సచివాలయ కూల్చివేతను అడ్డుకోండి
హైకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పిల్
సాక్షి, హైదరాబాద్: సచివాలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నవంబర్‌లో శంకుస్థాపనలు చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలని జీవన్‌రెడ్డి తరఫు న్యాయవాది సరసాని సత్యంరెడ్డి గురువారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై శుక్రవారం విచారణ చేపడుతామని ధర్మాసనం తెలిపింది.
వాస్తు పేరుతో ప్రజా ధనం వృథా...
‘హైదరాబాద్‌లో సచివాలయం దాదాపు 20 ఎకరాల్లో ఉంది. ఇందులో పురావస్తు భవనం, గ్యారేజీ, సివిల్, ఆయుర్వేద, హోమియోపతి ఆసుపత్రులు, గుడి, మసీదు, చర్చి కూడా ఉన్నాయి. అత్యధిక నిర్మాణాలు 1980లో చేపట్టినవి కాగా, కొన్నింటిని ఇటీవల కూడా నిర్మించారు. ఈ భవనాలన్నీ కూడా మరో వందేళ్ల పాటు మనగలవు. ఇటీవల వాస్తు, ఇతర బహిర్గతం చేయని కారణాలతో ఈ భవనాలన్నింటినీ కూల్చివేసి వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్త నిర్మాణాలకు రూ.500 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనున్నది. వాస్తు పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తోంది. ఇదే విషయాన్ని సీఎం, సీఎస్‌ల దృష్టికి తీసుకెళ్లా. ప్రజలకు ఎన్నో హామీలిచ్చిన ప్రభుత్వం వాటిని అమలు చేయడంలేదు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని సచివాలయ భవనాల కూల్చివేతలను అడ్డుకోండి’ అని జీవన్‌రెడ్డి తన పిటిషన్‌లో కోర్టును కోరారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి, ఆర్‌అండ్‌బీ ఇంజనీర్ ఇన్ చీఫ్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.