demolition of Secretariat
-
రేవంత్ పిటిషన్ అశోక్ భూషణ్ బెంచ్‌కు బదిలీ
ఢిల్లీ : తెలంగాణ సచివాలయం కూల్చివేత పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బాబ్డె నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. తెలంగాణ సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయం నిర్మాణం లో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయంటూ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పర్యావరణ అనుమతులు లేకుండా సచివాలయం కూల్చివేతను అర్దరాత్రి చేపట్టారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. కొత్త సచివాలయం కోసం కూల్చివేత చేపట్టారు కాబట్టి పర్యావరణ అనుమతులు అవసరం అని పిటిషన్లో తెలిపారు. తాజగా గురువారం కేసు విచారణ సందర్భంగా సచివాలయం నిర్మాణాల కూల్చివేత పూర్తయిందా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బాబ్డే ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు తీర్పులో అభ్యంతరం ఏముందని రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్‌ను ప్రశ్నించారు. (చదవండి : తెలంగాణ వర్షాలపై స్పందించిన యూవీ) దీనికి సమాధానంగా సచివాలయం కూల్చివేత అనేది నూతన సచివాలయం నిర్మాణానికి సన్నద్దం చేయడమా కాదా అన్నది తేల్చాల్సి ఉందని శ్రావణ్ కుమార్ వివరించారు. అయితే కేసు విచారణ యోగ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా అన్నారు. తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం చేసుకోవచ్చునని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఇప్పటికే తీర్పు ఇచ్చినందు వల్ల రేవంత్ రెడ్డి పిటిషన్ తిరస్కరించాలని తుషార్ మెహతా వెల్లడించారు. సచివాలయం అంశంపై గతంలో జస్టిస్ అశోక్ భూషణ్ బెంచ్ విచారణ జరపడంతో.. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను అదే బెంచ్ కు బదిలీ చేస్తామని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే ఈ ప్రతిపాదనను తుషార్ మెహతా వ్యతిరేకించారు. కేసు విచారణ యోగ్యమైనది కాదు కాబట్టి బదిలీ అవసరంలేదని వాదించారు. దీనికి అంగీకరించని చీఫ్ జస్టిస్ బెంచ్ రేవంత్ రెడ్డి కేసును జస్టిస్ అశోక్ భూషణ్ బెంచ్ కు బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. కేసు తదుపరి విచారణ అక్టోబర్ 26న జరిగే అవకాశం ఉంది. -
తెలుగు తల్లి ఫ్లైఓవర్ పునఃప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : సచివాలయ కూల్చివేతలో భాగంగా దాదాపు 40 రోజుల పాటు మూసివేసి ఉంచిన తెలుగుతల్లి, ఖైరతాబాద్ ప్లైఓవర్లపై మంగళవారం రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేటి నుంచి సింగిల్ వేలో వాహనదారులకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. జూలై 7న ప్రారంభమైన సచివాలయ కూల్చివేత 40 రోజుల పాటు జరిగింది. భవనాలు కూల్చివేసే సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతోనే ఫ్లై ఓవర్లతో పాటు పరిసర ప్రాంతాల రహదారులను మూసివేశామని అధికారులు పేర్కొన్నారు. అయితే సచివాలయ కూల్చివేతకు సంబంధించి మీడియాతో పాటు ఇతరులెవ్వరిని తెలంగాణ ప్రభుత్వం అనుమతించలేదు. సచివాలయ భవనం కింద గుప్త నిధులు ఉన్నాయని, అందుకే అనుమతి ఇవ్వలేదని కొందరు చేసిన ప్రచారం అలజడి రేపింది. ఇదే విషయమై ఒక మీడియా సంస్థ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టు కూడా ప్రభుత్వ తీరుపై అభ్యంతరాలు తెలపడంతో మీడియాను అనుమతిచ్చారు. -
95% నేలమట్టం
సాక్షి,హైదరాబాద్: సచివాలయ భవనాల కూల్చివేత దాదాపు 95 శాతం పూర్తి కావొచ్చింది. ఎల్ బ్లాక్‌లోని 50% మేర, జే బ్లాక్‌లోని 30% మేర మాత్రమే కూల్చి వేత మిగిలి ఉండడంతో త్వరలోనే పాత సెక్రటేరియట్ భవన సముదాయం కనుమరుగు కానుంది. ఎన్టీరామారావు, ఇతర సీఎంలు కార్యకలాపాలు నిర్వహించిన, హెరిటేజ్ భవనంగా పలువురు వాదిస్తూ వచ్చిన జీ బ్లాక్ పూర్తిగా నేలమట్టమై ఒక పెద్ద మట్టి దిబ్బగా మారింది. సెక్రటేరియట్ భవనాల కూల్చివేత మొదలుపెట్టాక సోమవారం తొలిసారిగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులను లోపలికి అనుమతించారు. ఐ అండ్ పీఆర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య మూడు మినీబస్సులు, ఒక డీసీఎం, ఒక ట్రాలీలో హైదరాబాద్‌లోని వివిధ ఎలక్ట్రానిక్ మీడియా వీడియోగ్రాఫర్లు, రిపోర్టర్లు, ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్లు, రిపోర్టర్లను సచివాలయంలోకి తీసుకెళ్లారు. సెక్రటేరియట్ మెయిన్ గేటు నుంచి ఇప్పటికే కూల్చేసిన పాత డీ బ్లాక్ భవనసముదాయం ఎదుటవరకు తీసుకెళ్లారు. ఈ వాహనాల్లోని పోలీసు అధికారులు విలేకరులను బయటకు దిగనివ్వలేదు. టీవీ కెమెరామెన్లు వాహనాల నుంచే విజువల్స్ తీసుకున్నారు. చివర్లో వెనక్కువచ్చే ముందు ఓ పది నిముషాలు మాత్రం కూల్చివేసిన డి బ్లాక్ శిథిలాలు, వ్యర్థాల తరలింపు ప్రక్రియ విజువల్స్, ఫోటోలు తీసుకునేందుకు పోలీసులు అనుమతించారు. కూల్చివేత వివరాలు వెల్లడించేందుకు అధికారులెవరూ లేకపోవడం గమనార్హం. మీడియాను అనుమతించాలనే హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం 4 గంటలకు లిబర్టీ సమీపంలోని జీహేచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట నుంచి వివిధ వాహనాల్లో జర్నలిస్టులను గుంపులుగా నింపి నెమ్మదిగా సెక్రటేరియట్ వైపు తీసుకెళ్లారు. సెక్రటేరియట్ మెయిన్ గేట్ వద్ద కొంతసేపు వేచిచూశాక గేట్లు తెరిచి లోపలికి అనుమతించినా, ఎవ్వరినీ వాహనాలు దిగనివ్వలేదు. అడుగుఅడుగునా పోలీసు కాపలా కనిపించింది, రోప్‌పార్టీ పోలీసులు తాడు పట్టుకుని ఎవరినీ ఎటూ వెళ్లనివ్వలేదు. వాహనాల్లోంచే వీడియోలు, ఫోటోలు తీసుకునేలా చేశారు. అసలు ఎక్కడ ఏ భవనముందో గుర్తు పట్టేందుకు, అంచనా వేసేందుకు పలువురు ఇబ్బందిపడ్డారు. చురుకుగా సాగుతున్న పనులు... భవనాల కూల్చివేత, దాని నుంచి వచ్చే శిథిలాల తొలగింపు, పిల్లర్లు, శ్లాబులు, ప్లింథ్ బీమ్ల్లోని స్టీల్, ఇనుప రాడ్లు, కడ్డీలు అక్కడక్కడ కుప్పగా పోసి ఉండడం కనిపించింది. గతంలో డి బ్లాక్ ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం జేసీబీలు, ఇతర యంత్రాలతో శిథిలాల తొలగింపు, పెద్దసంఖ్యలో గ్యాస్ కట్టర్లు ఉపయోగించి ఇనుప చువ్వల కటింగ్ వంటివి చురుకుగా సాగుతున్నాయి. గతంలో సీఎం కార్యాలయం ‘సీ’బ్లాక్ ఎదుట ఏర్పాటు చేసిన సెక్రటేరియట్ మీడియా పాయింట్ మాత్రం ఇంకా కూల్చివేతకు గురికాలేదు. 2014 తర్వాత తెలంగాణ సచివాలయం ప్రవేశద్వారం వద్ద నిర్మించిన పోలీస్ ఎంట్రన్స్ చెకింగ్ పాయింట్ ఇంకా కొనసాగుతోంది.ఇప్పటికే ఏ, బీ, సీ, డీ ఇతర బ్లాక్ల్లోని భవనాలు పూర్తిగా కూల్చివేశారు. గతంలోని మందిరం, మసీదుల ఆనవాళ్లు కూడా కనిపించలేదు. సామాజిక దూరం లేదు.. మీడియా ప్రతినిధులను తీసుకెళ్లిన ఈ వాహనాల్లో ఎక్కడా కూడా కోవిడ్ ప్రోటోకాల్‌లో పాటించే జాగ్రత్తలేవి పాటించలేదు. వాహనాల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను కుక్కినట్టుగా సచివాలయ సందర్శనకు తీసుకెళ్లారు. వ్యక్తుల మధ్య దూరం కూడా అస్సలు పాటించలేదు. కవరేజీ కోసం ఒకరిపై ఒకరు పడుతూ పోటీపడ్డారు. 2 వేల ట్రిప్పులతో వ్యర్థాల ఎత్తివేత తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం పాత భవనాల కూల్చివేత, శిథిలాల తొలగింపు చేపట్టినట్టు, ఇప్పటికే దాదాపు 90 శాతం కూల్చివేత పనులు పూర్తయినట్లు సీఎంవో ఒక నోట్‌ను విడుదల చేసింది. శిథిలాలు (వ్యర్థాలు) మొత్తం దాదాపు 4,500 లారీల లోడు ఉంటుందని అంచనా. ఇందులో ఇప్పటికే 2 వేల ట్రిప్పులు ఎత్తివేసినట్టు, మిగతా పనులు జరుగుతున్నట్టు పేర్కొంది. ‘ఎత్తైన భవనాలు కూల్చివేసే సందర్భంలో ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించలేదు. అందులో భాగంగా మీడియాను కూడా అనుమతించలేదు. కూల్చివేత వార్తలు సేకరించడానికి అనుమతి ఇవ్వాలని మీడియా ప్రతినిధుల నుంచి పదే పదే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ విజ్ఞప్తిని పరిశీలించి, కూల్చివేత పనులకు, వ్యర్థాల తొలగింపు పనులకు సంబంధించిన వార్తల సేకరణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు’రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి తెలిపారు. -
సచివాలయం కూల్చివేత
-
సచివాలయం కూల్చివేత.. అనూహ్య నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సచివాలయ భవనాల కూల్చివేత పనులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. సచివాలయ భవనాల కూల్చివేత పనుల వద్దకు వెళ్లేందుకు మీడియాకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు బీఆర్కే భవన్ నుంచి సిటీ పోలీసు కమిషనర్ నేతృత్వంలో మీడియా ప్రతినిధులు.. సచివాలయ భవనాల కూల్చివేత పనుల వద్దకు వెళ్లనున్నారు. ఈనెల 6 వ తేది అర్ధరాత్రి నుంచి కూల్చివేతలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. మధ్యలో హై కోర్టు కూల్చివేతల పనులను వారం రోజుల పాటు నిలిపివేయాలని ఆదేశించింది. ప్రతిపక్ష పార్టీలు కూల్చివేతలను ఆపాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కానీ కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. దాంతో ప్రభుత్వం కూల్చివేత పనులను తిరిగి ప్రారంభించింది. (సినిమా అయిపోయాక టికెటిస్తే?) ఇప్పటికే దాదాపు 90 శాతం కూల్చివేత పనులు పూర్తయ్యాయి. శిథిలాలు (వ్యర్థాలు) మొత్తం దాదాపు 4500 లారీల లోడు ఉంటుందని అంచనా. ఇందులో ఇప్పటికే 2వేల లారీల ట్రిప్పులు ఎత్తివేయడం జరిగింది. మిగతా పనులు జరుగుతున్నాయి. ఎత్తైన భవనాలు కూల్చివేసే సందర్భంలో ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించలేదు. అందులో భాగంగా మీడియాను కూడా అనుమతించలేదు. అయితే కూల్చివేత వార్తలు సేకరించడానికి అనుమతి ఇవ్వాలని మీడియా ప్రతినిధుల నుంచి పదే పదే విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూల్చివేత పనులకు, వ్యర్థాల తొలగింపు పనులకు సంబంధించిన వార్తల సేకరణకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింనట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత రెడ్డి ప్రకటించారు. (కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టు షాక్..) అయితే కూల్చివేతల సందర్భంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వమే మీడియా ప్రతినిధులకు ఆ ప్రాంతాన్ని చూపించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ రోజు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు బీర్కే భవన్ నుంచి మీడియా ప్రతినిధులను సిటి పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో తీసుకెళ్ళి, సెక్రటేరియట్ ప్రాంతాన్ని చూపిస్తామన్నారు. -
సినిమా అయిపోయాక టికెటిస్తే?
సాక్షి, హైదరాబాద్: ‘సచివాలయం భవనాల కూల్చివేత ప్రక్రియ ఇప్పటికే 90 శాతానికిపైగా పూర్తయిందని చెబుతున్నారు. మరోవైపు మీడియాను అనుమతించాలా లేదా అన్నదానిపై ప్రభుత్వ అభిప్రాయం చెప్పడానికి సోమవారం వరకు గడువు కోరుతున్నారు. సినిమా అయిపోయాక టికెట్ ఇస్తే ఏం లాభం’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియను కవర్ చేసేందుకు మీడియాను అనుమతించాలంటూ వీఐఎల్ మీడియా సంస్థ తరఫున జి.సంపత్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ గురువారం మరోసారి విచారించారు. నగరంలో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేసే ప్రక్రియను కవర్ చేసేందుకు మీడియాను అనుమతిస్తున్నారని, ప్రజలకు ఏం జరుగుతుందో తెలియాల్సిన సచివాలయం భవనాల కూల్చివేత ప్రక్రియను కవర్ చేసేందుకు మాత్రం మీడియాను అనుమతించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాసిరెడ్డి నవీన్‌కుమార్ వాదనలు వినిపించారు. సచివాలయ భవనాల కూల్చివేత వ్యవహారం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, ఇదేం ప్రైవేటు వ్యవహారం కాదన్నారు. ఇంత రహస్యం గా కూల్చివేత పనులు చేపట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇప్పటికే 90 శాతానికిపైగా భవనాలను కూల్చివేశామని, రక్షణ చర్యల్లో భాగంగానే మీడియాను అనుమతించడం లేదని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. దీనిపై ప్రభుత్వ అభిప్రాయాన్ని సోమవారంలోగా తెలియజేస్తానని గడువు ఇవ్వాలని కోరారు. 90 శాతానికిపైగా భవనాలను కూల్చివేశామని చెబు తున్న నేపథ్యంలో మీడియాను అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని నవీన్‌కుమార్ కోరా రు. ‘ఇది చాలా సున్నితమైన అంశం. రోజూ ఎన్ని భవనాలు కూలుస్తున్నారో కలర్ ఫొటోలతో సహా సాయంత్రం మీడియాకు బులెటిన్ రూపంలో ఇవ్వండి. దీనిపై నేటిలోగా ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలపండి’ అని న్యాయమూర్తి ఏజీని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. -
‘కూల్చివేతల బులిటెన్ విడుదల చేయొచ్చుగా’
సాక్షి, హైదరాబాద్: సచివాలయం కూల్చివేతలను కవరేజ్ చేయడానికి మీడియాకు అనుమతి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. కూల్చివేతల వద్దకు ఎవ్వరిని అనుమతించలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఎందుకు అనుమతి ఇవ్వరో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. సెక్షన్ 180ఇ ప్రకారం సైట్లో పని చేసే వారు మాత్రమే ఉండాలి.. కానీ మిగిలిన వారు ఉండటానికి అనుమతి లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కూల్చివేతల అంశంలో ఎందుకు గోప్యత పాటిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. (కేబినెట్ ఆమోద ప్రతిని ఇవ్వండి) కోవిడ్ బులిటెన్లను ఏవిధంగా విడుదల చేస్తున్నారో కూల్చివేతలకు సంబంధించిన బులిటెన్ కూడా అలానే విడుదల చేయొచ్చు కదా అని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే 95 శాతం కూల్చివేత పనులు పూర్తి అయ్యాయని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ అంశం గురించి ప్రభుత్వాన్ని సంప్రదించి సోమవారం చెప్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. అయితే సోమవారం వరకు గడువు ఇవ్వలేమన్న హైకోర్టు.. రేపటిలోగా ప్రభుత్వ నిర్ణయం తెలపాలని ఆదేశించింది. లేదంటే తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరిస్తూ.. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. -
తొలగిన అడ్డంకి
-
కూల్చివేతకు లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్ : సచివాలయం భవ నాల కూల్చివేతకు లైన్‌క్లియర్ అయ్యింది. గత వారం రోజులుగా కూల్చివేత పను లపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుతం ఉన్న భవనాల కూల్చివేతకు ఎటువంటి ముందస్తు అనుమతి అవస రం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. భూమిని సిద్ధం చేయడం (ప్రిపరేషన్ ఆఫ్ ల్యాండ్) అంటే భవనాలను కూల్చి వేయం కూడా వస్తుందని, ఇందుకు అనుమతి అవసరమన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. ఈ వాదనను నిరూపించేందుకు ఎటువంటి ఆధారాలను, తీర్పులను పిటిషనర్ సమర్పించలేదని పేర్కొంది. నూతన నిర్మాణాలకు మాత్రమే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు ఉండాలని పేర్కొంది. పునాదుల కోసం భూమిని తవ్వే ముందు మాత్రమే అనుమతులు ఉండాలని, కూల్చివేతలకు వేస్ట్ మేనేజ్మెంట్ చట్టం కింద స్థానిక సంస్థల అనుమతి ఉంటే సరిపోతుందని పర్యావరణ శాఖ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. కోవిడ్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి కూల్చివేత పనులు చేపట్టాలని ఆదేశించింది. సచివాలయం కూల్చివేత నిబంధనలకు విరుద్దంగా చేస్తున్నారంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. సరైన అనుమతులు లేకుండానే సచివాలయ భవనాలను కూల్చివేస్తున్నారని, వీటిని ఆపాలంటూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, డాక్టర్ చెరుకు సుధాకర్‌లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. సచివాలయం భవనాల కూల్చివేతకు అనుమతులు అవసరం లేదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వర్‌రావు నివేదించారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ అధికారులు సమర్పించిన లేఖను ధర్మాసనానికి సమర్పించారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. సచివాలయం కూల్చివేసి కొత్తది నిర్మించాలన్న విషయంలో మంత్రిమండలి తుది నిర్ణయం తీసుకోలేదని పిటిషనర్ వాదనలు వినిపించారని, అయితే జూన్ 30న ఈ మేరకు మంత్రి మండలి తీర్మానం చేసిందని, ఈ తీర్మానం ప్రతిని ఏజీ సమర్పించారని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. భద్రతా కారణాల రీత్యా ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి అత్యాధునిక హంగులతో, మంచి నిర్మాణ శైలితో నూతన భవనాలను నిర్మించాలని మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని పరిశీలించామని వివరించింది. ఈ నేపథ్యంలో మంత్రిమండలి తుది నిర్ణయం లేకుండానే కూల్చివేత పనులు చేపడుతున్నారన్న పిటిషనర్ వాదన సరికాదని స్పష్టం చేసింది. కూల్చివేత సమయంలో వచ్చే వ్యర్థాలను తొలగించే విషయంలో సంబంధిత అధికారుల నుంచి అనుమతులు లేవన్న పిటిషనర్ వాదననూ ధర్మాసనం తోసిపుచ్చింది. రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ ఈ మేరకు జీహెచ్ఎంసీ నుంచి ఈనెల 4న అనుమతులు తీసుకొని 7వ తేదీ నుంచి కూల్చివేత పనులు ప్రారంభించారని పేర్కొంది. కరోనా విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో కూల్చివేతలు చేపట్టరాదని పిటిషనర్ వాదిస్తున్నారని అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన మార్గదర్శకాల్లో ఎక్కడా కూల్చివేత పనులు చేపట్టరాదని లేదని పేర్కొంది. కూల్చివేతలతో వెలువడే దుమ్ము, ధూళితో కాలుష్యం ఏర్పడుతోందని, సచివాలయం సమీపంలోని ప్రజలకు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే పరిస్థితి లేకుండా వారికున్న ప్రాథమిక హక్కులను హరిస్తున్నారన్న పిటిషనర్ తరఫు వాదననూ ధర్మాసనం తోసిపుచ్చింది. పిటిషనర్ లేవనెత్తిన ఇతర అభ్యంతరాలకు సరైన ఆధారాలు చూపలేదని ధర్మాసనం పేర్కొంది. నూతన భవనాల నిర్మాణ సమయంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. వేస్ట్ మేనేజ్మెంట్ చట్టం నిబంధనల మేరకే అనుమతులు తీసుకొని వ్యర్థాలను తరలిస్తున్నామని వివరించారు. -
కూల్చివేతపై లంచ్‌మోషన్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పాలనా కేంద్రం.. సచివాలయ భవనాల్ని కూల్చకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం ఎదుట పిటిషనర్ న్యాయవాది ప్రభాకర్ కోరారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కూల్చివేత పనుల్ని వాయిదా వేయాలన్నారు. కూల్చివేత వల్ల సచివాలయ పరిసర ప్రాంతాల్లోని 5 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాలుష్య సమస్య తలెత్తుతోందని పేర్కొన్నారు. కూల్చివేత ఏకపక్షంగా, కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పారు. దీనిపై లంచ్‌మోషన్ పిటిషన్ అవసరం లేదని, పిటిషన్‌గా దాఖలు చేస్తే దానిని ఇతర వ్యాజ్యాల క్రమంలో విచారణ చేస్తామని ధర్మాస నం స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. ఇదిలాఉండగా సచి వాలయ కూల్చివేతపై మంత్రివర్గం కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని, మధ్యంతర నిర్ణయం మాత్రమే తీసుకుందని ఇటీవల హైకోర్టు తీర్పులో పేర్కొన్న అంశాన్ని ప్రస్తావిస్తూ సీనియర్ న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు. మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోకుండా భవనాల కూల్చివేత నిర్ణయం చెల్లదని చెప్పారు. -
