
సాక్షి, హైదరాబాద్ : సచివాలయ కూల్చివేతలో భాగంగా దాదాపు 40 రోజుల పాటు మూసివేసి ఉంచిన తెలుగుతల్లి, ఖైరతాబాద్ ప్లైఓవర్‌లపై మంగళవారం రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేటి నుంచి సింగిల్ వేలో వాహనదారులకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. జూలై 7న ప్రారంభమైన సచివాలయ కూల్చివేత 40 రోజుల పాటు జరిగింది. భవనాలు కూల్చివేసే సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతోనే ఫ్లై ఓవర్‌లతో పాటు పరిసర ప్రాంతాల రహదారులను మూసివేశామని అధికారులు పేర్కొన్నారు.
అయితే సచివాలయ కూల్చివేతకు సంబంధించి మీడియాతో పాటు ఇతరులెవ్వరిని తెలంగాణ ప్రభుత్వం అనుమతించలేదు. సచివాలయ భవనం కింద గుప్త నిధులు ఉన్నాయని, అందుకే అనుమతి ఇవ్వలేదని కొందరు చేసిన ప్రచారం అలజడి రేపింది. ఇదే విషయమై ఒక మీడియా సంస్థ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టు కూడా ప్రభుత్వ తీరుపై అభ్యంతరాలు తెలపడంతో మీడియాను అనుమతిచ్చారు.