సాక్షి,హైదరాబాద్: సచివాలయ భవనాల కూల్చివేత దాదాపు 95 శాతం పూర్తి కావొచ్చింది. ఎల్ బ్లాక్‌లోని 50% మేర, జే బ్లాక్‌లోని 30% మేర మాత్రమే కూల్చి వేత మిగిలి ఉండడంతో త్వరలోనే పాత సెక్రటేరియట్ భవన సముదాయం కనుమరుగు కానుంది. ఎన్టీరామారావు, ఇతర సీఎంలు కార్యకలాపాలు నిర్వహించిన, హెరిటేజ్ భవనంగా పలువురు వాదిస్తూ వచ్చిన జీ బ్లాక్ పూర్తిగా నేలమట్టమై ఒక పెద్ద మట్టి దిబ్బగా మారింది. సెక్రటేరియట్ భవనాల కూల్చివేత మొదలుపెట్టాక సోమవారం తొలిసారిగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులను లోపలికి అనుమతించారు. ఐ అండ్ పీఆర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య మూడు మినీబస్సులు, ఒక డీసీఎం, ఒక ట్రాలీలో హైదరాబాద్‌లోని వివిధ ఎలక్ట్రానిక్ మీడియా వీడియోగ్రాఫర్లు, రిపోర్టర్లు, ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్లు, రిపోర్టర్లను సచివాలయంలోకి తీసుకెళ్లారు.
సెక్రటేరియట్ మెయిన్ గేటు నుంచి ఇప్పటికే కూల్చేసిన పాత డీ బ్లాక్ భవనసముదాయం ఎదుటవరకు తీసుకెళ్లారు. ఈ వాహనాల్లోని పోలీసు అధికారులు విలేకరులను బయటకు దిగనివ్వలేదు. టీవీ కెమెరామెన్‌లు వాహనాల నుంచే విజువల్స్ తీసుకున్నారు. చివర్లో వెనక్కువచ్చే ముందు ఓ పది నిముషాలు మాత్రం కూల్చివేసిన డి బ్లాక్ శిథిలాలు, వ్యర్థాల తరలింపు ప్రక్రియ విజువల్స్, ఫోటోలు తీసుకునేందుకు పోలీసులు అనుమతించారు. కూల్చివేత వివరాలు వెల్లడించేందుకు అధికారులెవరూ లేకపోవడం గమనార్హం.
మీడియాను అనుమతించాలనే హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం 4 గంటలకు లిబర్టీ సమీపంలోని జీహేచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట నుంచి వివిధ వాహనాల్లో జర్నలిస్టులను గుంపులుగా నింపి నెమ్మదిగా సెక్రటేరియట్ వైపు తీసుకెళ్లారు. సెక్రటేరియట్ మెయిన్ గేట్ వద్ద కొంతసేపు వేచిచూశాక గేట్లు తెరిచి లోపలికి అనుమతించినా, ఎవ్వరినీ వాహనాలు దిగనివ్వలేదు. అడుగుఅడుగునా పోలీసు కాపలా కనిపించింది, రోప్‌పార్టీ పోలీసులు తాడు పట్టుకుని ఎవరినీ ఎటూ వెళ్లనివ్వలేదు. వాహనాల్లోంచే వీడియోలు, ఫోటోలు తీసుకునేలా చేశారు. అసలు ఎక్కడ ఏ భవనముందో గుర్తు పట్టేందుకు, అంచనా వేసేందుకు పలువురు ఇబ్బందిపడ్డారు.
చురుకుగా సాగుతున్న పనులు...
భవనాల కూల్చివేత, దాని నుంచి వచ్చే శిథిలాల తొలగింపు, పిల్లర్లు, శ్లాబులు, ప్లింథ్ బీమ్‌ల్లోని స్టీల్, ఇనుప రాడ్లు, కడ్డీలు అక్కడక్కడ కుప్పగా పోసి ఉండడం కనిపించింది. గతంలో డి బ్లాక్ ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం జేసీబీలు, ఇతర యంత్రాలతో శిథిలాల తొలగింపు, పెద్దసంఖ్యలో గ్యాస్ కట్టర్లు ఉపయోగించి ఇనుప చువ్వల కటింగ్ వంటివి చురుకుగా సాగుతున్నాయి. గతంలో సీఎం కార్యాలయం ‘సీ’బ్లాక్ ఎదుట ఏర్పాటు చేసిన సెక్రటేరియట్ మీడియా పాయింట్ మాత్రం ఇంకా కూల్చివేతకు గురికాలేదు. 2014 తర్వాత తెలంగాణ సచివాలయం ప్రవేశద్వారం వద్ద నిర్మించిన పోలీస్ ఎంట్రన్స్ చెకింగ్ పాయింట్ ఇంకా కొనసాగుతోంది.ఇప్పటికే ఏ, బీ, సీ, డీ ఇతర బ్లాక్‌ల్లోని భవనాలు పూర్తిగా కూల్చివేశారు. గతంలోని మందిరం, మసీదుల ఆనవాళ్లు కూడా కనిపించలేదు.
సామాజిక దూరం లేదు..
మీడియా ప్రతినిధులను తీసుకెళ్లిన ఈ వాహనాల్లో ఎక్కడా కూడా కోవిడ్ ప్రోటోకాల్‌లో పాటించే జాగ్రత్తలేవి పాటించలేదు. వాహనాల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను కుక్కినట్టుగా సచివాలయ సందర్శనకు తీసుకెళ్లారు. వ్యక్తుల మధ్య దూరం కూడా అస్సలు పాటించలేదు. కవరేజీ కోసం ఒకరిపై ఒకరు పడుతూ పోటీపడ్డారు.
2 వేల ట్రిప్పులతో వ్యర్థాల ఎత్తివేత
తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం పాత భవనాల కూల్చివేత, శిథిలాల తొలగింపు చేపట్టినట్టు, ఇప్పటికే దాదాపు 90 శాతం కూల్చివేత పనులు పూర్తయినట్లు సీఎంవో ఒక నోట్‌ను విడుదల చేసింది. శిథిలాలు (వ్యర్థాలు) మొత్తం దాదాపు 4,500 లారీల లోడు ఉంటుందని అంచనా. ఇందులో ఇప్పటికే 2 వేల ట్రిప్పులు ఎత్తివేసినట్టు, మిగతా పనులు జరుగుతున్నట్టు పేర్కొంది. ‘ఎత్తైన భవనాలు కూల్చివేసే సందర్భంలో ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించలేదు. అందులో భాగంగా మీడియాను కూడా అనుమతించలేదు. కూల్చివేత వార్తలు సేకరించడానికి అనుమతి ఇవ్వాలని మీడియా ప్రతినిధుల నుంచి పదే పదే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ విజ్ఞప్తిని పరిశీలించి, కూల్చివేత పనులకు, వ్యర్థాల తొలగింపు పనులకు సంబంధించిన వార్తల సేకరణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు’రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment