సినిమా అయిపోయాక టికెటిస్తే? | Telangana High Court Fires On State Government Over Demolition Of Secretariat Buildings | Sakshi
Sakshi News home page

సినిమా అయిపోయాక టికెటిస్తే ఏం లాభం?

Published Fri, Jul 24 2020 3:08 AM | Last Updated on Fri, Jul 24 2020 8:50 AM

Telangana High Court Fires On State Government Over Demolition Of Secretariat Buildings - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘సచివాలయం భవనాల కూల్చివేత ప్రక్రియ ఇప్పటికే 90 శాతానికిపైగా పూర్తయిందని చెబుతున్నారు. మరోవైపు మీడియాను అనుమతించాలా లేదా అన్నదానిపై ప్రభుత్వ అభిప్రాయం చెప్పడానికి సోమవారం వరకు గడువు కోరుతున్నారు. సినిమా అయిపోయాక టికెట్‌ ఇస్తే ఏం లాభం’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియను కవర్‌ చేసేందుకు మీడియాను అనుమతించాలంటూ వీఐఎల్‌ మీడియా సంస్థ తరఫున జి.సంపత్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ గురువారం మరోసారి విచారించారు. నగరంలో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేసే ప్రక్రియను కవర్‌ చేసేందుకు మీడియాను అనుమతిస్తున్నారని, ప్రజలకు ఏం జరుగుతుందో తెలియాల్సిన సచివాలయం భవనాల కూల్చివేత ప్రక్రియను కవర్‌ చేసేందుకు మాత్రం మీడియాను అనుమతించడం లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాసిరెడ్డి నవీన్‌కుమార్‌ వాదనలు వినిపించారు.

సచివాలయ భవనాల కూల్చివేత వ్యవహారం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, ఇదేం ప్రైవేటు వ్యవహారం కాదన్నారు. ఇంత రహస్యం గా కూల్చివేత పనులు చేపట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇప్పటికే 90 శాతానికిపైగా భవనాలను కూల్చివేశామని, రక్షణ చర్యల్లో భాగంగానే మీడియాను అనుమతించడం లేదని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. దీనిపై ప్రభుత్వ అభిప్రాయాన్ని సోమవారంలోగా తెలియజేస్తానని గడువు ఇవ్వాలని కోరారు. 90 శాతానికిపైగా భవనాలను కూల్చివేశామని చెబు తున్న నేపథ్యంలో మీడియాను అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని నవీన్‌కుమార్‌ కోరా రు. ‘ఇది చాలా సున్నితమైన అంశం. రోజూ ఎన్ని భవనాలు కూలుస్తున్నారో కలర్‌ ఫొటోలతో సహా సాయంత్రం మీడియాకు బులెటిన్‌ రూపంలో ఇవ్వండి. దీనిపై నేటిలోగా ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలపండి’ అని న్యాయమూర్తి ఏజీని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement