batasingaram
-
హైదరాబాద్.. సీజన్ పూర్తిగా ప్రారంభం కానే లేదు.. మామిడి పండ్లు మహా ప్రియం
సాక్షి, హైదరాబాద్: వేసవి అనగానే గుర్తొచ్చేది.. నోరూరించేది మామిడి. ఫలాల్లో రారాజుగా చెప్పుకునే ఈ పండ్లు ఈసారి ప్రియం కానున్నాయి. ఆలస్యంగా పూత రావడం.. దిగుబడి కూడా తక్కువగా ఉండటంతో పూర్తి స్థాయిలో సీజన్ ప్రారంభం కాలేదు. మార్చి నెలలో మామిడి మార్కెట్‌కు వస్తుందని బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అయితే అనుకున్న స్థాయిలో ఇంకా దిగుమతులు జరగలేదు. ఈ నెల ప్రారంభం నుంచి మామిడి దిగుమతులు ఉపందుకున్నప్పటికీ ధర మాత్రం హోల్‌సేల్ మార్కెట్లోనే మంచి రకం రూ.60–70 పలుకుతోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన అకాల వర్షాల వల్ల కూడా పూత రాలిపోయి తోటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మామిడి సీజన్ ఏప్రిల్ 20 తర్వాతే ప్రారంభమౌతుందని వ్యాపారులు అంటున్నారు. సోమవారం నుంచి మామిడి మార్కెట్‌కు పోటెత్తింది. బాటసింగారం మార్కెట్‌కు సోమవారం 1500–1600 టన్నుల మామిడి దిగుమతి అయిందని మార్కెట్ అధికారులు చెప్పారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో మామిడి రూ. 80–100కు లభిస్తోంది. మార్కెట్‌కు దిగుమతులు పెరిగితే ధరలు కూడా తగ్గుతాయని వ్యాపారులు అంచనా. 19 ఎకరాల్లో ఏర్పాట్లు.. మామిడి క్రయ, విక్రయాల కోసం బాటసింగారం మార్కెట్లో 19.27 ఎకరాల్లో మార్కెట్ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఈ సీజన్లో ప్రతి రోజూ 900 నుంచి 1100 వాహనాలు యార్డుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా. ఈ నేపథ్యంలో యార్డు పక్కనే ఉన్న 7 ఎకరాల స్థలాన్ని పార్కింగ్‌కు కేటాయించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మామిడి సీజన్ కోసం మరో లక్ష ఎస్ఎఫ్టీలో 5 షెడ్లు నిర్మించారు. తాగునీటి కోసం ప్రస్తుతం ఉన్న 5 ట్యాంకులకు అదనంగా మరో 2 ట్యాంకులు ఏర్పాటు చేశారు. విద్యుత్‌తో పాటు జనరేటర్‌నూ అందుబాటులో ఉంచారు. రైతులు, వ్యాపారుల కోసం రైతు విశ్రాంతి గదులుతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ సీజన్లో లక్ష మెట్రిక్ టన్నులకు పైగా మామిడి సరుకు యార్డుకు వచ్చే అవకాశం ఉందని మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కృష్ణా, చిత్తూరు జిల్లాలు, తెలంగాణలోని కొల్లాపూర్, ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి మామిడి దిగుమతి అవుతుంది. కొల్లాపూర్ మామిడికి దేశంలోనే అధిక డిమాండ్ ఉంది. బాటసింగారం మార్కెట్ నుంచి ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్తాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. అయితే ప్రస్తుతం సీజన్ ప్రారంభ దశలో ఉన్నా బాటసింగారం మార్కెట్ యార్డుకు రోజు రోజుకూ మామిడి దిగుమతి పెరుగుతోందని మార్కెటింగ్ అధికారులు పేర్కొన్నారు. -
Hyderabad: కొత్తపేట్ పండ్ల మార్కెట్ క్లోజ్
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలతో కొత్తపేట్ పండ్ల మార్కెట్ శుక్రవారం పూర్తి స్థాయిలో ఖాళీ అయింది. కమీషన్ ఏజెంట్లకు ఇప్పటికే కోర్టు ఆదేశాల ప్రకారం ముందస్తు సమాచారం అందించారు. షాపుల్లో, షెడ్లల్లో ఉన్న సామగ్రి తీసుకెళ్లాలని నోటీసులు పెట్టారు. కొత్తపేట్ నుంచి మార్కెట్‌ను పూర్తి స్థాయిలో బాటసింగారానికి తరలించారు. అక్కడ పండ్ల దిగుమతులు పెరగడంతో వ్యాపారులు, హమాలీలతో మార్కెట్ కళకళలాడుతోంది. గతంతో పోలిస్తే బాటసింగారంలో క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి. దీంతో మార్కెట్ అధికారులు కూడా పెరిగిన పండ్ల దిగుమతులతో రైతులకు, వ్యాపారుల కోసం అన్ని రకాల సౌకర్యాలు చేసినట్లు కార్యదర్శి చిలుక నర్సింహారెడ్డి తెలిపారు. (చదవండి: సర్వత్రా చర్చ.. హాట్ టాపిక్‌గా సీఎం కేసీఆర్ ప్రకటన) -
ముక్కలైన కొత్తపేట్ పండ్ల మార్కెట్.. తలో దిక్కు..
సాక్షి,హైదరాబాద్: పోయిన దసరా రోజున బాటసింగారంలో ప్రభుత్వం పండ్ల మార్కెట్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు అక్కడ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగడంలేదు. అధికారుల ఒత్తిడితో కొందరు వ్యాపారులు అక్కడికి వెళ్లినా.. వ్యాపారం సాగక తిరిగి కొత్తపేట్ పరిసరాలకే చేరుకున్నారు. రూ.కోట్లతో సకల సౌకర్యాలు కల్పించామని మార్కెటింగ్‌శాఖ ప్రకటించినా.. వ్యాపారులు, రైతులు కొత్తగా ఏర్పాటు చేసిన బాటసింగారం వైపు ఆసక్తి కనబర్చడంలేదు. కొంతమంది కమిషన్ ఏజెంట్లు కోర్టు తీర్పు వచ్చే వరకు వ్యాపారం నిలిపివేశారు. మరికొందరు ఎల్బీనగర్ చుట్టు పక్కల స్థలాలు అద్దెకు తీసుకొని వ్యాపారం చేస్తున్నారు. మరికొందరు కొత్తపేట్ పరిసరాల్లో రోడ్లపైనే క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. దీంతో గతంలో ప్రాంగణంలో కొనసాగిన వ్యాపారం ఇప్పుడు ముక్కలు ముక్కలుగా చీలిపోయింది. రోజూ వేల టన్నులకొద్దీ వచ్చే వివిధ రకాల పండ్లు నగర మార్కెట్‌కు రావడం నిలిచిపోయింది. దీంతో పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. మరోవైపు పండ్లు పండించే రైతులు సరుకులు అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాటసింగారానికి ససేమిరా.. కమిషన్ ఏజెంట్లు మాత్రం వివిధ ప్రాంతాల నుంచి పండ్లను దిగుమతి చేసుకుని ఎల్బీనగర్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. మార్కెటింగ్ అధికారులు బలవంతంగా బాటసింగరానికి తరలించినా అక్కడ వ్యాపారం చేయడానికి సిద్ధంగా లేమని తెగేసి చెబుతున్నారు. కొంత మంది చిన్న వ్యాపారులు అధికారుల బెదిరింపులతో బాటసింగారం వెళ్లి ఎంట్రీ చేసుకొని వచ్చి మళ్లీ కొత్తపేట్ ప్రాంతంలోనే పండ్లు విక్రయిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు రోడ్లపై విక్రయిస్తే కేసులు పెడతామని అధికారులు బెదిరించడంతో కొంత మంది వ్యాపారులు తుదకు వ్యాపారమే మానివేయడం వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ చిత్రంలో దిగాలుగా కూర్చున్న వ్యక్తి పేరు ఫరీద్. గతంలో కొత్తపేట్ మార్కెట్లో పండ్లు విక్రయించేవాడు. ఆ మార్కెట్‌ను మూసివేయడంతో ప్రస్తుతం రోడ్డున పడ్డాడు. బాటసింగారంలో పండ్ల అమ్మకాలు సరిగా ఉండవనే ఉద్దేశంతో కొత్తపేట్ రహదారిపైనే ఇలా పండ్లు విక్రయిస్తున్నాడు. విక్రయాలు సక్రమంగా లేక కుటుంబ పోషణ భారంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇతడి పేరు హనుమంతు. కొత్తపేట్ మార్కెట్‌ను మూసివేయడంతో కొంత కాలం వ్యాపారం చేయలేదు. ఆర్థిక పరిస్థితులు బాగాలేక కుటుంబ అవసరాల కోసం మార్కెట్ చుట్టపక్కల స్థలం అద్దెకు తీసుకొని పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. బాటసింగారం వెళ్లలేక మార్కెట్‌కు దగ్గరలో పండ్లు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. పండ్లు విక్రయిస్తున్న ఈ వ్యక్తి జహంగీర్ కొత్తపేట్ మార్కెట్‌ను మూసేసిన తర్వాత కొన్ని రోజులకు అధికారులు బలవంతం చేయడంతో బాటసింగారం వెళ్లాడు. అక్కడ వినియోగదారులు లేకపోవడంతో తిరిగి కొత్తపేటకే చేరుకున్నాడు. బాటసింగారంలో వ్యాపారం చేద్దామంటే వినియోగదారులు రావడం లేదని నిరాశ వ్యక్తంచేస్తున్నాడు. -
కొత్తపేట్ పండ్ల మార్కెట్ మూసివేతకు ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: కొత్తపేట్ పండ్ల మార్కెట్ తరలింపునకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి బాటసింగారంలో మార్కెట్ కార్యకలపాలు ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు గురువారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముత్యంరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల 25వ తేదీ అర్థరాత్రి నుంచి కొత్తపేట పండ్ల మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు తీర్మానించామన్నారు. ఇప్పటికే కొత్తపేట్ పండ్ల మార్కెట్ స్థలంలో ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 25వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు మార్కెట్ తరలింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇందుకు రైతులు, వ్యాపారులు మార్కెట్‌కు సరుకులు తీసుకురావొద్దని కోరారు. బాటసింగారంలో మార్కెట్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. రైతులకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. చదవండి: స్వచ్ఛమైన గాలి కావాలా?.. అక్కడికి వెళ్లాల్సిందే.. -
వస్తు తయారీ కేంద్రంగా హైదరాబాద్
అబ్దుల్లాపూర్‌మెట్(హైదరాబాద్): ప్రపంచంలోని నగరాల్లో హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, వస్తు తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకుగాను నగరం చుట్టూ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారకరామారావు తెలిపారు. నగరంలో తయారైన ప్రతి వస్తువును దేశంలోని అన్నిప్రాంతాలకు రవాణా చేసేందుకు లాజిస్టిక్ పార్కులు దోహదపడతాయన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలో రూ.35 కోట్ల వ్యయంతో 40 ఎకరాలలో నిర్మించిన లాజిస్టిక్ పార్కును గురువారం విద్యామంత్రి సబితాఇంద్రారెడ్డితో కలసి ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం 50 లక్షల చదరపు అడుగుల గోదాములు అందుబాటులో ఉండగా, నగరం చుట్టూ ఇంకా కోటిన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో లాజిస్టిక్ పార్కుల ఆవశ్యకత ఉందన్నారు. నగరం చుట్టూ 8 రహదారులకు ఆనుకుని లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటివరకు 14 వేలకు పైచిలుకు పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులిచ్చి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఫార్మాసిటీపై అపోహలు వద్దు.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండలంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీపై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని, దాని వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడదని కేటీఆర్ చెప్పారు. ఈ విషయంలో రాజకీయపార్టీలు రాద్ధాంతాలు చేయడం మానాలని సూచించారు. ఫార్మాసిటీ ఏర్పాటు వల్ల ఏ ఇబ్బంది వచ్చి నా పూర్తి బాధ్యత తనదేనన్నారు. ఫార్మాసిటీలో పనిచేసే కార్మికులు కూడా స్థానికంగానే నివాసముంటారని, అలాంటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 50 ఏళ్ల ముందుచూపుతో కేసీఆర్ ప్రణాళికలు: సబిత వచ్చే 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు వెలుపల ఉన్న ప్రాంతాలను కూడా హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, లాజిస్టిక్ పార్కు సీఈవో రవికాంత్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి, ఎంపీపీ బుర్ర రేఖ, జెడ్పీటీసీ సభ్యుడు బింగి దాసుగౌడ్, బాటసింగారం సహకార సంఘం చైర్మన్ లెక్కల విఠల్‌రెడ్డి, నాయకులు క్యామ మల్లేష్‌తోపాటు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
