తరుఫున న్యాయవాది ప్రశ్నించారు. సచివాలయంలో సుమారు ఏడు ఏళ్ల కిందట నిర్మించిన భవనాలను కూడా కూల్చివేస్తున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. నూతన సచివాలయ నిర్మాణం వలన వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.