సాక్షి, హైదరాబాద్: సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవం, సభ నిర్వహణకు సంబంధించి గురువారం శాసనసభ కమిటీ హాల్‌లో కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితో పాటు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజా ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈనెల 12 వరకు అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్న నేపథ్యంలో 13న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాల్సిందిగా కేటీఆర్ ఆదేశించారు.
జన సమీకరణకు సంబంధించి 13న జరిగే సమావేశాల్లో ప్రణాళిక రూపొందించుకోవా లని సూచించారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అవసరమైన జన సమీకరణను పర్యవేక్షించేందుకు ఇతర జిల్లాలకు చెందిన సీనియ ర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గ్రేటర్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా నియమించాలని నిర్ణయించారు.
ఇన్‌చార్జిలుగా నియమితులయ్యే నేతలు ఈ నెల 13 నుంచి 17 వరకు తమకు బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గాల్లోనే ఉండి పర్యవేక్షిస్తారు. బహిరంగసభకు ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 10 వేల మందితో జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. కొత్త సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టిన నేపథ్యంలో అన్ని నియోజక వర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నేతలకు కేటీఆర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment