అబ్దుల్లాపూర్‌మెట్(హైదరాబాద్): ప్రపంచంలోని నగరాల్లో హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, వస్తు తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకుగాను నగరం చుట్టూ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారకరామారావు తెలిపారు. నగరంలో తయారైన ప్రతి వస్తువును దేశంలోని అన్నిప్రాంతాలకు రవాణా చేసేందుకు లాజిస్టిక్ పార్కులు దోహదపడతాయన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలో రూ.35 కోట్ల వ్యయంతో 40 ఎకరాలలో నిర్మించిన లాజిస్టిక్ పార్కును గురువారం విద్యామంత్రి సబితాఇంద్రారెడ్డితో కలసి ప్రారంభించారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం 50 లక్షల చదరపు అడుగుల గోదాములు అందుబాటులో ఉండగా, నగరం చుట్టూ ఇంకా కోటిన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో లాజిస్టిక్ పార్కుల ఆవశ్యకత ఉందన్నారు. నగరం చుట్టూ 8 రహదారులకు ఆనుకుని లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటివరకు 14 వేలకు పైచిలుకు పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులిచ్చి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
ఫార్మాసిటీపై అపోహలు వద్దు..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండలంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీపై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని, దాని వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడదని కేటీఆర్ చెప్పారు. ఈ విషయంలో రాజకీయపార్టీలు రాద్ధాంతాలు చేయడం మానాలని సూచించారు. ఫార్మాసిటీ ఏర్పాటు వల్ల ఏ ఇబ్బంది వచ్చి నా పూర్తి బాధ్యత తనదేనన్నారు. ఫార్మాసిటీలో పనిచేసే కార్మికులు కూడా స్థానికంగానే నివాసముంటారని, అలాంటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
50 ఏళ్ల ముందుచూపుతో కేసీఆర్ ప్రణాళికలు: సబిత
వచ్చే 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు వెలుపల ఉన్న ప్రాంతాలను కూడా హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, లాజిస్టిక్ పార్కు సీఈవో రవికాంత్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి, ఎంపీపీ బుర్ర రేఖ, జెడ్పీటీసీ సభ్యుడు బింగి దాసుగౌడ్, బాటసింగారం సహకార సంఘం చైర్మన్ లెక్కల విఠల్‌రెడ్డి, నాయకులు క్యామ మల్లేష్‌తోపాటు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment