ఏపీ తరహాలో డిపాజిటర్లను ఆదుకుంటారా? | High Court Questioned Telangana Government In Agri Gold Case | Sakshi
Sakshi News home page

ఏపీ తరహాలో డిపాజిటర్లను ఆదుకుంటారా?

Oct 3 2021 2:07 AM | Updated on Oct 3 2021 8:35 AM

High Court Questioned Telangana Government In Agri Gold Case - Sakshi

అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం రూ.900 కోట్లు అందించిన తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా వారిని ఆదుకునే అవకాశం ఉందా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆదేశించింది

సాక్షి, హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం రూ.900 కోట్లు అందించిన తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా వారిని ఆదుకునే అవకాశం ఉందా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాను పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చిన రూ.26 లక్షలను అగ్రిగోల్డ్‌ సంస్థలో డిపాజిట్‌ చేశానని, వృద్ధాప్యం లో ఉన్న తనకు ఆ డబ్బు ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన రవికాంత్‌ సిన్హా దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. సంస్థ సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడంతో కేన్సర్‌ బారినపడిన తన భార్యకు చికిత్స అందించలేకపోయానని సిన్హా పేర్కొన్నారు.

ఆయన తరఫున న్యాయవాది శ్రవణ్‌కుమార్‌ వాదనలు విని పిస్తూ, వృద్ధాప్యంలో ఉన్న సిన్హాకు పూటగడవడం కష్టంగా ఉందని, అగ్రిగోల్డ్‌ ఆస్తులను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బు హైకోర్టు రిజిస్ట్రార్‌ అధీనంలో ఉందని, ఆ డబ్బు నుంచి కొంత మొత్తాన్ని సిన్హాకు ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. డిపాజిటర్లను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముం దుకు వచ్చిందని, ఇప్పటి వరకు రూ.900కోట్లు బడ్జెట్‌లో కేటాయించి డిపాజిటర్లకు పంచిందని తెలిపారు. ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉందని, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డిపాజిటర్లకు న్యాయం చేయాలని కోరారు.

కాగా, అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశామని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయ వాది తెలిపారు. అయితే పిటిషన్‌ దాఖలు చేసింది తెలంగాణకు చెందిన అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘమని, ఈ పిటిషన్‌ను బదిలీ చేయరాదని శ్రవణ్‌కుమార్‌ కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. అగ్రిగోల్డ్‌ కుంభకోణంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంతో కలిపి ఈ పిటిషన్‌ను దసరా సెలవుల తర్వాత విచారిస్తామని స్పష్టం చేసింది. అప్పటిలోగా తెలంగాణకు చెందిన అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లను ఆదుకునే ఉద్దేశం ఉందా అన్నది తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement