
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనల ఘటన ముగియకముందే నిజాం కాలేజీ విద్యార్థులు నిరసనలు దిగారు. నిజాం కాలేజీలో విద్యార్థినిలు ఆందోళన బాటపట్టారు. డిగ్రీ విద్యార్థులకు హాస్టల్ బిల్డింగ్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని ఆందోళనలు చేస్తున్నారు.
కొత్త హాస్టల్ బిల్డింగ్‌ను పీజీ విద్యార్థులకు కేటాయించడంపై నిరసనలు తెలుపుతున్నారు. యూజీ హాస్టల్ పీజీ కెట్ల..? డిగ్రీ వాళ్లు ఉండేదెట్ల..? అంటై ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఇక, విద్యార్థినిల ఆందోళనలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ విషయంపై కేటీఆర్.. మంత్రి సబిత ఇంద్రారెడ్డికి ట్వీట్ చేసి.. సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ మంత్రి సబిత సమాధానమిస్తూ.. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించనున్నట్టు పేర్కొన్నారు.