నగరం చుట్టూ 8 లాజిస్టిక్ పార్క్‌లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మహానగరం చుట్టూ మరో 8 లాజిస్టిక్ పార్క్‌లు ఏర్పాటు కానున్నాయని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళ్‌పల్లి, బాటసింగారంలో ఏర్పాటవుతున్న రెండు లాజిస్టిక్ పార్క్‌లకు ఇవి అదన మని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళ్పల్లిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్‌ను శుక్రవారం విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలసి కేటీఆర్ ప్రారంభించారు. 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్ల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో హెచ్ఎండీఏ, ఆన్‌కాన్ సంస్థ కలసి దీన్ని నెలకొల్పాయి. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. దేశంలోనే పీపీపీ విధానం లో ఏర్పాటైన మొదటి లాజిస్టిక్ పార్క్ ఇదేనని కేటీఆర్ చెప్పారు. ఈ పార్క్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందన్నారు. గతంలో నిర్మించిన మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్లకు అదనంగా మూడు ఇంటర్ స్టేట్ బస్ టెర్మినళ్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు రైల్వే టెర్మినళ్లు రాబోతున్నాయని పేర్కొన్నారు. ఒకటి చర్లపల్లిలో.. మరొకటి ఈదులనాగులపల్లిలో ఏర్పాటవుతాయని వీటిని రోడ్డు మార్గాలకు అనుసంధానిస్తామన్నారు. త్వరలో టౌన్షిప్ పాలసీని తీసుకురానున్నట్లు వెల్లడించారు. ముచ్చర్లలో అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటవుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ క్లస్టర్ పూర్తయితే వేల మంది యువతకు ఉద్యోగాలు దక్కుతాయన్నారు. ఓఆర్ఆర్తో ఎన్నో సానుకూలతలు.. హైదరాబాద్ చుట్టూ 162 కిలోమీటర్ల మేర విస్తరించిన ఔటర్ రింగ్ రోడ్డు వల్ల మహానగరానికి నలువైపులా పరిశ్రమలు నెలకొల్పే సౌలభ్యం ఏర్పడిందని చెప్పారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బుద్వేల్‌లో మరొక ఐటీ క్లస్టర్ ఏర్పా టుచేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఎలిమినేడులో ఏరోస్పేస్ పార్క్ రానుందని చెప్పారు. పనిచేయకపోతే పదవి పోతది.. ‘వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో చాలామంది కౌన్సిలర్లుగా, చైర్మన్లుగా పోటీ చేయాలనుకుంటున్నా రు. కొత్త చట్టం గురించి చదువుకుని ఎన్నికల బరిలోకి దిగాలి. పనిచేయకపోతే పదవిపోతది. తిరిగి తీసుకునే అధికారం మున్సిపల్ మంత్రికి కూడా లేదు’’అని కేటీఆర్ వివరించారు. మన బిడ్డలకు ఉద్యోగాలు దక్కితేనే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న దానికి సార్థకత చేకూరుతుందన్నారు. లాజిస్టిక్ పార్కులు అభినందనీయం.. లాజిస్టిక్ పార్క్‌లు ఏర్పాటు చేయడం అభినందనీయమని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. టీఎస్ఐపాస్ కింద సింగిల్‌విండో విధానంలో పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ఆదర్శంతో 18 నెలల్లోనే లాజిస్టిక్ పార్క్‌ని ఏర్పాటు చేశామని ఆన్‌కాన్ సంస్థ ఎండీ రాజశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
చైన్ స్నాచర్ దాడి : మహిళకు తీవ్రగాయాలు
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బాటసింగారం గ్రామ సమీపంలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న మహిళపై ఆగంతకుడు దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లాడు. అనంతరం అతడు అక్కడి నుంచి పరారైయ్యాడు. ఈ క్రమంలో సదరు మహిళ బైక్‌పై నుంచి కిందపడి ... తీవ్రంగా గాయపడ్డింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆగిన ట్రావెల్స్ బస్సు : ప్రయాణికులు ఇక్కట్లు
హైదరాబాద్: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న భాను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శనివారం బ్రేకులు ఫెయిల్ అయ్యయి. దాంతో బస్సును రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బాట సింగారం వద్ద డ్రైవర్ నిలిపివేశాడు. దాంతో ప్రయాణికులు ఈ రోజు తెల్లవారుజాము నుంచి జాతీయ రహదారిపై పడిగాపులు పడుతున్నారు. భాను ట్రావెల్స్ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణీకులు ఆగ్రహిస్తున్నారు. -
అగివున్న లారీని ఢీ కొన్న DCM