సచివాలయం కూల్చివేత చట్టవిరుద్ధం కాదు: హైకోర్టు | High Court Approves Demolition of Secretariat In Telangana | Sakshi
Sakshi News home page

సచివాలయం కూల్చివేత చట్టవిరుద్ధం కాదు: హైకోర్టు

Published Tue, Jun 30 2020 2:15 AM | Last Updated on Tue, Jun 30 2020 8:08 AM

High Court Approves Demolition of Secretariat In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలన్న రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం ఏ చట్ట నిబంధనలకూ విరుద్ధం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే కేబినెట్‌ నిర్ణయం ఏకపక్షం, అసమంజసం ఎంతమాత్రం కాదని తేల్చిచెప్పింది. సచివాలయం విషయంలో మంత్రిమండలి 2019 జూన్‌ 18న తీసుకున్న నిర్ణయం కేవలం మధ్యంతర నిర్ణయం మాత్రమేనని, కొత్త సచివాలయ నిర్మాణం అవసరమా లేదా? అనే అంశంపై కేబినెట్‌ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించింది. కొత్త సచివాలయ నిర్మాణం వల్ల ఖజానాపై భారం పడుతుందన్న అంశంలోకి తాము వెళ్లబోమని, ఖర్చుల అంశం పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోనిదని తెలిపింది.

దేనికి ఎప్పుడు, ఎంత ఖర్చు చేయాలన్న అంశం పూర్తిగా కార్యనిరాహక వ్యవస్థ పరిధిలోనిదని, అందువల్ల ఈ విషయంలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోజాలదని స్పష్టం చేసింది. హైదరాబాద్‌ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని కాదని, కాబట్టి భవనాల కేటాయింపు అధికారం గవర్నర్‌కే ఉంటుందన్న వాదన ఎంతమాత్రం చెల్లుబాటు కాదని తేల్చిచెప్పింది. సచివాలయ నిర్మాణం విషయంలో మంత్రిమండలి నిర్ణయాలను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ప్రస్తుత సచివాలయం స్థానంలో కొత్త సచివాలయం నిర్మించాలన్న కేబినెట్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి, న్యాయవాది తేరా రజనీకాంత్‌రెడ్డి, ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి ఎం. పద్మనాభరెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అనుముల రేవంత్‌రెడ్డి, ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావులు వేర్వేరుగా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు వాయిదా వేసిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది.

తుది నిర్ణయం కానే కాదు...
‘మా ముందున్న ప్రధాన చర్చనీయాంశ విషయం ఏమిటంటే కేబినెట్‌ నిర్ణయం ఏకపక్ష, అసమంజస నిర్ణయమా? కేబినెట్‌ నిర్ణయం ఏదైనా చట్ట నిబంధనలకు విరుద్ధమా? ఈ అంశాల్లోకి వెళ్లే ముందు మంత్రిమండలి నిర్ణయ ప్రక్రియను మాత్రమే మేం పరిగణనలోకి తీసుకుంటున్నాం. ప్రభుత్వ విధాన నిర్ణయంపై మేం అప్పీలేట్‌ అథారిటీలాగా వ్యవహరించట్లేదు. 18.06.2019 నాటి కేబినెట్‌ నిర్ణయాన్ని పరిశీలిస్తే మంత్రిమండలి రెండు ఆప్షన్లను పరిశీలించింది. మొదటిది ప్రస్తుత సచివాలయ నిర్మాణాలను మార్పు చేయడం. రెండోది ప్రస్తుత నిర్మాణాలను కూల్చేసి వాటి స్థానంలో కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టడం. కాబట్టి మంత్రిమండలి నిర్ణయం తుది నిర్ణయం కాదని, కేవలం మధ్యంతర నిర్ణయం మాత్రమేనని స్పష్టమవుతోంది. అందువల్ల సచివాలయం కూల్చివేతకు కేబినెట్‌ తీసుకున్నది తుది నిర్ణయమన్న పిటిషనర్ల వాదన తప్పు’అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

2012 నుంచే కేబినెట్‌ పరిశీలనలో...
‘సచివాలయం అంశాన్ని మంత్రిమండలి పరిశీలించడం ఇది తొలిసారి కాదు. 2012, 2013లో సచివాలయ భద్రతకు సంబంధించి రెండు నివేదికలు వచ్చాయి. 2014లో అగ్నిమాపక శాఖ సచివాలయంలో అగ్నినిరోధక వ్యవస్థ లేకపోవడంపై నివేదిక ఇచ్చింది. 2015లో మంత్రిమండలి సమావేశంలో ఇది చర్చకు సైతం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సచివాలయం స్థానంలో కొత్త నిర్మాణం చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాల్‌ చేస్తూ 2016లో పిటిషన్లు దాఖలయ్యాయి. 2016లో అగ్నిమాపక శాఖ ప్రస్తుత భవనంలో ఉన్న అనేక లోపాలను పేర్కొంటూ నివేదిక ఇచ్చింది. దీంతో 2019లో సచివాలయం విషయమై కేబినెట్‌ మరోసారి చర్చించింది. అయితే తుది నిర్ణయం తీసుకోలేదు.

కొత్త సచివాలయ నిర్మాణం అన్నది ప్రస్తుతం కేవలం ప్రణాళిక దశలోనే ఉంది. మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయడం, సాంకేతిక కమిటీ, ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) నుంచి నివేదికలు కోరడం సమర్థనీయమే. తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు ఈ నివేదికలు కేబినెట్‌ ముందుకొస్తాయని అడ్వొకేట్‌ జనరల్‌ చెప్పారు. వాస్తవానికి కేబినెట్‌ తుది నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి తుది నిర్ణయం తీసుకోవడానికి మంత్రిమండలి ముందు ఎటువంటి మెటీరియల్‌ లేదన్న పిటిషనర్ల వాదన ఆమోదయోగ్యం కాదు’అని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.

ప్రస్తుత భవనం పనికి రాదని నివేదికలు...
‘ప్రస్తుత సచివాలయ భవనం చాలా చోట్ల కుంగిపోయి.. పునరుద్దరణకు ఏ మాత్రం ఆస్కారం లేని విధంగా ఉందన్న నిపుణుల కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుత భవనాల జీవన కాలాన్ని 70 ఏళ్లగా నిర్ణయించారు. అయితే జీ బ్లాక్‌ 131 ఏళ్ల క్రితం నిర్మించింది. అది కూలిపోయే దశకు చేరుకుంది. ఐజీబీసీ నిర్దేశించిన హరిత భవనాల నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుత సచివాలయం లేదు. ఇంకుడు గుంతల వ్యవస్థ, సౌర విద్యుత్‌ వ్యవస్థ, తగినంత వెలుతురు, గాలి, సరైన వైరింగ్‌ వ్యవస్థ కూడా లేదు.

ముఖ్యమంత్రి ఉంటున్న ప్రస్తుత భవనం కూడా 41 ఏళ్ల క్రితం నిర్మించిందని నివేదికలు చెబుతున్నాయి. వ్యర్థ జలాల నిర్వహణ వ్యవస్థ లేదు. దివ్యాంగులకు అనుకూలమైన వాతావరణం లేదు. ఇలా అనేక లోపాలున్న ప్రస్తుత సచివాలయ భవన నిర్వహణ చాలా కష్టమన్న ప్రభుత్వ వాదన సమర్థనీయమే’అని ధర్మాసనం పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement