'హైకోర్టు విభజనను ఏపీ అడ్డుకుంటోంది'
- సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి
జగిత్యాల : తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కోసం నిరసన దీక్షలు చేస్తున్న న్యాయవాదుల ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారక ముందే ఉమ్మడి హైకోర్టును విభజించాలని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం కోర్టు ఎదుట దీక్ష చేపట్టగా, జీవన్‌రెడ్డి వారికి సంఘీభావం ప్రకటించారు.
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టుగానే హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. ప్రత్యేక హైకోర్టు లేకపోవడం వల్ల తెలంగాణ హక్కుల పరిరక్షణలో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. న్యాయవ్యవస్థను వారి చేతుల్లో ఉంచుకునేందుకే ఏపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హైకోర్టు విభజన జరగకుండా అడ్డుకుంటోందని జీవన్రెడ్డి ఆరోపించారు. పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ ప్రజల మనోభావాలను ఏపీ సీఎం చంద్రబాబు గౌరవించాలని సూచించారు.