‘సీఎం జగన్ అద్భుతంగా పనిచేస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్ : నగర పోలీసులపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి ముందు పోలీసులను ఎందుకు పెట్టారని పోలీసులను ఉత్తమ్ ప్రశ్నించారు. ఈ మేరకు బంజారాహిల్స్ డీసీపీతో ఉత్తమ్ ఫోన్లో ప్రశ్నించారు. తనను కలవడానికి వస్తున్న కార్యకర్తలను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గవర్నర్ వ్యవస్థను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అవమానించారన్నారు. సోమేశ్ కుమార్ సీఎస్ పదవికి అనర్హుడని ఉత్తమ్ ధ్వజమెత్తారు. (కొత్త సచివాలయం అవసరమా?) సోమేశ్ ఈ రాష్ట్ర క్యాడర్ కాదని, వైద్యశాఖపై సమీక్షకు గవర్నర్ పిలిస్తే సీఎస్ వెళ్లకపోవడం దారుణమని ఉత్తమ్ అన్నారు. ఒక్క మనిషి మూఢ నమ్మకానికి సచివాలయం కూల్చివేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణలో న్యాయ వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారన్నారు. ఓ వైపు ప్రజలు కరోనా వ్యాధితో కుదేలై పోతుంటే.. మరోవైపు నాయకులు మూఢ నమ్మకాల పేరుతో వేల కోట్లతో కొత్త భవనాలు నిర్మిస్తున్నారని దుయ్యబట్టారు. సచివాలయం మన అందరి ఆస్తి అని, రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందని విమర్శించారు. 2012-13లో పూర్తయిన భవనాలు ఇప్పుడు కూల్చడం దారుణమని, సచివాలయం కూల్చివేయడంతో ఈ రోజు బ్లాక్ డే అని పేర్కొన్నారు. (తెలంగాణ సచివాలయం కూల్చివేత ప్రారంభం) కరోనా నివారణలో కేసీఆర్ విఫలమయ్యారని ఉత్తమ్ కుమార్ విమర్శించారు. సచివాలయంలో ఆస్పత్రి పెడితే తప్పేంటని, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఏపీలో కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చారని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులను ఎందుకు నియంత్రించడం లేదని ఉత్తమ్ కుమార్ సందేహం వ్యక్తం చేశారు. -
సచివాలయంవైపు వెళ్లే దారులన్నీ మూసివేత
-
తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత ప్రారంభం
-
తెలంగాణ సచివాలయం కూల్చివేత ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత పనులను ప్రభుత్వం ప్రారంభించింది. సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం అర్థరాత్రి నుంచి ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. ప్రభుత్వ ఆదేశం మేరకు సోమవారం అర్థరాత్రి నుంచే కూల్చివేతకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పోలీసులను భారీగా మొహరించి సెక్రటేరియట్ దారులన్ని మూసివేశారు. ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, మింట్ కాపౌండ్ సెక్రెటరేట్ దారులను పోలీసులు మూసివేశారు. హైకోర్టు ఏడాది క్రితమే సచివాలయం కూల్చివేతకు ప్రభుత్వం భూమిపూజ చేసింది. 132 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సచివాలయం.. నిజాం నవాబుల పాలనా కేంద్రంగా సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా ఉంది. (సచివాలయంపై తొందరెందుకు?: హైకోర్టు) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి పాలనా కేంద్రమైంది. మొత్తం 16 మంది ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా వెలసిల్లిన సచివాలయాన్ని నిజాంలు 25 ఎకరాల విస్తీర్ణంలో 10లక్షల చదరపు అడుగుల్లో సచివాలయ కట్టడాన్ని నిర్మించారు. 132 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ సచివాలయాన్ని 10 బ్లాకులుగా నిర్మించారు. అతిపురాతనమైన జీ బ్లాక్ 1888లో ఆరవ నిజాం నవాబు కాలంలో నిర్మించింది. 2003లో డీ బ్లాక్, 2012లో నార్త్, సౌత్ బ్లాక్‌లను ప్రభుత్వం ప్రారంభిచింది. పాత సచివాలయాన్ని కూల్చివేసి అన్నీ హంగులతో నూతన సచివాలయం నిర్మాణంకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మొత్తం 500 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం నూతన సచివాలయాన్ని నిర్మించనుంది. 6 లక్షల చదరపు అడుగుల్లో నూతన సచివాలయాన్ని నిర్మించి... సీఎం, అధికారులు, మంత్రుల సమావేశం కోసం అధునాతన హిల్స్ నిర్మించనుంది. మంత్రుల పేచీలోనే ఆయా శాఖల కార్యదర్శులు, సెక్షన్ కార్యాలయాలతో నూతన సచివాలయం కట్టడానికి ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టనుంది. నూతన సచివాలయం నమూనా వాహనాల మళ్లింపు, ట్రాఫిక్ జామ్ సచివాలయంలో కూల్చివేత లు నేపథ్యంలో ట్రాఫిక్ దారి మళ్లించారు. సచివాలయం నుంచి కిలోమీటర్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇందిరా పార్క్ నుంచి వచ్చే వాహనాలను లోయర్ ట్యాంక్ బండ్, బషీర్‌బాగ్ పైపు మళ్లిస్తున్నారు. ఐ మాక్స్, రవీంద్రభారతి, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, బషీర్‌బాగ్‌లోనూ వాహనాలను దారి మళ్లించారు. దీంతో ఈ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ట్రాఫిక్ స్తంభించింది. -
సచివాలయం కూల్చివేత చట్టవిరుద్ధం కాదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలన్న రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం ఏ చట్ట నిబంధనలకూ విరుద్ధం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే కేబినెట్ నిర్ణయం ఏకపక్షం, అసమంజసం ఎంతమాత్రం కాదని తేల్చిచెప్పింది. సచివాలయం విషయంలో మంత్రిమండలి 2019 జూన్ 18న తీసుకున్న నిర్ణయం కేవలం మధ్యంతర నిర్ణయం మాత్రమేనని, కొత్త సచివాలయ నిర్మాణం అవసరమా లేదా? అనే అంశంపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించింది. కొత్త సచివాలయ నిర్మాణం వల్ల ఖజానాపై భారం పడుతుందన్న అంశంలోకి తాము వెళ్లబోమని, ఖర్చుల అంశం పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోనిదని తెలిపింది. దేనికి ఎప్పుడు, ఎంత ఖర్చు చేయాలన్న అంశం పూర్తిగా కార్యనిరాహక వ్యవస్థ పరిధిలోనిదని, అందువల్ల ఈ విషయంలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోజాలదని స్పష్టం చేసింది. హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని కాదని, కాబట్టి భవనాల కేటాయింపు అధికారం గవర్నర్‌కే ఉంటుందన్న వాదన ఎంతమాత్రం చెల్లుబాటు కాదని తేల్చిచెప్పింది. సచివాలయ నిర్మాణం విషయంలో మంత్రిమండలి నిర్ణయాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ప్రస్తుత సచివాలయం స్థానంలో కొత్త సచివాలయం నిర్మించాలన్న కేబినెట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి, న్యాయవాది తేరా రజనీకాంత్‌రెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం. పద్మనాభరెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అనుముల రేవంత్‌రెడ్డి, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావులు వేర్వేరుగా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు వాయిదా వేసిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. తుది నిర్ణయం కానే కాదు... ‘మా ముందున్న ప్రధాన చర్చనీయాంశ విషయం ఏమిటంటే కేబినెట్ నిర్ణయం ఏకపక్ష, అసమంజస నిర్ణయమా? కేబినెట్ నిర్ణయం ఏదైనా చట్ట నిబంధనలకు విరుద్ధమా? ఈ అంశాల్లోకి వెళ్లే ముందు మంత్రిమండలి నిర్ణయ ప్రక్రియను మాత్రమే మేం పరిగణనలోకి తీసుకుంటున్నాం. ప్రభుత్వ విధాన నిర్ణయంపై మేం అప్పీలేట్ అథారిటీలాగా వ్యవహరించట్లేదు. 18.06.2019 నాటి కేబినెట్ నిర్ణయాన్ని పరిశీలిస్తే మంత్రిమండలి రెండు ఆప్షన్లను పరిశీలించింది. మొదటిది ప్రస్తుత సచివాలయ నిర్మాణాలను మార్పు చేయడం. రెండోది ప్రస్తుత నిర్మాణాలను కూల్చేసి వాటి స్థానంలో కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టడం. కాబట్టి మంత్రిమండలి నిర్ణయం తుది నిర్ణయం కాదని, కేవలం మధ్యంతర నిర్ణయం మాత్రమేనని స్పష్టమవుతోంది. అందువల్ల సచివాలయం కూల్చివేతకు కేబినెట్ తీసుకున్నది తుది నిర్ణయమన్న పిటిషనర్ల వాదన తప్పు’అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2012 నుంచే కేబినెట్ పరిశీలనలో... ‘సచివాలయం అంశాన్ని మంత్రిమండలి పరిశీలించడం ఇది తొలిసారి కాదు. 2012, 2013లో సచివాలయ భద్రతకు సంబంధించి రెండు నివేదికలు వచ్చాయి. 2014లో అగ్నిమాపక శాఖ సచివాలయంలో అగ్నినిరోధక వ్యవస్థ లేకపోవడంపై నివేదిక ఇచ్చింది. 2015లో మంత్రిమండలి సమావేశంలో ఇది చర్చకు సైతం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సచివాలయం స్థానంలో కొత్త నిర్మాణం చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ 2016లో పిటిషన్లు దాఖలయ్యాయి. 2016లో అగ్నిమాపక శాఖ ప్రస్తుత భవనంలో ఉన్న అనేక లోపాలను పేర్కొంటూ నివేదిక ఇచ్చింది. దీంతో 2019లో సచివాలయం విషయమై కేబినెట్ మరోసారి చర్చించింది. అయితే తుది నిర్ణయం తీసుకోలేదు. కొత్త సచివాలయ నిర్మాణం అన్నది ప్రస్తుతం కేవలం ప్రణాళిక దశలోనే ఉంది. మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయడం, సాంకేతిక కమిటీ, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) నుంచి నివేదికలు కోరడం సమర్థనీయమే. తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు ఈ నివేదికలు కేబినెట్ ముందుకొస్తాయని అడ్వొకేట్ జనరల్ చెప్పారు. వాస్తవానికి కేబినెట్ తుది నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి తుది నిర్ణయం తీసుకోవడానికి మంత్రిమండలి ముందు ఎటువంటి మెటీరియల్ లేదన్న పిటిషనర్ల వాదన ఆమోదయోగ్యం కాదు’అని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. ప్రస్తుత భవనం పనికి రాదని నివేదికలు... ‘ప్రస్తుత సచివాలయ భవనం చాలా చోట్ల కుంగిపోయి.. పునరుద్దరణకు ఏ మాత్రం ఆస్కారం లేని విధంగా ఉందన్న నిపుణుల కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుత భవనాల జీవన కాలాన్ని 70 ఏళ్లగా నిర్ణయించారు. అయితే జీ బ్లాక్ 131 ఏళ్ల క్రితం నిర్మించింది. అది కూలిపోయే దశకు చేరుకుంది. ఐజీబీసీ నిర్దేశించిన హరిత భవనాల నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుత సచివాలయం లేదు. ఇంకుడు గుంతల వ్యవస్థ, సౌర విద్యుత్ వ్యవస్థ, తగినంత వెలుతురు, గాలి, సరైన వైరింగ్ వ్యవస్థ కూడా లేదు. ముఖ్యమంత్రి ఉంటున్న ప్రస్తుత భవనం కూడా 41 ఏళ్ల క్రితం నిర్మించిందని నివేదికలు చెబుతున్నాయి. వ్యర్థ జలాల నిర్వహణ వ్యవస్థ లేదు. దివ్యాంగులకు అనుకూలమైన వాతావరణం లేదు. ఇలా అనేక లోపాలున్న ప్రస్తుత సచివాలయ భవన నిర్వహణ చాలా కష్టమన్న ప్రభుత్వ వాదన సమర్థనీయమే’అని ధర్మాసనం పేర్కొంది. -
సచివాలయం కూల్చివేత: రిజర్వ్‌లో తీర్పు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం కూల్చివేత పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సచివాలం భవనాలను కూల్చి వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా చట్ట విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. ఇప్పటి వరకు నాలుగు పిటిషన్లపై వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అగ్ని ప్రమాదాలు జరిగితే నివారణ చర్యలు తీసుకోలేకపోతున్నామని, భవనాలు నీరుగారుతున్నయన్న కారణంతో నిక్షేపంగా ఉన్న భవనాల్ని కూల్చి, తిరిగి కొత్తగా సచివాలయాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని పిటిషనర్ల తరఫు న్యామవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి కుంటిసాకులు చెప్పి భవనాల్ని కూల్చేయకూడదని చెప్పారు. కొత్తగా సచివాలయాన్ని నిర్మించేందుకు రూ. 400 కోట్ల నుంచి రూ. 500 కోట్ల ఖర్యు చేయాలనే ప్రతిపాదన అమలు జరిగితే ప్రజాధనం వృథా అవుతుందని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదించారు. సచివాలయ భవాల్ని కూల్చరాదని కోరుతూ కాంగ్రెస్ట్ పార్టీ ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి, ఎంపీ ఎ. రేవంత్‌రెడ్డి, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజాహఙత వ్యాఖ్యాలపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. గ్రామాల్లో మరుగుదొడ్లు దూరంగా ఉన్నాయని చెప్పి ఇళ్లను కూల్చేస్తారా లేక మరుగుదొడ్లను కూల్చేస్తారా అని న్యాయవాది ప్రశ్నించారు. ఎమ్మెల్సీగా ఉన్న జీవన్‌రెడ్డి పిల్ వేయకూడదని ఎలా చెబుతారని, ప్రజాధనం వృథా అవుతుంటే పిల్స్ వేయడం పౌరునిగా ఆయన బాధ్యతని చెప్పారు. పిల్స్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వం చెప్పడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని వృథా చేయడమంటే నేరానికి పాల్పడినట్లేనని, ఇలాంటి సందర్భాల్లో ఆరు నెలలు జైలు శిక్ష విధించేలా చట్టాలున్నాయని సత్యంరెడ్డి గుర్తు చేశారు. ఢిల్లీ సచివాలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందనది, పాతబడిందని చెప్పి ఒక్క ఇటుకను కూడా తొలగించలేదన్నారు. అదేవిధంగా చార్మినార్‌ను నిర్మించి 400 ఏళ్లకు పైబడిందని, ఇలాంటి చారిత్రక కట్టడాలకు మరమ్మతులు చేయాలేగానీ కూల్చేసి మళ్లీ కట్టేస్తామనడం అవివేకమని వ్యాఖ్యానించారు. సచివాలయాన్ని ఖాళీ చేయడం వల్ల పాలన అంతా తలోచోటుకు చేరిందని, సీఎం ప్రగతి భవన్లో ఉంటే ఇతరులు వేరువేరు భవనాల నుంచి పాలన చేస్తున్నారని చెప్పారు. ప్రధాన కార్యదర్శి కార్యలయాన్ని బీఆర్కే భవనంనలో ఏర్పాటు చేశారని, హుస్సేన్‌సాగర్ కనపనడేందుకు ఏకంగారూ. 6 కోట్లు ఖర్చు చేశారని, ఆ సీఎస్ ఉన్నది కేవలం ఆరేడు మాసాలేనని అన్నారు. ఎంపీ రేవంత్‌రెడ్డి, తరఫున న్యాయవాది రజనీకాంత్, విశ్వేశ్వరరావు తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌లు వాదించారు. -
హెచ్ బ్లాక్‌ను ఎందుకు కూలుస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ప్రభత్వం వాదించింది. అందుకే నూతన సచివాలయం నిర్మిస్తున్నామని హైకోర్టుకు తెలిపింది. సచివాలయ భవనాల టెక్నికల్ రిపోర్ట్‌ను ధర్మాసనానికి సమర్పించింది. సుమారు 10 లక్షల ఎసేఫ్టీతో ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్‌ను నిర్మిస్తామని హైకోర్టుకు వివరించింది. ప్రభుత్వ వాదనలు విన్న ధర్మాసనం.. ఏడేళ్ల క్రితం నిర్మించిన హెచ్ బ్లాక్‌ను ఎందుకు కూల్చి వేస్తున్నారని ప్రశ్నించింది. విధానపరమైన నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోరాదని ప్రభుత్వం వాదించింది. అయితే దినిపై స్పందించిన ధర్మాసనం.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము ఎలా జోక్యం చేసుకోవాలో తెలపాలని పిటిషనర్‌ను కోరింది. తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. -
సచివాలయం కూల్చివేతపై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం భవనాల కూల్చివేత పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. భవనాల కూల్చివేతకు సంబంధించి ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. పిటిషనర్ అభ్యంతరాలను ఆయన తరఫున లాయర్ చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలియజేశారు. నూతన సచివాలయ నిర్మాణంపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని.. సచివాలయం నిర్మాణం, భవనాల కూల్చివేతపై ఇప్పటికే కమిటీ వేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న సచివాలయంలో ఫైర్ సెఫ్టీ నిబంధనలు సరిగాలేవని, సరైన పార్కింగ్ సదుపాయం కూడా లేదని చెప్పారు. కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికను కోర్టు సమర్పించారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో కొనసాగిన సచివాలయ భవనాలను ఇప్పుడు ఎందుకు కూల్చివేస్తున్నారని పిటిషనర్ తరుఫున న్యాయవాది ప్రశ్నించారు. సచివాలయంలో సుమారు ఏడు ఏళ్ల కిందట నిర్మించిన భవనాలను కూడా కూల్చివేస్తున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. నూతన సచివాలయ నిర్మాణం వలన వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టు షాక్..
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. సచివాలయం కూల్చివేతకు తెలంగాణ హైకోర్టు నో చెప్పింది. సచివాలయం కూల్చివేత పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు సచివాలయ భవనాలను కూల్చొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దసరా సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని తెలిపింది. అయితే కొత్త సచివాలయ భవన సముదాయనిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికను నేడు తెలంగాణ కేబినెట్ ఆమోదించనున్న వార్తల నేపథ్యంలో కోర్టు ఈ తీర్పు వెలువడటం గమనార్హం. కేబినెట్ భేటీ అనంతరం సచివాలయ భవనాల కూల్చివేత, కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టాలని భావించిన కేసీఆర్ సర్కార్‌కు కోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వొద్దు : హైకోర్టు అలాగే మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ తేలేంత వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని మరో కేసులో హైకోర్టు ఆదేశించింది. గతంలో ఎన్నికల కమిషన్ పాటించిన విధానాన్ని పాటించాలని సూచించింది. అలాగే ఎన్నికల ముందు జరిగే ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకోవచ్చని తెలిపింది. దసరా సెలవుల తర్వాత దీనిపై విచారణ చేపట్టనున్నట్టు కోర్టు తెలిపింది. సెలవుల నేపథ్యంలో అత్యవసర బెంచ్‌ల ఏర్పాటు హైకోర్టుకు దసరా సెలవుల నేపథ్యంలో కేసుల విచారణకు అత్యవసర బెంచ్‌లను ఏర్పాటు చేయనున్నట్టు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు. ఈ నెల 9,10 తేదీలలో డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. కాగా, దసరా పండుగ సందర్భంగా ఈ నెల 3 నుంచి 11 వరకు హైకోర్టుకు సెలవులు ఉంటాయని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సచివాలయ కూల్చివేతను అడ్డుకోండి
-
సచివాలయ కూల్చివేతను అడ్డుకోండి
హైకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పిల్ సాక్షి, హైదరాబాద్: సచివాలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నవంబర్‌లో శంకుస్థాపనలు చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలని జీవన్‌రెడ్డి తరఫు న్యాయవాది సరసాని సత్యంరెడ్డి గురువారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై శుక్రవారం విచారణ చేపడుతామని ధర్మాసనం తెలిపింది. వాస్తు పేరుతో ప్రజా ధనం వృథా... ‘హైదరాబాద్‌లో సచివాలయం దాదాపు 20 ఎకరాల్లో ఉంది. ఇందులో పురావస్తు భవనం, గ్యారేజీ, సివిల్, ఆయుర్వేద, హోమియోపతి ఆసుపత్రులు, గుడి, మసీదు, చర్చి కూడా ఉన్నాయి. అత్యధిక నిర్మాణాలు 1980లో చేపట్టినవి కాగా, కొన్నింటిని ఇటీవల కూడా నిర్మించారు. ఈ భవనాలన్నీ కూడా మరో వందేళ్ల పాటు మనగలవు. ఇటీవల వాస్తు, ఇతర బహిర్గతం చేయని కారణాలతో ఈ భవనాలన్నింటినీ కూల్చివేసి వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త నిర్మాణాలకు రూ.500 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనున్నది. వాస్తు పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తోంది. ఇదే విషయాన్ని సీఎం, సీఎస్ల దృష్టికి తీసుకెళ్లా. ప్రజలకు ఎన్నో హామీలిచ్చిన ప్రభుత్వం వాటిని అమలు చేయడంలేదు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని సచివాలయ భవనాల కూల్చివేతలను అడ్డుకోండి’ అని జీవన్‌రెడ్డి తన పిటిషన్లో కోర్టును కోరారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి, ఆర్అండ్బీ ఇంజనీర్ ఇన్ చీఫ్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.