సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం పుట్నాలు, బఠానీల మాదిరిగా పంచేది కాదని, సంపదను పునరుత్పత్తి చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(డిక్కి) ఆధ్వర్యంలో సైఫాబాద్‌లో ఏర్పాటు చేసిన బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్, మోడల్ కెరీర్ సెంటర్‌ను బుధవారం కేటీఆర్ ప్రారంభించారు.
తెలంగాణలో పరిశ్రమలు స్థాపించే వారి కోసం టీఎస్ ఐపాస్ నుంచి 15 రోజుల్లోనే అన్ని అనుమతులు జారీ చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇలా అందరి ముందు ఉన్నటువంటి అతిపెద్ద సవాల్ ఉపాధికల్పన, నిరుద్యోగం అన్నారు. ‘దేవుడు అందరినీ సమానంగానే పుట్టించి ఒకటే రక్తం, ఒకటే బుర్రను ఇచ్చినా అవకాశాలను మాత్రం సమానంగా ఇవ్వలేదు, మనుషులు కులం, మతం పేరిట విభజించబడి డబ్బున్నవారు, లేనివారిగా సమాజం అవతరించింది’అని పేర్కొన్నారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు.
రాష్ట్రంలో అనుకూల వాతావరణం
దేశంలో ఎక్కడాలేనివిధంగా ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనుకూల వాతావరణం తెలంగాణలో ఉందని డిక్కి జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విధానాలకు డిక్కి నమూనా ఆదర్శ చాప్టర్‌గా తయారైందని డిక్కి వ్యవస్థాపక అధ్యక్షుడు మిళింద్ తుంబ్లే అన్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా తెలంగాణ పాలసీని ప్రస్తావిస్తున్నామని, ఇతర రాష్ట్రాలు కూడా ఈ తరహా పాలసీ కోసం ప్రయత్నిస్తున్నాయన్నారు. సమావేశంలో టీఎస్‌ఐఐసీ ౖచైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment