లాజిస్టిక్ పార్కు వివరాలు తెలుసుకుంటున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో సబితా ఇంద్రారెడ్డి తదితరులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మహానగరం చుట్టూ మరో 8 లాజిస్టిక్ పార్క్‌లు ఏర్పాటు కానున్నాయని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళ్‌పల్లి, బాటసింగారంలో ఏర్పాటవుతున్న రెండు లాజిస్టిక్ పార్క్‌లకు ఇవి అదన మని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్‌ను శుక్రవారం విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలసి కేటీఆర్ ప్రారంభించారు. 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్ల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో హెచ్‌ఎండీఏ, ఆన్‌కాన్ సంస్థ కలసి దీన్ని నెలకొల్పాయి. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. దేశంలోనే పీపీపీ విధానం లో ఏర్పాటైన మొదటి లాజిస్టిక్ పార్క్ ఇదేనని కేటీఆర్ చెప్పారు.
ఈ పార్క్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందన్నారు. గతంలో నిర్మించిన మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్లకు అదనంగా మూడు ఇంటర్ స్టేట్ బస్ టెర్మినళ్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు రైల్వే టెర్మినళ్లు రాబోతున్నాయని పేర్కొన్నారు. ఒకటి చర్లపల్లిలో.. మరొకటి ఈదులనాగులపల్లిలో ఏర్పాటవుతాయని వీటిని రోడ్డు మార్గాలకు అనుసంధానిస్తామన్నారు. త్వరలో టౌన్‌షిప్ పాలసీని తీసుకురానున్నట్లు వెల్లడించారు. ముచ్చర్లలో అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటవుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ క్లస్టర్ పూర్తయితే వేల మంది యువతకు ఉద్యోగాలు దక్కుతాయన్నారు.
ఓఆర్‌ఆర్‌తో ఎన్నో సానుకూలతలు..
హైదరాబాద్ చుట్టూ 162 కిలోమీటర్ల మేర విస్తరించిన ఔటర్ రింగ్ రోడ్డు వల్ల మహానగరానికి నలువైపులా పరిశ్రమలు నెలకొల్పే సౌలభ్యం ఏర్పడిందని చెప్పారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బుద్వేల్‌లో మరొక ఐటీ క్లస్టర్ ఏర్పా టుచేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఎలిమినేడులో ఏరోస్పేస్ పార్క్ రానుందని చెప్పారు.
పనిచేయకపోతే పదవి పోతది..
‘వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో చాలామంది కౌన్సిలర్లుగా, చైర్మన్‌లుగా పోటీ చేయాలనుకుంటున్నా రు. కొత్త చట్టం గురించి చదువుకుని ఎన్నికల బరిలోకి దిగాలి. పనిచేయకపోతే పదవిపోతది. తిరిగి తీసుకునే అధికారం మున్సిపల్ మంత్రికి కూడా లేదు’’అని కేటీఆర్ వివరించారు. మన బిడ్డలకు ఉద్యోగాలు దక్కితేనే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న దానికి సార్థకత చేకూరుతుందన్నారు.
లాజిస్టిక్ పార్కులు అభినందనీయం..
లాజిస్టిక్ పార్క్‌లు ఏర్పాటు చేయడం అభినందనీయమని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. టీఎస్‌ఐపాస్ కింద సింగిల్‌విండో విధానంలో పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ఆదర్శంతో 18 నెలల్లోనే లాజిస్టిక్ పార్క్‌ని ఏర్పాటు చేశామని ఆన్‌కాన్ సంస్థ ఎండీ రాజశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ అనితారెడ్డి, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment